– కరోనా దెబ్బకు పతనమవుతున్న ఆర్థికవ్యవస్థే కారణం..
– ఐఎల్‌ఓ, యూనిసెఫ్ చీఫ్ హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), యూనిసెఫ్ కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని దేశాల్లోనూ పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ మరింత మంది పిల్లలను బాల కార్మికులుగా మార్చే ముప్పు ఉందని హెచ్చరించింది. గత 20 ఏండ్ల నుంచి కొద్దోగొప్పో తగ్గుతూ వస్తున్న బాలకార్మికులు మహమ్మారి నేపథ్యలో పెరిగే ప్రమాదం పొంచి వుందని తెలిపింది. ‘కోవిడ్-19 అండ్ చైల్డ్ లేబర్’ పేరుతో ఐఎల్‌ఓ, యూనిసెఫ్ శుక్రవారం ఓ నివేదిక విడుదల చేశాయి. కరోనావైరస్ వ్యాప్తి నడుమ చాలా కుటుంబాలు పేదరికంలో పడటంతో బడి మానేసే పిల్లల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. పిల్లల నుంచి బాల్యాన్ని, వారి గౌరవాన్ని దోపిడీ చేయకుండా అడ్డుకునే బాల కార్మిక చట్టాలను ఆర్థిక ఇబ్బందులు నీరు గార్చే ముప్పు ఉన్నదనీ, ఇది పిల్లల శారీరక, మానసిక అభివద్ధికి చాలా ప్రమాదకరమని నివేదికలో పేర్కొన్నారు. పేదరికంలో ఒక పాయింట్ పెరుగుదల కొన్ని దేశాల్లో కనీసం 0.7 శాతం బాల కార్మికుల పెరుగుదలకు దారితీస్తుందని అధ్యయనాలు తెలుపుతున్నాయని అన్నారు. ‘సంక్షోభ సమయాల్లో సామాజిక రక్షణ చాలా ముఖ్యమైనది, ఉపాధి కోల్పోయి, ఆదాయం లేక అల్లాడుతున్నవారికి అది సహాయంగా నిలుస్తుంది. అలాగే పిల్లలను పనుల్లో పెట్టకుండా అడ్డుకునే నిబంధనలకూ, చట్టాలకు అనేక దేశాలు కోరలు పీకే ప్రమాదం ఉంది. ఆ దిశగా పడుతున్న అడుగులను సహించేదిలేదు’ అన్నారు.
Courtesy Nava Telangana