వైసిపి హయాంలోనూ నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం గాలికి ..

0
335

 అమరావతి : భవన నిర్మాణంతో పాటు, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం రాష్ట్రంలో ప్రశ్నార్ధకంగా మారింది. వీరికోసం చేసిన చట్టాలను గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను పాలకులు పట్టించుకోవడం లేదు. సంక్షేమబోర్డులో ఉన్న నిధులను పక్కదోవ పట్టించడంలో గత టిడిపి సర్కారు బాటలోనే ప్రస్తుత వైసిపి ప్రభుత్వమూ నడుస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చంద్రన్న బీమా పథకానికి సంక్షేమబోర్డు నిధులు రూ.970కోట్లను మళ్లించింది. చట్ట వ్యతిరేకమైన ఈచర్యకు నిరసనగా భవన నిర్మాణ కార్మికులు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఈ ఆందోళనలకు వైసిపి మద్దతు ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని ప్రకటించింది. అయితే, ప్రస్తుతం ఆచరణ దానికి భిన్నంగా సాగుతుండటం కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. 2020 మార్చి 31నాటికి బోర్డులో రూ.2,984కోట్లు ఉండగా, జిఒ 17ను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో 450 కోట్ల రూపాయల మొత్తాన్ని ఖజానాకు మళ్ళించినట్టు సమాచారం. దీనిపై ఆందోళన వ్యక్తమవుతుండగానే బోర్డు నుండి అందే సంక్షేమకార్యక్రమాలన్నింటిని రద్దు చేస్తున్నట్టు కార్మికశాఖ కమిషనర్‌ 1412వ నెంబర్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో నిర్మాణ కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో అంతకుముందు నుండే ఆ పరిస్థితి ఉంది. కష్టకాలంలో ఆదుకోవాల్సిన సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోవడంతో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికీ నిర్మాణ కార్యక్రమాలు పుంజుకోని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాలంటూ ప్రజాప్రతినిధులకు, అధికారులకు పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. దీంతో మరింత తీవ్ర స్థాయిలో కార్యచరణకు భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘాల ఐక్యవేదిక తీర్మానం చేసింది. అవసరమైతే సిఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఈ నెల 29న దీనిపై తుది నిర్ణయం తీసుకుని తేదిని ప్రకటిస్తామని తెలిపింది. అయినా అధికారయంత్రాంగంలో స్పందన లేకపోవడం గమనార్హం.

గతంలో సంక్షేమ పథకాలు ఇలా…
రాష్ట్రంలో భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో 22 నుండి 30లక్షల మంది కార్మికులకు సభ్యత్వం ఉంది.ఎన్నో పోరాటాల ఫలితంగా 1996లో కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006లో దివంగత సిఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డును ఏర్పాటు చేశారు. 2009 నుండి నిర్మాణ రంగం నుండి 1శాతం సెస్‌ వసూలు చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వీటిలో భవన నిర్మాణ కార్మికుల ఆడపిల్లల వివాహానికి రూ.20వేలు ఆర్థిక సాయం, పెళ్లి తర్వాత ఒక్కో ప్రసవానికి రూ.20వేలు చొప్పున రెండు ప్రసవాలకు ఆర్థిక సాయం, కార్మికుల సహజ మరణానికి రూ.2లక్షలు, ప్రమాదవశాత్తు మరణానికి రూ.5లక్షలు, బోర్డు సభ్యులు కాని కార్మికులకు సహజ మరణానికి రూ.20వేలు, ప్రమాదవశాత్తు మరణానికి రూ.50వేలు, ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు వలస వెళ్లి మరణించిన కార్మికుల భౌతికకాయాన్ని స్వగృహానికి తీసుకురావడానికి అంబులెన్సు ఖర్చులు, చదువుకునే కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, వృద్ధ కార్మికులకు, వికలాంగ కార్మికులకు, వితంతు కార్మికులకు పెన్షన్లు, నిర్మాణ రంగానికి సంబంధించిన పనిముట్లు కొనుగోలు చేసేందుకు సబ్సిడీ రుణసదుపాయం వంటివి నుండి అందేవి. ప్రస్తుతం ఇవన్నీ నిలిచిపోయాయి.

సంక్షేమ పథకాలను యథాతదంగా కొనసాగించాలి
ఆర్‌వి నరసింహారావు, ఎపి భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి
భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ఇప్పటి వరకు కొనసాగిన సంక్షేమ పథకాలను యథాతదంగా కొనసాగించాలి. సర్క్యులర్‌ 1412, జిఒ 17ను రద్దు చేయాలి. బోర్డు నుండి తీసుకున్న రూ.450కోట్లు వెనక్కు ఇచ్చేయాలి. ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలి. లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు బోర్డు నిధుల నుండి రూ.10వేలు ఆర్థిక సాయం చేయాలి. సంవత్సరంన్నర కాలంగా నిర్మాణ రంగం నుండి నిలిపేసిన 1శాతం సెస్‌ వసూలును పున:ప్రారంభించాలి. లేకుంటే కార్మికుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సివస్తుంది.

Courtesy Prajashakti

Leave a Reply