40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్ర

0
82
  • రూ.800 కోట్లు సిద్ధం చేశారు.. నా ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారు
  • బీజేపీకి ఆ డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది?.. ‘ఆపరేషన్‌ లోటస్‌’ విఫలమైంది
  • మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌
  • అవినీతిపై దృష్టి మళ్లించేందుకే ఈ ఆరోపణలు: బీజేపీ

న్యూఢిల్లీ : ఢిల్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఆపరేషన్‌ లోటస్‌ పేరుతో 40 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ.800 కోట్లను సిద్ధం చేసుకుందన్నారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు అవసరమని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల చొప్పున చెల్లించేందుకు రంగం సిద్ధమైందని ఆయన చెప్పారు. సీబీఐ దాడులు జరిపిన ఒక రోజు తర్వాత బీజేపీ నేతలు ఉప ముఖ్యమంత్రి మనీ ష్‌ సిసోడియాను సంప్రదించారన్నారు. ‘కేజ్రీవాల్‌కు ద్రోహం చేస్తే ముఖ్యమంత్రి పదవి ఇస్తాం’ అంటూ ఆయన్ను ప్రలోభపెట్టారని ఆరోపించారు. సిసోడియా లాంటి వ్యక్తి తన మంత్రివర్గంలో ఉండడం అదృష్టమని, ఆయనకు సీఎం పదవిపై ఎలాంటి ఆశా లేదని కేజ్రీవాల్‌ చెప్పారు. అమ్ముడు పోవడం కన్నా చనిపోవడమే మేలని ఆప్‌ ఎమ్మెల్యేలు భావిస్తారని తెలిపారు.

పార్టీ ఎమ్మెల్యేలతో గురువారం కేజ్రీవాల్‌ తన నివాసంలో సమావేశమైన అనంతరం వారితో కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. బీజేపీ ఆపరేషన్‌ లోటస్‌ విఫలమవ్వాలని మహాత్ముడి సమాధి వద్ద ప్రార్థించినట్లు విలేకరులతో చెప్పారు. 40 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ.800 కోట్లు సిద్ధం చేసుకుందని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది దేశ ప్ర జలు తెలుసుకోవాలనుకుంటున్నారని అన్నారు. జీఎస్టీ ద్వారా వచ్చిందా? పీఎంకేర్స్‌ నిధులా? లేక వారి స్నేహితులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఆప్‌ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలో చేరబోరని, తన ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని స్పష్టం చేశారు. మనీష్‌ సిసోడియాపై సీబీఐ తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందన్నారు.

ఉదయం నుంచే ఊహాగానాలు..
ఆప్‌ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తోందంటూ గురువారం ఉదయం నుంచే వదంతులు వ్యాపించాయి. దాదాపు 12మంది ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు సంప్రదించారని తెలియడంతో కేజ్రీవాల్‌ ఎమ్మెల్యేలందర్నీ తన నివాసానికి పిలిపించారు. ఉదయం 11 గంటల వరకు 36 మంది ఎమ్మెల్యేలే రావడంతో అందరిలో ఆందోళన నెలకొంది. తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌ ఇంటికి చేరుకున్నారు. 62 మంది ఎమ్మెల్యేలకు గాను 53 మంది సమావేశంలో పాల్గొన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ ఎత్తుగడలను తిప్పిగొట్టేందుకు ఎమ్మెల్యేలతో కలిసి కేజ్రీవాల్‌ వ్యూహరచన చేశారని వెల్లడించాయి. ఢిల్లీ ప్రభుత్వానికి ఢోకా ఏమీ లేదని, ఆప్‌ ఎమ్మెల్యేలందరూ తాము పార్టీలోనే కొనసాగుతామని చెప్పారని పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ తెలిపారు. హిమాచల్‌లో ఉన్న మనీష్‌ సిసోడియా, విదేశీ యాత్రలో ఉన్న అసెంబ్లీ స్పీకర్‌ రాంనివాస్‌ గోయెల్‌తో పాటు ఏడుగురు సమావేశానికి హాజరు కాలేకపోయారని చెప్పారు. మంత్రి సత్యేందర్‌ జైన్‌ జైల్లో ఉన్నారని, ఎమ్మెల్యే అమతుల్లా ఖాన్‌ వర్చువల్‌గా పాల్గొన్నారని ఆయన తెలిపారు. తమను బీజేపీ నేతలు సంప్రదించినట్లు 12 మంది ఎమ్మెల్యేలు చెప్పారన్నారు. రూ.20 కోట్లు ఇస్తామన్నారని సోమ్‌నాథ్‌ భారతి, సంజీవ్‌ ఝా, అజయ్‌ దత్‌ చెప్పారని.. ఒక ఎమ్మెల్యేను అదనంగా తెస్తే రూ.25 కోట్లు ఇస్తామన్నట్లు మరికొందరు ఎమ్మెల్యేలు సమావేశంలో వెల్లడించారని భరద్వాజ్‌ తెలిపారు.

రాజ్‌ఘాట్‌ను గంగా జలంతో ప్రక్షాళన చేస్తాం
కేజ్రీవాల్‌ ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ తెలిపారు. తన ప్రభుత్వ అవినీతిపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆయన ఈ నాటకం ఆడుతున్నారని చెప్పారు. సినిమా స్ర్కిప్టులాగా ఆయనో కథ సృష్టించి, దాని ప్రకారం నడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆప్‌ ఎమ్మెల్యేలు సందర్శించిన రాజ్‌ఘాట్‌ను గంగాజలంతో ప్రక్షాళన చేస్తామన్నారు. సిసోడియా సహా లిక్కర్‌ మాఫియాతో సంబంధం ఉన్న వారందర్నీ సీబీఐ అరెస్టు చేయడం ఖాయమని చెప్పారు.

Leave a Reply