చావు తప్పి…

0
296

– ఎన్నికల్లో బీజేపీకి షాక్‌..
– హర్యానాలో ఏడుగురు మంత్రుల ఓటమి..
– ‘కింగ్‌ మేకర్‌’గా దుశ్యంత్‌ చౌతాలా
– గుజరాత్‌లోనూ కాషాయపార్టీకి గట్టి పోటీనిచ్చిన హస్తం
– పుంజుకున్న కాంగ్రెస్‌..’మహా’లో ఎన్సీపీకి పెరిగిన సీట్లు
ముంబయి, చండీగఢ్‌, ఢిల్లీ : జాతీయవాదంతో ప్రజలను రెచ్చగొట్టి మరోసారి ఓట్లను దండుకోవాలనుకున్న కమలనాధులకు రెండు రాష్ట్రాల ఓటర్లు షాకిచ్చారు. దీంతో ‘చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు’గా.. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. మహారాష్ట్రలో అత్తెసరు మెజారిటీతో గట్టెక్కగా.. హర్యానాలో ఓటరు మహాశయులు ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ ఇవ్వకపోవడంతో అక్కడ హంగ్‌ ఏర్పడింది. దీంతో దుశ్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) కింగ్‌ మేకర్‌ అయ్యింది. ఆయన ఎవరివైపు మొగ్గు చూపితే వారే అధికారం చేపట్టే పరిస్థితి అక్కడ నెలకొంది. ఎన్నికల ప్రచార సభల్లోనూ, ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ దూకుడు ప్రదర్శించిన బీజేపీ.. ఫలితాల్లో మాత్రం దారుణంగా తేలిపోయింది. రెండు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ స్థానాలకు, 2 పార్లమెంటు సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీని తిరస్కరించడం విశేషం. ఎన్నికల్లో గెలిచేందుకు ఆర్టికల్‌ 370 రద్దు, జాతీయవాదం, హిందూత్వ వంటి వివాదాస్పద అంశాలను ప్రచారంలో పెట్టినా ఫలితం లేకుండా పోయింది. ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్‌ చేస్తూ సీబీఐ, ఈడీ, ఆదాయపుపన్ను వంటి సంస్థలను అధికార పార్టీ ఉసిగొల్పింది. అరెస్టులకు పాల్పడింది. సినిమా తారలను, క్రీడాకారులనూ చేర్చుకొని కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కమలనాధులు ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఆ పార్టీకి గతంలో కంటే సీట్లు, ఓట్లు తగ్గాయి.

గుజరాత్‌లో హౌరాహౌరి
మోడీ, షా ల సొంత రాష్ట్రం గుజరాత్‌లోని ఆరు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య హౌరాహౌరి పోరు నడిచింది. ఖరేలు, అమరైవడి, లున్వాడాలో బీజేపీ గెలువగా.. రధన్‌పూర్‌, భవధ్‌, తరాడ్‌లలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. రెండేండ్ల క్రితం గుజరాత్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఠాకూర్‌ల వర్గం నాయకుడు అల్పేశ్‌ ఠాకూర్‌.. కొంతకాలం క్రితమే బీజేపీలో చేరారు. ఆ పార్టీ టికెట్‌ మీద పోటీ చేసిన ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
యూపీలో ఏడు.. బీహార్‌లో కమలానికి సున్నా..
బీహార్‌లో ఎన్డీయే కూటమి ఖాతా దారుణ పరాజయం పాలైంది. ఐదు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ-జేడీ(యూ) కూటమి ఒక్క స్థానానికే పరిమితమైంది. అనూహ్యంగా ఎఐఎంఐఎం ఇక్కడ పాగా వేయడం గమనార్హం. కిషన్‌గంజ్‌లో ఆ పార్టీ అభ్యర్థి కమ్రల్‌ హుడా.. బీజేపీ అభ్యర్థి ప్రీతి సింగ్‌పై విజయం సాధించారు. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఒక్క స్థానంలో జేడీ(యూ) గెలిచింది.
ఉత్తరప్రదేశ్‌లో 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాల్లో గెలుపొందగా.. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 3, అప్నాదళ్‌ 1 స్థానాన్ని గెలుచుకుంది.

