కేజ్రీవాల్‌ ఇంటిపై బీజేవైఎం దాడి

0
150

70 మంది అరెస్ట్‌

దిల్లీ, చండీగఢ్‌: కశ్మీర్‌ ఫైల్స్‌చిత్రంపై ఝూటీ ఫిల్మ్‌‘ (అవాస్తవ చిత్రం) అంటూ వ్యాఖ్యలు చేసి కశ్మీరీ పండితుల్ని ఎగతాళి చేసిన కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పాలని కోరుతూ బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వి సూర్య ఆధ్వర్యంలో భాజపా కార్యకర్తలు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి ఇంటి ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వాతావరణం ఉద్రిక్తంగా మారి.. ఆందోళనకారులు సీసీ టీవీ కెమెరాలు, బారికేడ్లు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కొన్ని ఛానళ్లలో ప్రసారమయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌ ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఓడించలేకపోయిన భాజపా ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆయన్ను హతమార్చేందుకు కుట్రలు పన్నుతోందని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియా ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు తాము ఫిర్యాదు కూడా చేయనున్నట్లు వెల్లడించారు. జాతీయ రాజధానిలో పోలీసుల సమక్షంలో సీఎం ఇంటిపై దాడి జరగటం పిరికిపందల చర్య అని, ఆప్‌ను చూసి భాజపా ఎంతగా భయపడుతోందో తెలుస్తోందని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ట్వీట్‌ చేశారు.

కేజ్రీవాల్‌ అర్బన్‌ నక్సలైట్‌ : తేజస్వి సూర్య

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అర్బన్‌ నక్సలైట్‌గా బీజేవైఎం అధ్యక్షుడు, బెంగళూరు (దక్షిణం)ఎంపీ తేజస్వి సూర్య అభివర్ణించారు. కశ్మీర్‌లో హిందువులపై జరిగిన మారణహోమాన్ని ఆయన కప్పిపుచ్చాలని చూస్తున్నట్లు ఆరోపించారు. బుధవారం భాజపా ప్రధాన కార్యాలయంలో తేజస్వి మీడియాతో మాట్లాడారు. తమ ఆందోళన ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, పలుమార్లు ఉగ్రవాదులకు అనుకూల వైఖరి అవలంబించిన కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేవైఎం దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తుందన్నారు.

Courtesy Eenadu

Leave a Reply