బలహీనపడుతున్న బీజేపీ

0
216
బలహీనపడుతున్న బీజేపీ

తొమ్మిది నెలల్లో మూడో ఓటమి
ఎన్డీయే పార్టీల పరిస్థితి మరీ ఘోరం
సత్తా చాటుతున్న ప్రాంతీయ పార్టీలు

న్యూఢిల్లీ : గతేడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ.. అటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటములను మూటగట్టు కుంటున్నది. ఈ తొమ్మిది నెలల కాలంలో నాలుగు రాష్ట్రాల శాసనసభ లకు ఎన్నికలు జరగ్గా.. అన్ని చోట్ల (హర్యానాలో దుష్యంత్‌ సింగ్‌ చౌతాలాతో పొత్తు పెట్టుకుని అధికారం చేపట్టడం మినహాయిస్తే) బీజేపీ ఓటమి పాలైంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ తో పాటు తాజాగా ముగిసిన ఢిల్లీలోనూ ఓడిపోయింది. ఢిల్లీలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో కమలం పార్టీ అధికారంలో ఉండి కూడా ఓడిమి పాలవడం గమనార్హం. రెండేండ్లతో పోల్చితే ఎన్డీయే బాగా బలహీ నపడిందని కొద్దిరోజులుగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి. 2018లో మార్చి నాటికి మిత్రపక్షాలతో కలుపుకుని బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు 19. ఆ ఏడాది చివర్లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో..

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ (అప్పటికీ ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ స్వంతంగా అధికారంలో ఉంది) లతో పాటు తెలంగాణ, మేఘాలయాలోనూ బీజేపీ ఓడిపోయింది. అంతకుముందే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ బీజేపీతో ఉన్న అనుబంధాన్ని తెంపుకుంది. ఇక, గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా రాలేదు. అదే సమయంలో బీజేపీతో ఉన్న పొత్తును సైతం తెంపుకున్న శివసేన..

కాంగ్రెస్‌, ఎన్‌సీపీల సాయంతో అక్కడ అధికారాన్ని చేపట్టింది. హర్యానాలో బీజేపీకి మెజారిటీ సీట్లు రాకున్నా జననాయన్‌ జనతా పార్టీ (జేజేపీ)తో కలిసి పీఠాన్ని దక్కించుకున్నది. ఇక జార్ఖండ్‌లోనూ కమలానికి దారుణ పరాజయం తప్పలేదు. ఈ ఫలితాలతో ఎన్డీయే అధికారంలో ఉన్న రాష్ట్రాలు 16కు తగ్గాయి.

ఇందులో బీజేపీ స్వంతగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు 8 మాత్రమే. ఈశాన్య రాష్ట్రాల్లో ఏదో ఓ పార్టీతో పొత్తు కుదుర్చుకుని కమలం పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. మొత్తంగా చూస్తే దేశంలో ఎన్డీయే పాలన కింద ఉన్నది 42 శాతం మంది ప్రజలే. ఇక యూపీఏ ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఆంధ్రలో వైఎస్‌ఆర్‌సీపీ, కేరళలో వామపక్షాలు, బెంగాల్‌లో తృణమూల్‌, ఒడిషాలో బీజేడీ, తమిళనాడులో ఏఐడీఎంకేలు అధికారంలో ఉన్నాయి.

Courtesy Nava telangana

Leave a Reply