దేశవ్యాప్తంగా అదే సీను..
రెండు రాష్ట్రాలే గాక మిగిలిన రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఛత్తీస్‌గడ్‌లో కమలం పార్టీ అభ్యర్థి కశ్యాప్‌ చిత్తుగా ఓటమి చెందారు. ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. కేరళలో ఐదు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానాన్ని కూడా గెలిపొందలేదు. అంతేకాక గతంలో రెండు స్థానాల్లో రెండో స్థానంలో ఉంటే, ప్రస్తుతం అది ఒక స్థానానికి పడిపోయింది. మధ్యప్రదేశ్‌లో ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భాను భూరియా కూడా చిత్తుగా ఓటమి చెందారు. ఆ స్థానాన్ని కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. ఒడిషాలో ఒక స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీి అభ్యర్థి శాంత కుమార్‌ గార్టియా చిత్తుగా ఓటమి చెందింది. దీన్ని అధికార బీజేడీ సొంతం చేసుకుంది. పంజాబ్‌లో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా, మెజార్టీ స్థానాల్లో బీజేపీ కూటమి ఓటమి చెందింది. మూడింటిలో కాంగ్రెస్‌, ఒక స్థానంలో శిరోమణి అకాలీ దళ్‌ గెలిచింది. రాజస్థాన్‌లో రెండు స్థానాలకు జరగగా అక్కడా బీజేపీకి ఓటమే ఎదురైంది. అక్కడ ఒక స్థానంలో కాంగ్రెస్‌, మరో స్థానంలో ఆర్‌ఎల్‌పి గెలిచాయి. అసోంలో బీజేపీ మూడు, ఎఐయుడీఎఫ్‌ ఒకటి గెలుచుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో రెండింటికి రెండూ కమలం పార్టీనే గెలిచింది. సిక్కీంలో మూడు స్థానాలకు గానూ రెండింటిని గెలుచుకుంది. ఒక స్థానాన్ని ఎకేఎం సొంతం చేసుకుంది. మేఘాలయాలో ఒక స్థానానికి ఎన్నికలు జరిగగా, దాన్ని యూడీపీ సొంతం చేసుకుంది. పుదుచ్చేరిలో ఒక స్థానానికి ఎన్నికలు జరగగా, అక్కడ కాంగ్రెస్‌ గెలిచింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో స్వతంత్ర అభ్యర్థి గెలిపొందారు. తమిళనాడులో రెండు స్థానాలనూ అధికార అన్నాడీఎంకే గెలిచింది. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ గెలుపొందింది.

హర్యానాలో హంగ్‌
హర్యానాలో ‘ఔర్‌ ఏక్‌బార్‌.. మనో (మనోహర్‌లాల్‌ ఖట్టర్‌) సర్కార్‌’ నినాదంతో ఎన్నిక లకు వెళ్లిన బీజేపీకి అక్కడి ఓటర్లు కర్రుకాల్చి వాత పెట్టారు. రాష్ట్ర క్యాబినెట్‌లో ఏకంగా ఏడుగురు మంత్రులు ఓడిపోవడమే దీనికి నిదర్శనం. 90 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 40 సీట్ల వద్దే ఆగిపోగా.. కాంగ్రెస్‌ 31, జేజేపీ 10, ఇతరులు 9 సీట్లు గెలుపొందారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 46.
రెండు నెలల ముందే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినా.. ప్రతిపక్ష నాయకులపై పాత కేసులు తిరగ తోడినా.. జాతీయభద్రత అంశా న్ని లేవ నెత్తినా.. అంతర్జాతీయ వేదికలపై మెరి సిన క్రీడా కారులను పోటిలో నిలిపినా కమలనాధులకు విజయం దక్కలేదు. ఎన్నికల సందర్భంగా బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఇక్కడే తిష్టవేసినా గత ఎన్ని కల కంటే సీట్లు, ఓట్ల శాతం తగ్గింది. ఇక హర్యానాలో అసలు పోటీలోనే నిలవద నుకున్న కాంగ్రెస్‌ అనూహ్యంగా పుంజుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో 19 స్థానాల్లో విజయం సాధించిన ఐఎన్‌ఎల్‌డీ ప్రస్తుతం ఒక్క స్థానానికే పరి మితం కాగా తన తాత పేరు (మాజీ ఉప ప్రధాని ది వంగత చౌదరి దేవీలాల్‌) మీదే పార్టీ స్థాపించిన జా ట్ల వర్గం నాయకుడు దుశ్యంత్‌ చౌతాలా 10 సీట్లలో విజయం సాధించి కీలకంగా నిలిచారు. దీంతో ఇరు జాతీయ పార్టీలు అధికార పీఠం కోసం ఆయనమీదే ఆశలు పెట్టుకున్నాయి. స్వతంత్రులూ బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా అడ్డుకున్నారు.

చౌతాలా మద్దతుకు యత్నాలు
జేజేపీ అధినేత చౌతాలా మద్దతు కోసం ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగారు. హర్యానా ముఖ్యమంత్రి, బీజేపీ నేత మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఢిల్లీ పిలుపించుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మంతనాలు జరిపారు..
సీఎం పదవిని ఆఫర్‌ చేసిన కాంగ్రెస్‌..?
మరోవైపు కాంగ్రెస్‌ సైతం ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని ఆలోచన చేస్తున్నది. దీనికి సంబంధించి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ హుడాతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూహంపై పలు సూచనలు ఇచ్చారు. అవసరమైతే గతంలో కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడా అమలు చేయాలని సూచించినట్టు సమాచారం.

