లాక్డౌన్లో ఆదివాసీల వెతలు

0
619
బృందాకరత్‌

తెలంగాణ రాష్ట్రం నుంచి కాలినడకన ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి చేరుకొనేలోపే ఆకలి, డీహైడ్రేషన్‌తో జమ్లో మక్దమ్‌ అనే 12ఏండ్ల ఆదివాసీ బాలిక మరణించడం, దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ కాలంలో ఆదివాసీలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో సూచిస్తున్నది. కరోనా వైరస్‌ మహమ్మారిపై మోడీ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం, భారతదేశ కార్మికుల వ్యతిరేక అప్రకటిత యుద్ధంగా మారుతున్నది. ఆ కార్మికులలో ఆదివాసీలూ ఉన్నారు.

ఈ మార్చి నెలలో సీపీఐ(ఎం) యంపీ, పీ.ఆర్‌.నటరాజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, భారతదేశంలో 10కోట్లమంది వలస కార్మికులు ఉన్నారని, కానీ చాలా మంది కార్మికులకు అవసరమైన ధవీకరణ, నమోదు పత్రాలు లేవని ఒక అస్థిరమైన అంచనాను ప్రభుత్వం ఇచ్చింది. ఇంత పెద్ద శ్రామికశక్తికి సంబంధించిన సామాజిక పొందిక వివరాలు ప్రభుత్వం వద్ద ఏమీలేవు. రెండు దశాబ్దాల క్రితం ప్రచురించబడిన ‘నేషనల్‌ సాంపుల్‌ సర్వే ఆఫీస్‌’ వారు చివరగా నిర్వహించిన మైగ్రేషన్‌ సర్వే 1992-93 – 2007-08 మధ్య కాలంలో షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన వలస కుటుంబాలు మిగిలిన వారందరి కుటుంబాల కన్నా ఎక్కువ అని తెలిపింది. మహిళా వలస కార్మికుల్లో షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన కార్మికులే అందరికన్నా పెద్ద గుంపుగా ఉన్నారని అదే సర్వే తెలిపింది. అప్పటి నుంచి వేతన శ్రమపై ఆధారపడే ఆదివాసీల సంఖ్య, వ్యవసాయంపై ఆధారపడేవారి కన్నా పెరిగింది. దారిద్య్రరేఖకు దిగువన 45.5శాతంగా ఉన్న గ్రామీణ ఆదివాసీలు, ఏడాది పొడవున సాధారణంగా వ్యవసాయదారులుగా, వ్యవసాయ కూలీలుగా, వ్యవసాయేతర వత్తుల్లో కూలీలుగా, పని వెతుకులాటలో వలస కూలీలుగా వివిధ రకాల పనులు చేస్తారు. గత కొన్నేండ్లుగా ఆదివాసీ ప్రజలను నిరాశ్రయులను చేస్తూ, వారి భూమిని, అడవి ఆధారిత వనరులను చేజిక్కించుకునే చర్యలు వేగవంతం అవుతున్నందు వల్ల, ఆదివాసీలు వలస కార్మికులుగా మారే సంఖ్య పెరుగుతూ ఉంది.

ఆదివాసీల వలస విధానం మిగిలిన కార్మికుల కంటే భిన్నంగా ఉంటుంది. వారి వలసలు స్వల్పకాలికంగా, రుతువుల ఆధారంగా రాష్ట్రంలోనూ, అంతర్రాష్ట్రంగానూ ఉంటాయి. ప్రధానంగా రుతు సంబంధమైన వ్యవసాయం, నిర్మాణ పనులు, ఇటుకల తయారీ బట్టీల్లో, పట్టణ ప్రాంతాల్లో సేవలందించే పనివారుగా పని చేయడానికి ఆదివాసీలు వలస వెళ్తారు. మహారాష్ట్రలో చేపలు పట్టేందుకు ఆదివాసీలు ఎక్కువ సంఖ్యలో వలసవెళ్తారు. ఇంకా ఆదివాసీ యువతులు పట్టణ ప్రాంతాల్లో ఇంటిపని వారుగా పని చేసేందుకు వలస వెళ్తారు. కూలీల గుత్తేదారుల పాత్ర కూడా ఇక్కడ కచ్చితంగా ఉంటుంది. ఈ వలస విధానంలో చేయవలసిన పని ప్రాంతానికి కార్మికులను తీసుకుని వెళ్లే గుత్తేదారులు ముందుగా ఆదివాసీ కార్మికుల గుంపును నియమించుకుంటారు. ఈ గుత్తేదారులు ముందే చెల్లింపులు చేసిన తర్వాత కార్మికులు వారికి వెట్టి చేసే వ్యక్తులుగా వారి అధీనంలో ఉంటారు. ఆకస్మికంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన సమయానికి, అప్పటికే వలసలు మొదల య్యాయి. రాష్ట్రాల్లో పని నిలిచిపోయిందని ఆదివాసీలు చెబుతున్నారు.

