శశికళ నిష్క్రమణ వెనుక ‘కమలం’ డీల్‌?

0
320
  • ఐశ్వర్యమా..?  అధికారమా?
  • ఏదో ఒకటి తేల్చుకోవాలన్న బీజేపీ
  • అన్నాడీఎంకే ఓట్లు చీలకుండా వ్యూహం
  • పార్టీ ఓడితే మళ్లీ తెరపైకి చిన్నమ్మ
  • తమిళనాట రసకందాయంలో రాజకీయం

చెన్నై : ఐశ్వర్యం కావాలా..? అధికారం కావాలా..?…. తేల్చుకోవాలని శశికళపై బీజేపీ ఒత్తిడి తెచ్చిందా?  జయలలిత నెచ్చెలి వీకే శశికళ ఆకస్మిక రాజకీయ సన్యాసం వెనుక అసలు కారణం ఇదేనా? తమిళనాడులో ఇపుడు అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా అన్నాడీఎంకే అంతర్గత రాజకీయమే హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో 150పై చిలుకు స్థానాలతో స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే జయభేరి మోగించడం ఖాయమని దాదాపుగా అన్ని సర్వేలూ తేల్చేశాయి. అన్నాడీఎంకే ఘోరపరాభవం చవిచూడబోతోందని కూడా అంచనాలు వెలువడ్డాయి. ఈ వివరాలు చూసుకున్నాక 10 రోజుల కిందటి దాకా స్టాలిన్‌ చాలా ఊరడిల్లిన మనిషిలా కనబడ్డారు.  కానీ జనవరి 27వ తేదీ… పరిస్థితిని మార్చేసింది. ఆరోజున బెంగళూరు జైలు నుంచి శశికళ విడుదలయ్యారు. అవినీతి మచ్చ పడ్డ ఆమె పని ముగిసినట్లేనని అంతా అనుకున్న తరుణంలో ఆమెకు లభించిన అపూర్వ స్వాగతం డీఎంకేకు ముచ్చెమటలు పోయించింది. బెంగళూరు నుంచి చెన్నైకి ఆరు గంటల ప్రయాణం. అలాంటిది ఆమె చేరుకోవడానికి ఓ రోజంతా పట్టింది. వందల కొద్దీ వాహనాలు ఆమె కారును అనుసరించాయి. ఆమె కూడా వ్యూహాత్మకంగా అన్నాడీఎంకే జెండా ఉన్న కారులో ప్రయాణించి ఓ గట్టి సంకేతాన్ని పంపారు. పార్టీకి నేతను నేనే… అన్న ఆ సంకేతం పళనిస్వామి- పన్నీరుసెల్వాలకు (ఈపీఎ్‌స-ఓపీఎస్‌) గట్టిగా తగిలింది. ఈ అపూర్వ స్పందన చూసి బీజేపీకూడా తీవ్రాలోచనలో పడింది. ‘ఈపీఎ స్‌-ఓపీఎ్‌సలతో ఇక లాభం లేదు.

ఈ ఎన్నికల్లో వారెటూ అన్నాడీఎంకేను గెలిపించలేరు. శశికళను తిరిగి జయపార్టీలో చేర్చుకుంటే ఓ బలవత్తర శక్తిగా మున్ముందు డీఎంకేను ఎదుర్కొనడం వీలవుతుంది…’ అని భావించి అన్నాడీఎంకే నేతలతో అమిత్‌ షా గత ఆదివారంనాడు మంతనాలు జరిపారు. ఓపీఎస్‌ ఒప్పుకున్నా ముఖ్యమంత్రి ఈపీఎస్‌ మాత్రం ఆమెను చేర్చుకోవడానికి ససేమిరా అన్నారు. ఒకసారి ఆమెను చేర్చుకుంటే ఇక తమకు అధోగతే… అని ఆయనకు తెలుసు. ఆమె పార్టీ మొత్తాన్ని కంట్రోల్‌ చేయగలరు. అంతెందుకు… గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసిన వారంతా శశికళ ఎంపికచేసినవారే. కేడర్‌ మొత్తం ఆమె వెంటే ఇప్పటికీ ఉంది. ఈపీఎస్‌ మొండికేయడం వల్ల బీజేపీ ప్రయత్నాలకు ఆటంకం ఎదురయ్యింది. దీంతో బీజేపీ అట్నుంచి నరుక్కుని వచ్చింది. ‘ఎవరొచ్చినా ఈ ఎన్నికల్లో ఎటూ పార్టీ ఓటమి ఖాయం.. మీ మేనల్లుడు, ఆర్‌కే నగర్‌ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ వల్లా, మీ వల్లా అన్నాడీఎంకే ఓటు చీలుతుంది. ఇది దీర్ఘకాలంలో పార్టీకి మరింత నష్టం. దీనికి బదులు ప్రస్తుతానికి రాజకీయ సన్యాసం ప్రకటించి- ఆ తరువాత తిరిగొస్తే అపుడు పార్టీలో ఎదురుండదు’ అని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం.

