
- ట్యాక్సీ డ్రైవర్ల నిరవధిక సమ్మె
- సమస్యల పరిష్కారం కోసం
- రెండున్నర నెలలుగా విజ్ఞప్తి
- అయినా సర్కారు స్పందించలేదు
- సర్కారు ఆహ్వానిస్తే చర్చలకు సిద్ధం
- తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ
హైదరాబాద్ సిటీ: దాదాపు 15 రోజులుగా బస్సుల బంద్‌తోనే అష్టకష్టాలు పడుతున్న సామాన్యులపై ట్యాక్సీలు, క్యాబ్‌ల సమ్మె రూపంలో శనివారం నుంచి మరో పిడుగుపాటు! రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 వేల మంది ట్యాక్సీ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని రెండున్నర నెలలుగా రాష్ట్ర రవాణా మంత్రిని కోరుతున్నా స్పందన లేకపోవడంతో సమ్మె అనివార్యమైందని తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ తెలిపారు. తాము నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఉబర్, ఓలా వంటి సంస్థల నుంచి చర్చలకు పిలుపు వస్తుందని ఆశించామని.. కానీ, శుక్రవారం రాత్రి వరకూ తమను ఎవరూ సంప్రదించలేదని ఆయన వివరించారు. క్యాబ్ డ్రైవర్లు కూడా 19వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడతారని శుక్రవారం రాష్ట్ర హైకోర్టు చెప్పినా కూడా ప్రభుత్వం తమను సంప్రదించక పోవడం బాధిస్తోందన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం ఎంత మాత్రం కాదని, తమ సమస్యల పరిష్కారానికి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మెకు వెళ్తున్నామని ఆయన వివరించారు. సమ్మె వద్దంటూ ప్రజల నుంచి తమకు అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని, ప్రజలకు కలిగిస్తున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని సలావుద్దీన్ చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆహ్వానిేస్త చర్చలకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
Courtesy Andhra Jyothy