గుత్తేదారులు అసలు యజమానుల కోపాలకు, గద్దింపులకు బెదిరి ఆదివాసీలను అర్థంతరంగా వదిలేసి పారిపోయారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా పోలీసులు పేదలపై ప్రదర్శించే విరోధ భావనలకు ఆదివాసీలు నిస్సహాయులుగా ఉంటున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ఎవరి సహాయం పొందలేక, స్వస్థలాలకు వెళ్ళేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు లేక దేశ వ్యాప్తంగా ఆదివాసీ వలస కార్మికులు సుదీర్ఘమైన బాధతో కూడిన తిరుగు ప్రయాణంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రధాన రహదారుల పైన కాకుండా, అడవుల్లో, ప్రక్క దారుల వెంట కాలినడకన బయలుదేరి వెళ్ళారు.

చట్టాలు – హక్కులు
మోడీ ప్రభుత్వ కార్మికచట్ట సంస్కరణల అజెండాలో భాగంగా వలస కార్మికులకు ఉన్న ఏకైక ‘1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం’ రద్దు చేయబడే దిశలో ఉంది. ఇది కార్మికవర్గం పోరాడి సాధించుకున్న హక్కులను నాశనం చేసే ‘లేబర్‌కోడ్‌’ అనే సాధనంతో కలుస్తుంది. వారంతట వారు వలస వెళ్ళిన కార్మికులను మినహాయించి, గుత్తేదారుల ద్వారా వెళ్ళిన వలస కార్మికుల సమస్యలకు మాత్రమే ఉద్దేశించబడిన ‘1979 చట్టం’ అసంపూర్ణమైనది అయినప్పటికీ, గుత్తేదారుల ద్వారా వెళ్ళిన ఆదివాసీ వలస కార్మికుల విషయంలో ఆ చట్టం అమలు వారి చెల్లింపులకు, వారి స్వస్థలాలకు వెళ్ళడానికి ఉచిత ప్రయాణ ఏర్పాట్లకు హామీ ఇచ్చి ఉండాల్సింది.

లాక్‌డౌన్‌లో పనిలేక రెండు నెలల పాటు ఇబ్బందిపడిన ఆదివాసీ వలస కార్మికులు పైసల్లేకుండా ఇంటికి వెళ్తారు. కానీ ప్రభుత్వ విధానాల్లో ప్రకటించిన ప్యాకేజీల అమలులో వారు ఎక్కడా లేరు. ప్రజాపంపిణీ వ్యవస్థ పనితీరు ఆదివాసీల నివాస ప్రాంతాల్లో ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో సాధారణంగా ఒక క్రమపద్ధతిలో ఉండదు. ఇప్పుడు లాక్‌డౌన్‌ అమలు కాలంలో, ఆదివాసీ ప్రాంతాల్లో భయంకరమైన ఆకలి, తిండి లేమి సమస్యలున్నట్టు క్షేత్రస్థాయి నివేదికలు ఎత్తి చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనిని ఏప్రిల్‌ 20 నుంచి మాత్రమే ప్రారంభించడానికి అనుమతించింది. ప్రస్తుతం ఆదివాసీ ప్రాంతాల్లో ఉపాధిహామీ పనులు, కొంత వరకు ఒక్క ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో తప్ప ఎక్కడాలేవు. ఉపాధిహామీ చట్టం పనులను వ్యవసాయ సంబంధిత పనులకే కాక, చిన్న చిన్న అటవీ ఉత్పత్తుల సేకరణకు కూడా ఉపయోగించవచ్చు, ఉపయోగించాలి కూడా. ఈ పనిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఆదివాసీ మహిళలకు శ్రమ కూడా కొంత వరకు తగ్గుతుంది. అదేవిధంగా వారిలో ఉండే తీవ్రమైన నిరాశా, నిస్పహల నుంచి ఉపశమనం పొందేందుకు కూడా ఆ పని ఉపయోగపడు తుంది. ప్రభుత్వం చిన్న చిన్న అటవీ ఉత్పత్తులకు సవరించిన ధరలు ప్రకటించినప్పటికీ, కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల వాటిని మధ్య దళారులకు అమ్మడంతో కొద్ది ఆదాయం పొందడం, లేదా అసలు ఆదాయం పొందక పోవడం జరుగుతున్నది.

