నేడు ఆర్టీసీపై కేబినెట్‌ భేటీ!

0
302

  • రూట్ల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం?..
  • ప్రభుత్వోద్యోగుల డిమాండ్లపైనా చర్చ
  • వయో పరిమితి, వేతన సవరణపై నిర్ణయం?
  • కొత్త పేరుతో పార్లమెంటరీ కార్యదర్శులు

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ భవితవ్యం నేడు తేలనుంది. గురువారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. బేషరతుగా సమ్మెను విరమించి, డి మాండ్లన్నీ వదులుకొని మళ్లీ కొలువుల కోసం ప్రభుత్వం శరణుజొచ్చిన కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారా? రూట్లపై ఆర్టీసీ గుత్తాధిపత్యానికి గండి పెట్టనున్నారా? వంటి ప్రశ్నలకు మంత్రివర్గ సమావేశంలో సమాధానాలు లభించనున్నాయి. నిజాం హయాంలో నిజాం పూచీకత్తుతో పురుడు పోసుకొని, కాలక్రమంలో తెలంగాణ ఆర్టీసీగా మారిన ఈ సంస్థ మనుగడపై కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. ఐదు వేల ప్రైవేటు బస్సులను ఆర్టీసీ రూట్లలో ప్రవేశ పెట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు.

కేంద్ర రవాణా చట్టం కూడా దీనికి పూర్తి వెసులుబాటు ఇవ్వడం… హైకోర్టు కూడా రూట్ల ప్రైవేటీకరణపై అభ్యంతరాలు లేవనెత్తకపోవడంతో గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 25 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, కార్మికులను చేర్చుకోబోమని సీఎం కార్యాలయం ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీయే ప్రధాన ఎజెండాగా గురువారం నుంచి రెండు రోజులపాటు మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల వయో పరిమితి పెంపుతో పాటు వేతన సవరణ(ఫిట్‌మెంట్‌)పై కూడా చర్చ ఉండే అవకాశాలున్నాయి. 10-12 రోజుల్లో పీఆర్‌సీ నివేదిక ఇవ్వాలని ఈ నెల 10వ తేదీన సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ గడువు ఈ నెల 22వ తేదీన ముగిసింది. వాస్తవానికి అదే రోజు నివేదిక తెప్పించుకొని, ఒక కమిటీ వేసి, నివేదికపై అధ్యయనం చేస్తారని ప్రచారం జరిగింది. తర్వాత వారం రోజులకు ఉద్యోగ సంఘాల జేఏసీతో సీఎం సమావేశమవుతారని అనుకున్నారు. అలాంటిదేం లేదని తేలింది. నివేదిక గడువు ముగిసినా అలజడి లేకపోవడంతో నివేదిక తుది రూపునకు మరికొన్ని రోజులు పడుతుందని సంకేతాలు వెలువడ్డాయి.

వచ్చే ఏడాది బడ్జెట్‌లోనే ఫిట్‌మెంట్‌పై కీలక నిర్ణయం తీసుకుంటారని, ఏప్రిల్‌ 1 నుంచి కొత్త వేతనాలు ఉద్యోగ, ఉపాధ్యాయులు అందుకుంటారని తెలుస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాలకు కీలక సంకేతాలందాయి. వేతన సవరణపై ఆశలేమీ లేవని, ఏప్రిల్‌ దాకా ఆగాల్సి ఉంటుందని కీలక నేత ఒకరు తమ సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు. దాంతో ‘వేతన సవరణపై మాకెలాంటి ఆశల్లేవు… వచ్చే బడ్జెట్‌ తర్వాతే జీతాల పెంపు ఉండొచ్చు’ అని ఉద్యోగ జేఏసీ కీలక ప్రతినిధి ఒకరు తమ ప్రతినిధులకు స్పష్టం చేశారు.

మళ్లీ పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థ!
తెలంగాణలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో రద్దయిన పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థను మళ్లీ ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అదే పేరుతో కాకుండా కొత్త పేరుతో ఈ నియామకం ఉంటుందని తెలుస్తోంది. గురు, శుక్రవారాల్లో జరిగే సమావేశాల్లో దీనిపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో ఈ వ్యవస్థపై టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు అధ్యయనం చేశారు. ఆ నివేదిక ఆధారంగానే పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంపై చర్చ ఉంటుందని సమాచారం. పార్లమెంటరీ కార్యదర్శుల పేరుతో కాకుండా కొత్త పేరుతో ఈ నియామకం ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ బలం కాంగ్రెస్‌ నుంచి చేరిన వారితో కలిపి 103గా ఉంది. కానీ, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164(1ఏ) ప్రకారం 17 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించేలా పరిమితి ఉంది. దీంతో ఎమ్మెల్యేల్లో చాలామంది మంత్రులవుతారని ప్రచారం జరిగినా చట్ట పరిమితి వల్ల అవకాశం దొరకలేదు. ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికి… ఆ స్థానంలో కొత్త వారికి ఛాన్స్‌ ఇస్తారని ప్రచారం జరిగినా కుదరలేదు. ఈ పరిస్థితుల్లో మంత్రులను వదులుకోకుండా ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తే బాగుంటుందనే చర్చ టీఆర్‌ఎ్‌సలో ఉంది.

Courtesy AndhraJyothy…

Leave a Reply