వెక్కిరింతల వెనుక హెచ్చరికలు!

0
327

కె. శ్రీనివాస్

బెంగాల్‌లో నిరంకుశత్వం మితిమీరిపోయి, పాత ప్రతిపక్షం నీరుగారిపోయి, బిజెపి ముందుకు వచ్చినట్టు, తెలంగాణలో కూడా బిజెపి ముందుకు దూసుకువస్తున్నది. కాంగ్రెస్‌ మీద, కోదండరామ్‌ మీద, వామపక్షాల మీద ప్రయోగించిన అస్త్రాలను, యుక్తులను బిజెపి మీద ఉపయోగించగలరా? లేరు. అదీ సమస్య. బహుశా అందుకని, ఈ రోజు బిజెపి మీద సైద్ధాంతిక విమర్శకు, ప్రజాస్వామిక చర్చకు టిఆర్‌ఎస్‌ యువ అగ్రనాయకుడు సిద్ధపడ్డారా? ప్రమాదసూచికలను ఆయన గమనించారా? అందుకు తమ శిబిరంలో అవసరమైన దిద్దుబాట్లు ఏవో అధినాయకుడికి చెప్పగలుగుతారా? లేక, యుక్తులతో చాతుర్యంతో ప్రమాదాన్ని అధిగమించగలమనే భ్రమలోనే ఉంటారా? కెసిఆర్‌ కంటె అమిత్‌షా పెద్ద చాణక్యుడని ఇప్పుడైనా ఒప్పుకోకపోతే ముప్పు మీకే!

కొందరు కొన్ని మాటలు మాట్లాడుతుంటే సహజంగా ఉంటుంది. అవే మాటలు ఇతరులు మాట్లాడితే, ఎబ్బెట్టుగా, అసహజంగా అనిపించవచ్చు. ఆయా వ్యక్తులు మాట్లాడే మాటలు కానీ, వారి వ్యక్తిత్వాలు కానీ మనకు బాగా అలవాటయిపోవడం వల్ల అట్లా అనిపిస్తూ ఉండవచ్చు. లేదా, కొందరిపై కొన్ని ముద్రలు స్థిరపడిపోయి, వారు ఆ ముద్రలకు భిన్నంగా ఎప్పుడన్నా వ్యక్తీకరిస్తే, సంచలనంగానో, ఆశ్చర్యంగానో, వెక్కిరింతగానో అనిపించవచ్చు. ఆ ముద్రలు న్యాయమైనవే కానవసరం లేదు, ఒక్కోసారి వారి వ్యక్తిత్వాలకు భిన్నమైన ముద్రలను మోసేవారు కూడా ఉంటారు.

మనం బాగా పిరికివాడని అనుకునేవాడు, ఉన్నట్టుండి తాను లేస్తే మనిషిని కానని, తనది అవక్రపరాక్రమమని చెబుతుంటే ప్రగల్భాలు అనుకుంటాము. వాడెవడ్రా ఉత్తరకుమారుడు అనుకుంటాము. అక్రమమార్గాలలో ఆరితేరినవాడు, నీతిశతకం వల్లిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని నిష్ఠూరపడతాము. ప్రజాజీవితంలో ఉన్నవారికి, సుప్రసిద్ధులకీ ఈ బాధ ఎక్కువ, వారి మాటలను చేతలను ఒక కంట కనిపెట్టి ఉండే సమాజం, ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉంటుంది. రెండు నాల్కలు, రెండు జీవితాలు, రెండు ముఖాలు ప్రదర్శిస్తే వెంటనే ప్రత్యర్థులు పండగ చేసుకుంటారు. సోషల్‌ మీడియా వచ్చాక, జనానికి కనికరమే ఉండడం లేదు!

వై.ఎస్‌. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే, అవినీతికి ఆస్కారం లేని పాలన గురించి పదే పదే మాట్లాడుతుంటే, వినేవారికి ప్రత్యేకంగా అనిపించేది. ఆయన మీద ఉన్న కేసులు, వాటి విచారణ– ఇవన్నీ ఒక ముద్రను సృష్టించి ఉంటాయి. అందువల్ల, ఒకరకమైన విరోధాభాస ధ్వనించేది. పాత అధికారపక్షమూ, కొత్త ప్రతిపక్షమూ అయిన తెలుగుదేశం వారు ఆ వైరుధ్యాన్ని ఎత్తిచూపడానికి ప్రయత్నించారు.

డిస్కవరీ చానెల్‌ కోసం బేర్‌ గ్రిల్స్‌ నరేంద్రమోదీతో కలసి చేసిన ‘‘మేన్‌ వర్సెస్‌ వైల్డ్‌’’ కార్యక్రమంలో, జిమ్‌ కార్బెట్‌ అభయారణ్యంలో సంచారంతో పాటు, కొంత సంభాషణ కూడా సాగింది. పులులు దాడి చేస్తే ఆత్మరక్షణ కోసమని గ్రిల్స్‌ ఒక ఈటె వంటి ఆయుధాన్ని అందించగా, మోదీ ‘‘నా సంస్కారం ఏ ప్రాణినీ చంపనివ్వదు’’ అని ఇచ్చిన సమాధానం, మోదీ వ్యతిరేకులకు మంచి వినోదాన్ని అందించింది. 2002 శాతం మీరు చెప్పింది నిజం– అంటూ ఫేస్‌బుక్‌లో వెటకారాలు వెల్లువెత్తాయి. 2002 నాటి గుజరాత్‌ హత్యాకాండను స్ఫురింపజేయడం ఆ విమర్శకుల ఉద్దేశ్యం. చెరువులో స్నానానికి వెడితే కనిపించిన మొసలిపిల్లను ఇంటికి తీసుకువెళ్లానని మోదీ తన బాల్య జ్ఞాపకాలను చెబితే, గిట్టనివారు తాటాకులు కట్టడం మొదలుపెట్టారు. ఆ మొసలి ఇప్పుడు ఎంత పెద్దదై ఉంటుంది– అన్నది ఇప్పుడు ఒక చర్చ. వైరుధ్యపు మాటలే కావు, అతిశయోక్తులు కూడా వెటకారులకు ఆయుధాలవుతాయి.

గత శనివారం నాడు, హైదరాబాద్‌లో తెలంగాణ వికాస సమితి వారి వార్షికోత్సవ సభల్లో తెలంగాణ రాష్ట్రసమితి నాయకులు, కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు (కెటిఆర్‌) ఇచ్చిన సందేశం కూడా సామాజిక మాధ్యమాలకు మంచి మేత అందించింది. ‘‘ప్రశ్నించే స్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం’’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణవాదులను అబ్బురపరిచాయి. అభిప్రాయభేదాలు సహజమని, వాటిని సహించి, చర్చించే వాతావరణం ఉండాలని కెటిఆర్‌ అన్న మాటలను కొందరు ఒకటికి పదిసార్లు చదువుకున్నారు. ఇక ఫేస్‌బుక్‌లో విమర్శకుల బృందం ఎట్లానూ ఉంటుంది కదా, అది ఆ వ్యాఖ్యల మీద వెటకారాలు, పోటీ వ్యాఖ్యలు, సచిత్ర వ్యంగ్యోక్తులు– అన్నీ మొదలుపెట్టింది. నిజానికి కెటిఆర్‌ను లక్ష్యం చేసుకోవడం సమంజసం కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో అప్రజాస్వామిక వాతావరణం నెలకొన్నదని భావిస్తున్న వారి ఆవేదనకు, కెటిఆర్‌ ఎట్లా బాధ్యులవుతారు? ప్రస్తుతం అయితే ఆయన మంత్రి కూడా కాదు. ముఖ్యమంత్రి ఆలోచనావిధానమే కెటిఆర్‌కు కూడా ఉండాలని ఏమున్నది? యువకులు సహజంగా ప్రగతిశీలంగా, ఉదారభావాలతో ఉంటారు. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణం మీద ఆయనకు కూడా అభ్యంతరం ఉండి ఉండవచ్చును, చెప్పినా అధిష్ఠానవర్గం ఆలకించకపోవచ్చు. బయటపడి ఇట్లా చెప్పడం బహుశా, కెసిఆర్‌ దృష్టికి తన అభిప్రాయాన్ని తీసుకువెళ్లడానికే కావచ్చు.

ఒక సమస్య మీద సమావేశమై చర్చించుకోవాలన్నా, ఒక ఊరేగింపో, ధర్నానో చేసి ప్రభుత్వం దృష్టికి ఏదైనా అంశం తీసుకువెళ్లాలన్నా ఎంత దుస్సాధ్యంగా ఉన్నదో వివిధ ప్రజా, ఉద్యోగ, ఉద్యమ సంఘాలను అడిగితే తెలుస్తుంది. బుధవారం నాడు కూడా యురేనియం తవ్వకాల గురించి క్షేత్రపర్యటన చేయడానికి వెళ్లిన నాయకులను అరెస్టులు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి వెళ్లిన ఉపాధ్యాయులను కూడా ఆ మధ్య అరెస్టు చేశారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలియదు. ఇటువంటి చర్యల వల్ల సమాజంలో లోలోపల అసహనం పెరిగిపోవడమే తప్ప, పాలకులు సాధించేది ఏమిటి? అటువంటి అసహనం వల్ల ఎటువంటి పర్యవసానాలుంటాయో, మొన్నటి లోక్‌సభ ఎన్నికలు సూచించాయి కదా?

ఇటీవలి ఎన్నికల ప్రచారంలో, కెసిఆర్‌ గతంలో కాంగ్రెస్‌ పాలనలో, టిడిపి పాలనలో ప్రజల మీద ఎటువంటి నిర్బంధం ఉండేదో, యువకులను పిట్టలను కాల్చినట్టు ఎట్లా కాల్చేసేవారో ప్రస్తావించారు. తన పాలనలో అటువంటి అశాంతి లేదని అంతా ప్రశాంతంగా ఉన్నదని కూడా ఆయన చెప్పుకున్నారు. తప్పుడు ఎన్‌కౌంటర్లు లేవన్నది అసత్యం. గత హయాంలో జరిగాయి. వాటి మీద ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ హయాంలో కూడా మొన్నటికి మొన్న కూడా ఒక సందేహాస్పద ఎన్‌కౌంటర్‌ జరిగింది. అయినప్పటికీ, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, టిఆర్‌ఎస్‌ పాలనలో గత ప్రభుత్వాల హయాంతో పోలిస్తే ఎన్‌కౌంటర్లు తక్కువ. అందుకు అభినందించవచ్చు కూడా. అయితే, కాంగ్రెస్‌, టిడిపి పాలనల్లో, ఎన్‌కౌంటర్లు ఎట్లా ఉన్నా, సాధారణ ప్రజాస్వామిక హక్కులు, అవకాశాలు అందుబాటులో ఉండేవి. ధర్నాచౌక్‌ కూడా ఉండకూడదని, బహిరంగ సభలన్నీ ఊరిబయట జరుపుకోవాలని ఆ ప్రభుత్వాలు అనలేదు. సాధారణ ప్రజాజీవనంలో కూడా ఒక నిర్బంధ వాతావరణాన్ని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఏ కారణం వల్ల, ఏ ప్రయోజనం కోసం ప్రభుత్వ విధానం అట్లా ఉన్నదో తెలియదు కానీ, దాని పర్యవసానం అసలుకే ఎసరు తెస్తున్నది. బెంగాల్‌లో నిరంకుశత్వం మితిమీరిపోయి, పాత ప్రతిపక్షం నీరుగారిపోయి, బిజెపి ముందుకు వచ్చినట్టు, తెలంగాణలో కూడా బిజెపి ముందుకు దూసుకువస్తున్నది. కాంగ్రెస్‌ మీద, కోదండరామ్‌ మీద, వామపక్షాల మీద ప్రయోగించిన అస్త్రాలను, యుక్తులను బిజెపి మీద ఉపయోగించగలరా? లేరు. అదీ సమస్య. బహుశా అందుకని, ఈ రోజు బిజెపి మీద సైద్ధాంతిక విమర్శకు, ప్రజాస్వామిక చర్చకు టిఆర్‌ఎస్‌ యువ అగ్రనాయకుడు సిద్ధపడ్డారా? ప్రమాదసూచికలను ఆయన గమనించారా? అందుకు తమ శిబిరంలో అవసరమైన దిద్దుబాట్లు ఏవో అధినాయకుడికి చెప్పగలుగుతారా? లేక, యుక్తులతో చాతుర్యంతో ప్రమాదాన్ని అధిగమించగలమనే భ్రమలోనే ఉంటారా? కెసిఆర్‌ కంటె అమిత్‌షా పెద్ద చాణక్యుడని ఇప్పుడైనా ఒప్పుకోకపోతే ముప్పు మీకే!

దేశపతి శ్రీనివాస్‌ నాయకత్వంలోని తెలంగాణ వికాససమితి, తెలంగాణలోని సాంప్రదాయిక సహజీవన సంస్కృతిని చాటడానికి, తద్వారా మతోన్మాదానికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నం హర్షణీయం. కానీ, ఆ ప్రయత్నంలో ప్రభుత్వంతో కలసి రాగలిగిన అనేక శక్తులు, సంఘాలు, బృందాలు– ప్రభుత్వం వల్ల బాధితులుగా ఉన్నాయన్నది ఆ సభకు అతిథిగా వచ్చిన అధికారపార్టీ నేత గ్రహించగలిగితే, వికాససమితి ప్రయత్నానికి బలం సమకూరుతుంది. స్వేచ్ఛకు కిటికీలు తెరిస్తే, నీతో కలసి నడిచే, నీ కోసం కాకపోయినా సమాజం కోసం నీ కంటె అధికంగా పోరాడగలిగిన శ్రేణులను చేజేతులా ఆవలి శిబిరానికి నెట్టివేయడంలోని అవివేకం ఏమిటో నాయకుడు గ్రహించాలి, పెద్దలతో గ్రహింపజేయాలి. నాతో లేకపోతే ఉగ్రవాదివే అని బుష్‌ అన్నప్పుడు, అది అక్రమం అనిపించిందంటే, నాడు కెటిఆర్‌ హృదయం సవ్యమైన స్పందనను ఇచ్చిందనే అర్థం. అట్లాగే, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారంతా మీకో తెలంగాణకో శత్రువులు కారు. వారు మీ లాగానే తెలంగాణ అభివృద్ధిలో క్రియాశీల భాగస్వాములు కావాలన్న ఉత్సాహం ఉన్నవారు. తెలంగాణ సమాజంలో ఉన్న సమరశీలత, ప్రశ్నించే గుణం వల్లనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమయింది, సహజీవన సాంస్కృతిక విలువలను కాపాడుకోవాలని తెలంగాణవాదులందరూ భావిస్తున్నారు. గొంతు విప్పగలిగే అవకాశం ఉంటేనే, మతతత్వాన్ని వారు నిలదీయగలరు. లేకపోతే, ప్రజాస్వామ్యం గురించి పాలకులు మాట్లాడినప్పుడల్లా వెక్కిరింతలు ఎదురవుతాయి.

రాజా హరిసింగ్‌ ప్యాలెస్‌ (ఇప్పుడది ఉన్నతస్థాయి కారాగారం)లో ఒమర్‌అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తగవులాడుకుంటున్నారట. బిజెపిని కశ్మీర్‌లోకి నువు తెచ్చావంటే నువు తెచ్చావని. దీన్ని ఉటంకిస్తూ, ఎవరో చమత్కరిస్తున్నారు, కొన్నేళ్లకు ఏ ఫలక్‌నుమా పేలస్‌లోనో, చౌమహల్లా ప్యాలెస్‌లోనో (అప్పటికి ఏది హైసెక్యూరిటీ ప్రిజన్‌ అయితే అది) కెసిఆర్‌, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎదురెదురుగా కూర్చుని రాష్ట్రంలో బిజెపి రాకకు నువ్వు కారణమంటే నువ్వు కారణం అని పోట్లాడుకుంటారట! అంతవరకేనా? ఏదో విఐపి జైలులో జగన్‌, చంద్రబాబు కూడా ఎపిలో బిజెపి వైభవానికి నువ్వంటే నువ్వు కారణమని వాదులాడుకుంటారట!  చమత్కారాలదేమున్నది కానీ, అందులో ఉన్న హెచ్చరికలను గమనించండి!

 

 

 

(Courtacy Andhrajyothi)

Leave a Reply