కరోనా వైరస్‌ కన్నా, ఈ లాక్‌డౌనే ఆదివాసీల కష్టాలకు, బాధలకు కారణమైంది. అనేక ఆదివాసీ ప్రాంతాలు ఇప్పటివరకు వైరస్‌ బారిన పడలేదు. కానీ ఆదివాసీల నివాస ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి, ఆదివాసీ వలస కార్మికులు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు పెద్దసమస్యగా ఉంటుంది. ఆదివాసీ ప్రాంతాల్లో లోటుకు సంబంధించిన గణాంకాల వివరాలు గిరిజన సంక్షేమ మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన వార్షిక నివేదికలో, ఉప కేంద్రాల్లో 20.7శాతం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 26శాతం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో 23శాతం లోటు ఉన్నట్టు పేర్కొనబడింది. డాక్టర్ల సంఖ్యలో చాలా ఎక్కువగా 27శాతం లోటు ఉంది. ఆదివాసీ ప్రాంతాల్లో అనేక చోట్ల ఖనిజాలు సమద్ధిగా లభిస్తాయి. గనుల ప్రభావిత ప్రాంత ప్రజల అభివద్ధి కోసం ఉద్దేశించబడిన ‘జిల్లా గనుల నిధి’ మొత్తం 35,925 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి వరకు కేవలం 35శాతం నిధులు మాత్రమే, అది కూడా మైనింగ్‌ కంపెనీలకు సహాయపడే మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయబడినాయి.

మోడీ ప్రభుత్వం ఈ నిధులను కోవిద్‌-19ను అదుపునకు సంబంధించిన ఖర్చుల కోసం ఉపయోగించే విధంగా అక్రమ పద్ధతుల్లో అనుమతించింది. కానీ ఈ రెండు నెలల్లో ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక వైద్య సదుపాయాలను బలోపేతం చేయడానికి ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.
ఆదివాసీ ప్రాంతాల్లో ప్రబలిన భయానక పరిస్థితులను అరికట్టడానికి బదులుగా, మోడీ ప్రభుత్వం ఆదివాసీల రాజ్యాంగ బద్ధమైన, న్యాయమైన హక్కులను బలహీనపర్చడంతో పాటు, కార్పొరేట్‌ అనుకూల ఎజెండాను ముందుకు తీసుకొని వెళ్ళేందుకు ఈ లాక్‌డౌన్‌ను ఉపయోగించుకుంటున్నది.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐదవ షెడ్యూల్‌ ప్రాంతాల్లో పాఠశాల ఉపాధ్యాయ పోస్టుల్లో ఆదివాసీలకు మాత్రమే ఉన్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ప్రశ్నార్థకమైన తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు ఐదవ షెడ్యూల్‌ ప్రాంతాల్లోని ఆదివాసీల ప్రత్యేక రాజ్యాంగ నిబంధనలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. లాక్‌ డౌన్‌ కారణంగా నిరసనల వెల్లువ లేకపోవడం అంటే, ఆదివాసీలు ఈ అన్ని సమస్యలపై నిశ్శబ్దంగా ఉంటారని అర్థం కాదు.

‘ద హిందూ’ సౌజన్యంతో
అనువాదం: నీహా గౌతమ్

Courtesy Nava Telangana

Leave a Reply