హిందీ నవల.. ఆంగ్ల పురస్కారం!

0
87

ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌.. ఆంగ్లంలో ప్రచురించిన నవలలు, కథాసంకలనాలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక పురస్కారం. దీనికి హిందీ రచయిత్రి గీతాంజలి శ్రీ రచన ‘రేత్‌ సమాధి’ ఎంపికైంది. ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలు తనే. తుది దశలో పోటీ పడినవారిలో ఎక్కువమంది మహిళలే! ఈ నవలా ఒక వృద్ధ మహిళ జీవితావలోకనం. అసలు హిందీ సాహిత్యానికి ఆంగ్ల పురస్కారమెలా అంటారా? ఇంకా చాలా విశేషాలున్నాయి… చదవండి మరి…!

గీతాంజలి శ్రీ.. అసలు పేరు గీతాంజలి పాండే. తనకు అమ్మ శ్రీ కుమారితో అనుబంధమెక్కువ. అందుకే ఆమె పేరులోని శ్రీని తను జోడించుకున్నారు. ఈమెది ఉత్తర్‌ప్రదేశ్‌. నాన్న ప్రభుత్వాధికారి, రచయిత. ఆయన వృత్తిరీత్యా రాష్ట్రమంతా తిరిగారు. దిల్లీలో స్థిరపడ్డారు. ఇల్లంతా పుస్తకాలతో నిండిపోయి ఉండేది. పంచతంత్రం, చందమామ, రామాయణ, మహాభారతాలు.. ఇలా దొరికిన పుస్తకాన్నల్లా చదివేవారు. వీళ్లు అలహాబాద్‌లో కొన్నాళ్లున్నారు. అప్పుడు సుమిత్రానందన్‌ పంత్‌, గోరఖ్‌పురి, మహాదేవి వర్మ వంటి గొప్ప హిందీ, ఉర్దూ రచయితలను కలిసే అవకాశమొచ్చింది. దీంతో సాహిత్యమూ పరిచయమైంది. ప్రముఖ రచయిత మున్షీ ప్రేమ్‌చంద్‌ మనవరాలు తన స్నేహితురాలు. వాళ్ల ఇంట్లో అందరూ సంగీత విద్వాంసులు, సాహితీకారులే. ఆ కుటుంబంతో గీతాంజలికి ఏర్పడిన సాన్నిహిత్యం భారతీయ సంస్కృతితోపాటు రచనారంగంపై ఆసక్తికీ కారణమైంది.

కానీ తన చదువంతా సాగింది ఆంగ్ల మాధ్యమంలో. హిందీ సాహిత్యాన్ని ఎంచుకునే వీల్లేదు. దీంతో దిల్లీ జేఎన్‌యూ నుంచి చరిత్రలో డిగ్రీ పట్టా, ఎంఎస్‌ యూనివర్సిటీ, బరోడా నుంచి పీహెచ్‌డీనీ చేశారు. భాష ఆనుపానులు తెలుసుకోవడానికి చరిత్రపై అవగాహన ఉండాలంటారీవిడ. పీహెచ్‌డీలో భాగంగా ప్రేమ్‌చంద్‌పై పుస్తకం రాసే క్రమంలో హిందీ సాహిత్యంతో ప్రేమలో పడిపోయానంటారు. ‘చిన్నతనంలోనే నాలోని రచయితను గుర్తించా. ఆంగ్ల మాధ్యమంలో చదవడం వల్ల దాన్లోనే సాహస కథలను రాసేదాన్ని. కానీ ఇంగ్లిష్‌, హిందీల మధ్య చిక్కుకుపోయే దాన్ని. దేనిలో రాయాలన్న మీమాంసతో ఉండేదాన్ని. పీహెచ్‌డీ తర్వాత హిందీపై పట్టు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. అప్పట్నుంచీ అందులోనే రాస్తున్నా’ అని చెబుతారీవిడ.

వివిధ భాషల్లోకి..

మొదటి కథ ‘బేల్‌ పత్ర’ 1987లోనే ప్రచురితమైనా గుర్తింపు మాత్రం 1991లో ‘అనూ గూంజ్‌’ కథతో వచ్చింది. ఈవిడ రచనలన్నీ హిందీలోనే! కథలే కాదు నవలలూ రచించారు. చాలావరకూ కథలను సంకలనాలుగా తీసుకొచ్చారు. అయిదు నవలలు ప్రచురితమయ్యాయి. ఎన్నో కథలు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, సెర్బియన్‌, కొరియన్‌ భాషల్లోకి అనువాదమయ్యాయి. దీంతో విదేశాల్లో గుర్తింపుతోపాటు పలు పురస్కారాలూ, స్పాన్సర్‌షిప్‌లూ వరించాయి.

