- కొవిడ్ మరణాల సంఖ్యను రాష్ట్రంలో తక్కువగా చూపిస్తున్నట్లు ఆరోపణలు
- సెకండ్‌వేవ్‌లో అధికారిక లెక్క 2,019
- జనవరి నుంచి మే వరకూ లక్ష మంది మృతి?
- క్షేత్రస్థాయి మరణాలతో పొంతన లేని లెక్కలు
- కుటుంబాలకు పరిహారమివ్వాలన్న సుప్రీం
- వేలాది కుటుంబాలు నష్టపోయే ప్రమాదం
హైదరాబాద్ : కొవిడ్ మరణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. మృతుల కుటుంబాల పాలిట శాపంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నమోదవుతున్న మరణాలకు, సర్కారు ప్రకటిస్తున్న మరణాల సంఖ్యకు పొంతన లేకపోవడమే ఇందుకు కారణం. కొవిడ్ బారిన పడి రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్నా.. మరణాల సంఖ్యను ప్రభుత్వం అతి తక్కువగా చూపిస్తోందన్న ఆరోపణలు మొదటినుంచీ వస్తున్నాయి. కాగా, కొవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించిన మరణాలకే ఎక్స్‌గ్రేషియా ఇస్తామని కేంద్రం ప్రకటిస్తే.. వేలాది బాధిత కుటుంబాలు నష్టపోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ లెక్కల్లో సెకండ్‌వేవ్‌లో 2019 మంది మాత్రమే కరోనాతో మరణించినట్లు చూపించారు. అధికారిక లెక్కల ప్రకారం.. గత ఏడాది మార్చిలో తొలి మరణం నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తంగా 3669 మంది కొవిడ్‌తో చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం 6,24,379 కరోనా కేసులు నమోదయ్యా యి. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కేసులకు, మరణాలకు ఎక్కడా పొంతన కూడా కుదరడం లేదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఇంతకంటే తక్కువ కేసులు నమోదైనప్పటికీ మరణాలు వేలల్లో సంభవించాయి. ఉదాహరణకు.. పంజాబ్‌లో ఇప్పటివరకు 5,95,899 కేసులు నమోదు కాగా, 16,072 మంది మరణించారు. ఉత్తరాఖండ్‌లో 3,40,379 పాజిటివ్‌లు రాగా, 7324 మంది చనిపోయారు. తెలంగాణలోనూ మరణాలు ఎక్కువగానే సంభవించి ఉంటాయన్నది అందరి అభిప్రాయం.
గాంధీలోనే రోజుకు వందకుపైగా మరణాలు..!
సెకండ్ వేవ్ పతాక స్థాయిలో ఉన్న ఏప్రిల్ 25 నుంచి మే 15 వరకు పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఆ సమయంలో గాంధీ ఆస్పత్రిలో రోజుకు వందకు పైగా కొవిడ్ రోగులు చనిపోయారని అక్కడి వైద్య వర్గాలే వెల్లడించాయి. సర్కారు వారి ‘బర్త్ అండ్ డెత్’ వెబ్సైట్లోనే ఈ ఏడాది జనవరి నుంచి మే చివరి వరకు ఏకంగా లక్ష మంది చనిపోయినట్లు ఉంది. కానీ, ప్రభుత్వం వాటిని కొవిడ్ మరణాలుగా వెల్లడించడంలేదు. దీనివల్ల ఇప్పటికే నష్టం జరిగింది. సెకండ్‌వేవ్‌లో ఆయా రాష్ట్రాల్లో నమోదైన పాజిటివ్ కేసుల ఆధారంగా కేంద్రం ఆక్సిజన్ కేటాయింపులు, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల పంపిణీ చేసింది.
ఈ క్రమంలోనే తెలంగాణలో కేసులు తక్కువగా ఉన్నాయని, ఆ లెక్కనే ఆక్సిజన్‌ను, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను తక్కువ కేటాయించింది. దాంతో ఒక దశలో ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ కొరత తీవ్రంగా ఏర్పడి.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా.. కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించడంతో.. అధికారికంగా కొవిడ్ మరణంగా నమోదుకాని కుటుంబాల పరిస్థితేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు మరణాల సంఖ్యలో వాస్తవాలను వెల్లడిస్తూ వచ్చాయి. కానీ, తెలంగాణలో మాత్రం ఇప్పటికీ అటువంటి దిద్దుబాటు చర్యలేవీ తీసుకుంటున్నట్లు కనిపించడంలేదు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపునకు కేంద్రం అంగీకరించి, మార్గదర్శకాలు విడుదల చేశాక చూద్దామన్న ఆలోచనలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.
Courtesy Andhrajyothi