7 నెలల గర్భిణికి బలవంతపు కాన్పు

0
214
  •  ఒకరికి బదులు మరొకరికి సిజేరియన్‌!..
  • పుట్టింది మగ శిశువైతే పాప అని సమాచారం
  • శిశువు మృతి.. బాలింత పరిస్థితి విషమం
  • గాంధీ ఆస్పత్రి వైద్యుల దారుణ నిర్వాకం
  • రిపోర్టులు మారిపోవడమే కారణం
  • నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిందొక ఏడు నెలల గర్భిణి..! కానీ, ఆ వార్డులోనే లేని మహిళ పేరును ఆమె అరచేతిలో రాశారు..! మరో ఇద్దరు మహిళల రిపోర్టులను ఆ గర్భిణి కేస్‌ షీట్‌కు జత చేశారు…! ఆపై బలవంతపు కాన్పు చేశారు..! పుట్టింది బాబు అయితే.. పాప అని అబద్ధం చెప్పారు..! చివరకు ‘పరిస్థితి విషమించి’ శిశువు మృతి చెందిందని సమాచారం ఇచ్చారు..! తప్పుపై తప్పు.. అనేక అనుమానాలు..! ఫలితం.. ఆ మహిళకు గర్భశోకం! తీవ్ర ఆందోళనకర స్థితిలో ఆరోగ్యం! సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచిందీ ఘటన.

హైదరాబాద్‌ సిటీ/బౌద్ధనగర్‌ : మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం, వడ్డె కొత్తపల్లికి చెందిన ఎనగందుల హరీష్‌ భార్య సమత (24) ఏడు నెలల గర్బిణి. ఆరోగ్య సమస్యలతో ఈ నెల 11వ తేదీన ఆమెను వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు వెంటనే గాంధీకి తరలించగా 12వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటలకు బెడ్‌ కేటాయించారు. సమత అత్యవసర పరిస్థితుల్లో ఉందని చెబుతూ భర్త హరీశ్‌ నుంచి వైద్యులు హామీ సంతకం చేయించుకున్నారు. రక్తంగా అవసరమని చెప్పడంతో ఆస్పత్రిలోని బ్లడ్‌ బ్యాంకులో ఉన్న ‘ఒ’ పాజిటివ్‌ రక్తాన్ని రిజర్వు చేయించారు. మరో దాత నుంచి కూడా తీసుకున్నారు. ఆ తర్వాత హరీ్‌షకు సమతను చూపలేదు. కలవనివ్వలేదు. అయితే, రాత్రి వేళ ఫోన్‌ చేసిన సిబ్బంది బాబు పుట్టాడని, ఐసీయూకు రావాలని సమాచారం ఇచ్చారు. అప్పటికీ హరీశ్‌ను వార్డులోకి అనుమతించలేదు. అద్దాల నుంచి మాత్రమే చూడాలని చెప్పారు. ఉన్నట్లుండి తెల్లవారుజామున ఫోన్‌ చేసి ‘పాప’ పరిస్థితి విషమంగా ఉందని ఎన్‌ఐసీయూలో పెట్టామని తెలిపారు. గంట తర్వాత ‘పాప’ చనిపోయిందని కబురుపెట్టారు.

అనేక అనుమానాలు.. అంతులేని నిర్లక్ష్యం
ఈ దారుణానికి కేస్‌ షీట్‌లు మారడమే కారణంగా చెబుతున్నా.. ఆసుపత్రి వర్గాల తీవ్ర నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సమత అరచేతిలో  భవాని అని వార్డులో లేని మహిళ పేరు రాశారు. పుట్టింది అబ్బాయి అని  చెప్పి.. చనిపోయింది పాపగా ఎందుకు చెప్పారని ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం లేదు. సమత కేస్‌ షీట్‌ ట్యాగ్‌లోనూ ‘పాప’ అని రాసి కొట్టేసి ‘బాబు’గా, శిశువు బరువు కేజీ అని రాసి తర్వాత 900 గ్రాములుగా, సమయం కూడా మార్చారు. ట్యాగ్‌లో తప్ప అన్ని రిపోర్టుల్లో బాబు అనే రాసి ఉందని ఆర్‌ఎంవో చెప్పినట్లు హరీశ్‌ పేర్కొన్నాడు.

అంతేకాక సోమవారం సమతను లేబర్‌ వార్డుకు పిలిపించి పాత ట్యాగులు తీసుకుని రెండు కొత్త ట్యాగులు ఇచ్చారు. సమత బెడ్‌ వద్ద ఉన్న కేస్‌షీట్‌కు లక్ష్మమ్మ, మాధవి అనే వారి రిపోర్టులు అంటించి ఉన్నాయి. వీరి రిపోర్టుల ఆధారంగానే సమతకు వైద్యం చేశారని హరీశ్‌ ఆరోపిస్తున్నాడు. ఎస్‌ఐ రాజశేఖర్‌ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హరీశ్‌ ఫిర్యాదు మేరకు నలుగురు వైద్యులతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. బుధవారంలోగా వారు నివేదిక ఇస్తారని, నిర్లక్ష్యం రుజువైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరోపణలు నిరాధారం అంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ మీడియా గ్రూప్‌లో పోస్టు చేశారు.

Courtesy Andhrajyothi

Leave a Reply