4 లక్షల పరిహారం ఇవ్వలేం

0
258

సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం

న్యూఢిల్లీ : కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రకృతి విపత్తుల కారణంగా మరణించిన వారికి మాత్రమే పరిహారం చెల్లింపు వర్తిస్తుందని తెలిపింది. కొవిడ్‌ వైర్‌సతో చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి రూ.4 లక్షలు పరిహారం చెల్లించడం అసాధ్యమని పేర్కొంది. ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్రాలు మోయలేవని తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా 3.85 లక్షల మందికి పైగా చనిపోయారని.. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉన్నందున ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించడం కుదరదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు 183 పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది.

కొవిడ్‌ మృతులకు రూ.4 లక్షల పరిహారం అందించాలని, మరణ ధ్రువీకరణ పత్రాల్లో ‘కొవిడ్‌తో మృతి చెందినట్లు’గా నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ‘మీ విధానం ఏంటో తెలియజేయండి’ అని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ను సమర్పించింది. కొవిడ్‌ మృతులకు పరిహారం చెల్లించి ఇతర వ్యాధులతో మరణించిన వారికి ఇవ్వకపోవడం అన్యాయం అవుతుందని పేర్కొంది. భూకంపాలు, తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా సంభవించిన మరణాలకు మాత్రమే పరిహారం వర్తిస్తుందని.. విపత్తు నిర్వహణ చట్టమూ ఇదే చెబుతోందని కేంద్రం తెలియజేసింది. భూకంపం, తుఫాను, వరదలు లాంటి విపత్తులు ఒక్కసారి వచ్చి పోతాయని.. కరోనా అలా కాదని, మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం సంక్షోభంలో పడిందని తెలిపింది. ఆరోగ్య రంగం ఖర్చులు భారీగా పెరిగిపోయాయని, ప్రభుత్వాలకు పన్ను రాబడి తగ్గిపోయిందని.. ఈ పరిస్థితుల్లో లక్షలాది మంది కొవిడ్‌ మృతులకు పరిహారం చెల్లించలేవని వివరించింది.

అరకొరగా ఉన్న ఆర్థిక వనరులను పరిహారం చెల్లింపులకు వినియోగిస్తే ఆరోగ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని అఫిడవిట్‌లో తెలిపింది. కార్యనిర్వాహక విధానాల్లో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు గత తీర్పుల్లో స్పష్టం చేసిందని.. కేంద్రం తరఫున న్యాయ వ్యవస్థ నిర్ణయాలు తీసుకోరాదని అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ కేసును సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. కొవిడ్‌ బారిన పడి మరణించిన వారందరికీ ఆ విషయాన్ని మరణ ధ్రువీకరణ పత్రాల్లో నమోదు చేస్తామని కేంద్రం తెలిపింది. కరోనాతో ఇంట్లో, ఆస్పత్రుల్లో.. ఇలా ఎక్కడ మరణించినా అటువంటి వారికి ‘కొవిడ్‌తో మరణించినట్లు’గా ధ్రువీకరణ పత్రాల్లో నమోదు చేస్తామని చెప్పింది. ధ్రువీకరణ పత్రం ఇవ్వని వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

మృతులకు డబ్బుల్లేవు.. కోటకు ఉన్నాయా..?: కాంగ్రెస్‌
కొవిడ్‌ మృతులకు రూ.4 లక్షలు పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేయడంపై కాంగ్రెస్‌ మండిపడింది. కేంద్రం ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని  కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ట్విటర్‌లో విమర్శించారు. కొవిడ్‌ మృతులకు ఇచ్చేందుకు డబ్బులు లేవు కానీ, ప్రధాని కోసం కోట నిర్మించేందుకు మాత్రం రూ.20 వేల కోట్లు ఉంటాయా? అని ప్రశ్నించారు.

మరణాలు 10 లక్షలపైనే!
కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 3.86 లక్షలు. కానీ, వాస్తవ సంఖ్య ఎప్పుడో పది లక్షలు దాటేసింది. పలు అధ్యయనాలు, నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుండగా.. మహారాష్ట్ర, బిహార్‌, జార్ఖండ్‌ సహా కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న రికార్డుల సవరణ మరింత ధ్రువపరుస్తోంది. సెకండ్‌ వేవ్‌ ఉధృతి తీవ్రంగా ఉన్న మే నెలలో దేశంలో రోజుకు 4 వేల మంది వరకు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.

కానీ, అప్పట్లో మరణాలు 6 వేల నుంచి 31 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక, కరోనా ప్రారంభం నుంచి భారత్‌లో సంభవించిన మరణాలు ప్రతి ఐదింటిలో రెండు మాత్రమే రికార్డులకు ఎక్కాయి. ఇక సెకండ్‌ వేవ్‌ విరుచుకుపడిన నేపథ్యంలో మృతుల సంఖ్య భారీగా ఉండటంతో లెక్కల్లోకి ఎక్కించడం యంత్రాంగానికి సాధ్యపడలేదు. ఈ విషయాన్ని భారత సంతతికి చెందిన మిచిగన్‌ వర్సిటీ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ భ్రమర్‌ ముఖర్జీ రెండు నెలల క్రితమే చెప్పారు. సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌లో నమోదైన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో గతేడాది కంటే ఈ ఏడాది జనవరి- మే నెల మధ్య మరణాలు 42 శాతం అధికంగా ఉన్నాయి. ఏపీలో(34 శాతం) ఆ తర్వాత స్థానంలో ఉంది. తమిళనాడు(6.2 శాతం), కర్ణాటక(5శాతం)లో మరణాల వ్యత్యాసం మోస్తరుగా ఉంది. ప్రభుత్వాలు వెల్లడించిన దానిప్రకారం ఈ నాలుగు పెద్ద రాష్ట్రాల్లో గత ఐదునెలల్లోనే 50 వేల మంది కరోనాతో చనిపోయారు. కానీ, అసలు సంఖ్య ఇంతకుమించి ఉంటుందని చెబుతున్నారు ఐఐఎం అహ్మదాబాద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చిన్మయ్‌ తంబే. అంతేకాక, కేవలం సెకండ్‌ వేవ్‌లోనే దేశంలో 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. బిహార్‌లో సెకండ్‌ వేవ్‌లో 75 వేల మరణాలు లెక్కలోకి రాలేదని తెలుస్తోంది.

Courtesy Andhrajyothi

Leave a Reply