18 మృతదేహాలను విసిరి పారేశారు

0
65

బళ్లారి: మానవత్వం కరోనా కాళ్ల కిందపడి నలిగిపోయింది. మృతులకు దక్కాల్సిన అంతిమ సంస్కారం.. కరోనా కారణంగా సంస్కార హీనంగా మారిపోయింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కరోనా వైర్‌సతో చనిపోయిన 18 మందిని గోతుల్లోకి విసిరి పారేస్తూ నిర్వహించిన సామూహిక అంత్యక్రియలు.. ప్రతిఒక్కరి హృదయాలనూ కలిచివేసింది. బళ్లారి కొవిడ్‌ ఆస్పత్రిలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు సోమవారం 12 మంది, మంగళవారం ఆరుగురు చనిపోయారు. గ్రామాల్లోని స్థానికుల అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులే వారికి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.

గుగ్గరహట్టి వద్ద తుంగభద్ర ఎగువ కాలువకు సమీపంలోని ఒక వంకలో పూడ్చడానికి మంగళవారం ఆ 18 మృతదేహాలను ఒక అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. అప్పటికే జేసీబీలతో రెండు పెద్ద గోతులు తవ్వి ఉంచగా.. సిబ్బంది నల్లటి కవర్లలో చుట్టిన మృతదేహాలను తీసుకొచ్చి వాటిలోకి విసిరేశారు. ఒక దాన్లో 8 మృతదేహాలు, మరొక గోతిలో 10 మృతదేహాలను పడేసి పూడ్చిపెట్టారు.

సాధారణంగా ఇలాంటి పరిస్థితిని మనం ఇప్పటి వరకూ విదేశాల్లోనే చూశాం. కానీ.. ఈ అంతిమ సంస్కారం వీడియోలు వైరల్‌గా మారడంతో భారత్‌ కూడా ఆ పరిస్థితిని ఎదుర్కోబోతోందనే ఆందోళన కలుగుతోంది. కాగా.. అంత్యక్రియలు నిర్వహించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో దీనిపై విచారణకు ఆదేశించామని బళ్లారి డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు.

Courtesy AndhraJyothy

Leave a Reply