అంతులేని ఆస్తులు!
దీనికంటే ఎక్కువగా శశికళను బీజేపీ ఒప్పించిన అంశం.. ఆస్తుల వ్యవహారం. ఒక అంచనా ప్రకారం ఆమె ఆస్తులు దాదాపు రూ.2,500 కోట్లకు పైమాటే! జయలలిత ఒకప్పటి నివాసం పొయెస్‌ గార్డెన్స్‌కు ఎదురుగా ఉన్న విశాలమైన స్థలాలన్నీ శశివే. అక్కడే ఆమె ఓ పెద్ద భవంతిని నిర్మించుకుంటున్నారు. ఈడీ జప్తు చేయడం వల్ల దాని నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. ఇక మహాబలిపురం రోడ్డులోని, కాంచీపురం వద్ద, మదురైలోనూ ఉన్న కోట్లాది విలువ చేసే భూములు, ప్రాజెక్టులు, మిల్లులు, ఇతర ఆస్తులు శశికళకు ఉన్నాయి. వీటిలో ఈ అన్నింటిలో అనేక ఆస్తులను ఈడీ ద్వారా జప్తు చేయించడం ద్వారా శశికళను బీజేపీ తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆస్తులు కావాలంటే ప్రస్తుతానికి అధికారానికి, ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కండి.. అన్న సందేశాన్ని శశికి బీజేపీ నాయకత్వం నేరుగానే స్పష్టం చేసినట్లు భోగట్టా.

బీజేపీ ఆలోచనలివీ…
కర్ణాటక మినహా దక్షిణాదిన ఇప్పటికీ పార్టీకి బలమైన ఎంట్రీలేని పరిస్థితి బీజేపీది. నాలుగేళ్లుగా పళనిస్వామిని చేరదీసినా బీజేపీకి ఒరిగిందేమీ లేదు. ఇప్పటికీ బీజేపీ అంటే తమిళనాట పరాయి పార్టీ.. ఆర్యుల పార్టీ… హిందీని బలవంతంగా రుద్దే పార్టీ.. జల్లికట్లును అడ్డుకున్న పార్టీ. తమిళ సంస్కృతిని దెబ్బతీసిన పార్టీగా పేరు. ఆ మచ్చ చెరిగిపోవాలంటే బలమైన నాయకత్వంతో చెలిమి ముఖ్యం. స్టాలిన్‌ సారథ్య డీఎంకేతో ప్రస్తుతానికి దోస్తీ అసాధ్యం. శశికళను చేరదీస్తే రాబోయే రోజుల్లో అంటే కనీసం 2024 ఎన్నికల వేళకయినా తమిళనాట కొన్ని సీట్లు సాధించవచ్చని ఆలోచన. రాబోయే నెలల్లో శశికళ మీద ఉన్న కేసులు ఒకటొకటిగా మందకొడిగా సాగుతాయి.. ఈడీ పంజా పెద్దగా ఉండదు, స్టాలిన్‌ సర్కార్‌ను నిద్రపోనివ్వకుండా ఆమె చేత రాజకీయం నడిపించవచ్చు… ఇవీ బీజేపీ ఆలోచనలు.