‘మహా’లో తలకిందులైన అంచనాలు
మహారాష్ట్రలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీకి ఎదురేలేదనీ, సుమారు 220 స్థానాలకు పైగా గెలుచుకుని అధికారం చేజిక్కించుకుంటుందని పలు మీడియా సంస్థలు చేసిన విశ్లేషణలు తారుమారయ్యాయి. దీంతో బీజేపీ-శివసేన కూటమి 162 స్థానాలకే పరిమితమైంది. ఇది 2014తో పోల్చుకుంటే 23 స్థానాలు తక్కువే కావడం గమనార్హం. ఇక కాంగ్రెస్‌-ఎన్సీపీ నేతృత్వంలోని కూటమి ఊహించని రీతిలో ఫలితాలు సాధించింది. కేసుల పేరిట ఈడీ భయపెడుతున్నా.. కుటుం తబసభ్యులతో పాటు పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నా.. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌తో విభేదాలున్నా.. 78 ఏండ్ల వయస్సులోనూ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఒంటరిపోరాటం చేశారు. దీంతో ఆ కూటమి 99 స్థానాలు (గత ఎన్నికల కంటే 24 స్థానాలు ఎక్కువ) సాధించింది. ఫలితంగా 2014లో 41 సీట్లు గెలిచిన ఎన్సీపీ.. ఇప్పుడు ఆ సంఖ్యను 54కు పెంచుకుంది. కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో 42 స్థానాల్లో గెలుపొందగా.. ప్రస్తుతం 43 గెలుచుకుంది. దాదాపు 35 స్థానాల్లో పోటీ చేసిన ఎఐఎంఐఎం.. మైనారిటీ ఓట్లను చీల్చకుంటే రాష్ట్రంలో ఫలితాలు మరో విధంగా ఉండేవన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. మొత్తంగా 288 స్థానాలున్న ఇక్కడ.. బీజేపీ-శివసేన కూటమికి 162, కాంగ్రెస్‌-ఎన్సీపీకి 99, ఎఐఎంఐఎం 2, సీపీఐ(ఎం) 1, ఇతరులు 30 స్థానాల్లో గెలుపొందారు. కాగా 2014తో పోల్చుకుంటే బీజేపీకి ఓట్లు, సీట్లు తగ్గాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 122 సీట్లు రాగా.. ప్రస్తుతం 103 (19 స్థానాల్లో ఓటమి) స్థానాల్లోనే విజయం దక్కింది. ఇదే రీతిలో శివసేనకు గత ఎన్నికల్లో 63 స్థానాలు రాగా.. ప్రస్తుతం 56 స్థానాలకు పరిమితమైంది. ఐదు నెలల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ కూటమి 41 స్థానాలు (మొత్తం 48) గెలువగా.. అసెంబ్లీ ఫలితాల్లోనూ అదే ట్రెండ్‌ కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. దానికి తగ్గట్టుగానే బీజేపీ అగ్రనాయకత్వం, ప్రధాని మోడీ, కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షాలతో పాటు స్థానిక నాయకత్వం కూడా కాశ్మీర్‌ అంశాన్ని ప్రచారాస్త్రంగా ముందుకు తీసుకొచ్చింది. కానీ స్థానిక సమస్యలను విస్మరించడం, కరువుతో రైతులు అల్లాడుతున్నా పట్టించుకోకపోవడం, ఆర్థిక మందగమనంతో ఉద్యోగాలు కోల్పోతున్నా బీజేపీ నేతలు మాట మాత్రమైనా స్పందించడకపోవడంతో మరాఠాలు బీజేపీకి షాకిచ్చారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహరాష్ట్రలో పారిశ్రామికరంగం ఎక్కువగా ఉంది. ఆర్థికరంగం నెమ్మదించడంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ముఖ్యంగా రియల్‌ఎస్టేట్‌ రంగం దారుణంగా దెబ్బతిన్నా దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని బీజేపీ సర్కారు.. దానిని ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంతో లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కరువైంది.
అంతేగాక రైతాంగానికి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం, వారికి గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం కూడా ప్రజల ఆగ్రహానికి కారణమైంది. ఈ కారణంగానే సిట్టింగ్‌ స్థానాలను సైతం బీజేపీ కోల్పోయింది. పట్టణ ప్రాంతాల్లో మినహాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీజేపీని నిర్ధ్వందంగా వ్యతిరేకించారు.

పార్లమెంటు స్థానాల్లోనూ షాక్‌..
మహారాష్ట్రలోని సతర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఉదరురాజ్‌ భోస్లే ఓటమిపాలయ్యారు. మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున గెలుపొంది పార్టీ ఫిరాయించిన ఆయన.. బీజేపీలో చేరారు. ఈసారి బీజేపీ నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఇక బీహార్‌లోని సమస్తిపూర్‌ నియోజకర్గంలో లోక్‌జనశక్తి పార్టీ అభ్యర్థి ప్రిన్స్‌రాజ్‌ గెలుపొందారు.

Courtesy Nava Telangana

Leave a Reply