‘జైశ్రీరామ్‌’ పలకలేదని.. పదేళ్ల బాలుడిపై బిజెపి కార్యకర్త దాడి

0
97

కోల్‌కతా : పదేళ్ల బాలుడిపై బిజెపి కార్యకర్త కర్కశంగా దాడి చేశాడు. అతని ముఖం, తలకు తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ ఆ బాలుడు చేసిన తప్పేంటంటే.. జైశ్రీరామ్‌ అని పలకపోవడమే. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌ పులియాలోని నదియాలో జరిగింది. బిజెపి కార్యకర్త మహదేవ్‌ ప్రమాణిక్‌ నదియాలో ఒక టీ స్టాల్‌ను నడుపుతున్నాడు. మహాదేవ్‌ భార్య మిథు ప్రమాణిక్‌ స్థానిక బిజెపి మహిళా విభాగం చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. టీ స్టాల్‌ పక్కనుండి వెళుతున్న బాలుడిని మహాదేవ్‌ అడ్డుకున్నాడు. జైశ్రీరామ్‌ అని పలకాలంటూ బాలుడిని బెదిరించడంతో పాటు బాలుడి తండ్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇందుకు నిరాకరించిన బాలుడిని చితక్కొట్టాడని స్థానికులు పేర్కొన్నారు. కాగా, ఆ బాలుడి తండ్రి అధికార టిఎంసి మద్దతుదారుడు కావడంతో ఉద్దేశపూర్వకంగానే బాలుడిపై దాడి చేసినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో బాలుడి తండ్రి టిఎంసికి అనుకూలంగా ప్రచారం చేపట్టడం కూడా కారణమని అన్నారు. కాగా, ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాలుడిపై దాడికి దిగిన బిజెపి కార్యకర్త మహదేవ్‌ ప్రమాణిక్‌ను ఆరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ.. 12వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ ఘటనను సుమోటుగా స్వీకరించి దర్యాప్తు చేపడతామని, నిందితుడిని అరెస్ట్‌ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Courtesy Prajashakti

Leave a Reply