గురుమూర్తి డ్రాఫ్టింగ్‌
రాజకీయ నిష్క్రమణ ప్రకటిస్తూ శశికళ రాసిన లేఖ ఆమె స్వయానా రాసినది కాదనీ, దాని వెనుక కూడా బీజేపీ హస్తం ఉందనీ ప్రచారం జరుగుతోంది. శశికళను తిరిగి అన్నాడీఎంకేలో చేర్చుకుంటేనే మనుగడ.. అని ఆది నుంచీ గట్టిగా కోరుతూ వస్తోన్న స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ నేత, ఆర్థికవేత్త ఎస్‌ గురుమూర్తి ఈ లేఖను డ్రాఫ్ట్‌ చేసినట్లు సమాచారం. అన్నాడీఎంకేను గెలిపించండి, నేనెన్నడూ పదవులను కోరుకోలేదు.. మొదలైన వాక్యాలు ఆయనవేనని చెబుతున్నారు.

స్టాలిన్‌కిక నల్లేరుమీద నడకే!
అన్నాడీఎంకేలో అంతర్గత రాజకీయం మాటెలా ఉన్నా స్టాలిన్‌కు మాత్రం ఆమె నిష్క్రమణ పెద్ద రిలీఫ్‌. దేవర్‌ వర్గానికి చెందిన శశికళకు మదురై, తేని మొదలైన దక్షిణ తమిళనాడు జిల్లాల్లో పట్టుంది. చెన్నైతో పాటు ఉత్తర తమిళనాడులో పూర్తి ఆధిపత్యం ఉన్న స్టాలిన్‌ ఇక దక్షిణాన కూడా తనకు ఎదురుండదని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో మొత్తం 39 లోక్‌సభ సీట్లకు 38 స్థానాలను ఆయన సారధ్యంలోని కూట మి కైవసం చేసుకుంది. 38 స్థానాలంటే సుమారు 221 అసెం బ్లీ సీట్ల కింద లెక్క. తమిళనాట మొత్తం అసెంబ్లీ స్థానాలు 234. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినవి 118 సీట్లే. ఈ లెక్కన ఆయన పార్టీ అఖండ విజయం దిశగా దూసుకెళ్లే అవకాశాలున్నాయని అన్నాడీఎంకే వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి.

శశికళ వ్యూహం
శశికళకూ తెలుసు, ఈ ఎన్నికల్లో తాను ప్రచారం చేసినా అన్నాడీఎంకేను గెలిపించలేనని! నాలుగేళ్ల జైలు జీవితం అనుభవించిన ఆమె కొంతమేర కేడర్‌లో సానుభూతి సంపాదించుకోగలిగారు. కానీ పార్టీని తిరిగి తాను స్వాధీనం చేసుకోవాలంటే ఇది చాలదు. ఈ ఎన్నికల్లో  ఈపీఎ్‌స-ఓపీఎప్‌ సారథ్యంలో పార్టీ మట్టికరవాలి. తదనంతరం పార్టీలో వారిరువురిపై తిరుగుబాటు రావాలి. అపుడు తిరిగి నాయకులంతా తన నివాసానికి క్యూ కట్టడం తథ్యం. పార్టీ మొత్తాన్ని చేపట్టగలిగితేనే తిరిగి తీవ్రస్థాయిలో డీఎంకేను ఎదుర్కొనగలనని ఆమెకు తెలుసు. అంతేకాక… జయ నీడ నుంచి బయటపడి తనకు తానుగా ఓ నేతగా ఎదగడానికి ఈ వ్యూహం దోహదపడుతుంది. కేవలం అవినీతిపరురాలిన్న ముద్ర చెరిపేసుకుని పట్టున్న నేతగా నిరూపించుకోవడానికి ఇదో అవకాశం. మేనల్లుడు దినకరన్‌ పెట్టిన పార్టీ (ఏఎంఎంకే) వల్ల అన్నాడీఎంకే ఓటు చీలితే అది తదనంతరం తనకే నష్టం.. అందుచేత ఆ పార్టీకి తాను మద్దతివ్వరాదు. జయ వారసురాలిగా నిలదొక్కుకోవడానికి జయ పెట్టిన పార్టీలోనే ఉండాలి. వీటికి తోడు పార్టీని తిరిగి పట్టాలెక్కించాలంటే ఆస్తులు ముఖ్యం. వాటిని కాపాడుకోవాలి. బీజేపీ సహకారముంటేనే అది సాధ్యం. అందుకే ఆమె రాజకీయ సన్యాసానికి ఓకే అన్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply