కెనడా నుంచి చైనాకు వైరస్‌లు

0
219

కరోనా ప్రబలడానికి ముందే తరలింపు

లండన్‌: కరోనా ప్రబలడానికి కొన్ని నెలల ముందు కెనడాలోని మైక్రో బయాలజీ ల్యాబ్‌ నుంచి చైనాలోని వుహాన్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ పలు ప్రాణాంతక వైరస్‌లను దిగుమతి చేసుకున్నట్లు తాజాగా వెల్లడైన పత్రాలు తెలియజేస్తున్నాయి. గతేడాది ప్రారంభంలో కెనడా నుంచి ఎబోలా, హెనిఫా వైరస్‌లను వుహాన్‌ ల్యాబ్‌కు తరలించినట్లు బ్రిటన్‌కు చెందిన డైలీ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది. ఇందుకు బాధ్యులైన ఒక మహిళా శాస్త్రవేత్తను కెనడా ప్రభుత్వం విధుల నుంచి తొలిగించినట్లు తెలిపింది. అయితే వైరస్‌ల తరలింపునకు, కరోనా ప్రబలడానికి ఎలాంటి సంబంధం లేదని కెనడా అధికారులు చెబుతున్నారు.

అలాగే శాస్త్రవేత్త తొలిగింపునకు కూడా దీంతో సంబంధం లేదని పేర్కొంటున్నారు. శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం వుహాన్‌ ల్యాబ్‌ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆ వైరస్‌లను పంపించినట్లు తెలిపారు. అయితే నిపుణులు మాత్రం దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సాంక్రమిక వ్యాధుల నిపుణులు ఆమిర్‌ మాట్లాడుతూ.. ‘ఇది అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. విధుల నుంచి తొలిగించడానికి ముందు ఆ శాస్త్రవేత్త ప్రాణాంతకమైన వైరస్‌లను.. ప్రమాదకర ప్రయోగాలకు పేరుగాంచిన వుహాన్‌ ల్యాబ్‌కు పంపించారు. చైనా మిలిటరీతోనూ దానికి సంబంధముంది’ అని వ్యాఖ్యానించారు. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా బయటకు వచ్చిందన్న ఆరోపణలున్న నేపథ్యంలో ఈ విషయం బయటకు రావడం గమనార్హం.

Courtesy Namasthe Telangana

Leave a Reply