ఇప్పుడు బుకర్‌ పురస్కారాన్ని సాధించిన ‘రేత్‌ సమాధి’ నవలను 2018లో రచించారు. ఇది 80 ఏళ్ల వృద్ధురాలి కథ. అకస్మాత్తుగా భర్త దూరమవడంతో ఒత్తిడికి గురవుతుంది. తనూ చనిపోవాలనుకుంటుంది. ఆమె చిన్నతనంలో భారత్‌- పాకిస్థాన్‌ విభజన మనసులో నాటుకుపోతుంది. దీంతో పాకిస్థాన్‌ వెళతానని ఇంట్లో వాళ్లతో పట్టుబడుతుంది. ఈ క్రమంలో కూతురిగా, మహిళగా, భార్యగా, తల్లిగా తన పాత్ర గురించి విశ్లేషించుకుంటుంది. ఆపై బాధ నుంచి బయటపడి తిరిగి జీవితాన్ని ఎలా ప్రారంభించిందనేది కథ. దాన్ని డైసీ రాక్‌వెల్‌ అనే అనువాదకురాలు ‘టూంబ్‌ ఆఫ్‌ శాండ్‌’ పేరుతో 2021లో ఆంగ్లంలోకి అనువదించారు. దేశ విభజనలు, స్త్రీ జీవితం, భిన్న సంప్రదాయాలు.. దీనిలో పలు సీరియస్‌ విషయాలు కనిపించినా దాన్ని ఆకట్టుకునేలా, హాస్యాన్ని జత చేస్తూ చెప్పడంతో విదేశీయులనీ ఆకర్షించింది. అదే ఈ ఏడాది ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ను సాధించిపెట్టింది. గతంలో ఈ నవలకు ఇంగ్లిష్‌ పెన్‌ సహా ఎన్నో అవార్డులూ వరించాయి. బుకర్‌ పురస్కారాన్ని ఈ గురువారం లండన్‌లో అందుకున్నారు గీతాంజలి. నిన్నటి వరకూ అనువాదకురాలు డైసీని ప్రత్యక్షంగా చూడటం, మాట్లాడటం వంటివీ లేవట. వీళ్ల సంభాషణంతా ఈమెయిళ్ల ద్వారానే సాగిందట!

‘చాలామంది నన్ను స్త్రీవాదినంటారు. నేను కేవలం వాళ్ల కోణంలో ఆలోచిస్తానంతే! గోడవైపు మొహం పెట్టి పడుకునే ముసలి వాళ్లనెందరినో చూశా. వాళ్లు మనకు వెన్ను చూపుతున్నారా లేకా జీవితానికా అనిపించేది. ఆ ఆలోచన ఫలితమే ఈ నవల. అవార్డుల గురించి పెద్దగా ఆలోచించను. పని చేసుకుంటూ వెళతాను. వాటినో ప్రోత్సాహంగా మాత్రం భావిస్తా. బుకర్‌ ప్రైజ్‌కి ఎంపికవుతానని ఊహించలేదు. ఇదో పెద్ద గుర్తింపు, గౌరవం. దీని వల్ల భారతీయ భాషల్లోనూ మంచి సాహిత్యం ఉందని తెలుస్తుందని, అది ప్రపంచానికి పరిచయమవుతుందనీ ఆశిస్తున్నా’ అంటున్నారు 67 ఏళ్ల గీతాంజలి.

రూ.49 లక్షల పురస్కారం

  • ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ను యూకేలో ప్రచురితమైన ఆంగ్ల రచనలకు ఇస్తారు. గత కొన్నేళ్లుగానే అనువాదాలనీ జోడించారు. విజేతకు బహుమతిగా 50 వేల పౌండ్లు (రూ.49 లక్షలు) ఇస్తారు. దీన్ని గీతాంజలికి, అనువాదకురాలికి సమంగా పంచుతారు.

  • ఈ ఏడాది 12 దేశాల నుంచి 11 భాషల్లో మొదటిసారిగా 135 పుస్తకాలు పరిశీలనకు వచ్చాయి. వాటిని వడపోసి 13 ఎంపిక చేస్తే సగం రచయిత్రులవే. తుది దశకు వచ్చిన ఆరుగురిలో గీతాంజలితోపాటు అయిదుగురు మహిళలే. కవాకమీ (జపాన్‌), క్లాడియా పినోరో (అర్జెంటీనా), బోరా చంగ్‌ (దక్షిణ కొరియా), ఓల్గా టొకర్క్‌జక్‌ (పాలిష్‌)ల్లో దాదాపు అందరూ గతంలోనూ ఈ పోటీల్లో ఫైనల్స్‌కి వచ్చిన వారే. ఓల్గా టొకర్క్‌జక్‌ నోబెల్‌ బహుమతి గ్రహీత కూడా.

Courtesy Eenadu

Leave a Reply