ఉద్యోగ భద్రతపై భయాలు

0
225

– భారత్‌లో 58 శాతం మంది ఆందోళన
– కరోనా విజృంభిస్తున్న వేళ.. పని ప్రదేశంలో శుభ్రత అంతంతే : యుకేజీ సర్వే

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందనీ.. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు పోవచ్చన్న ఆందోళనలు పెరిగినట్టు ఓ సర్వేలో వెల్లడైంది. ది వర్క్‌ ఫోర్స్‌ ఇన్సిట్యూట్‌ (యూకేజీ )11 దేశాల్లో 4000 మంది ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించి ‘హైండ్‌సైట్‌ 2020 : 2021లోనూ కోవిడ్‌ ఆందోళనలు’ పేరుతో ఓ సర్వే చేసింది. ఆ వివరాలు.. కార్యాలయాలకు వెళ్లి పని చేసే వారితో పోల్చితే ఇంటి నుంచి పని చేస్తున్న వారు కొంత తక్కువ భారంగా భావిస్తున్నారు.

మరోవైపు ఎక్కడ నుంచి పని చేసిన అలసి పోతున్నామని 43 శాతం మంది పేర్కొన్నారు. కరోనా సంక్షోభ ప్రభావం వల్ల భవిష్యత్తులోనూ ఉద్యోగాలు ఊడొచ్చని 36 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోవడంలో ఇతర దేశాలతో పోల్చితే చైనాలో ఉద్యోగులు తక్కువగా ప్రభావితం అయ్యారు. అయినా భవిష్యత్తు ఉద్యోగ భద్రతపై 44 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా మెక్సికోలో 41 శాతం, కెనడాలో 40 శాతం, అమెరికాలో 37 శాతం మంది తమ భవిష్యత్తు ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

అన్ని వయస్సుల వారు ఈ భయాన్ని వ్యక్తపరిచారు. కాగా ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో అత్యధికంగా 58 శాతం మంది తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాలతో పోల్చితే భారత ఉద్యోగులు తమ పని ప్రదేశంలో వైద్య భద్రత, శుభ్రత పట్ల ఎక్కువ భయాందోళనలో ఉన్నారు. దాదాపుగా 72 శాతం మంది తమ భవిష్యత్తు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంలో భారత్‌ తర్వాత ఫ్రెంచ్‌ వాళ్లు తమ పని ప్రదేశాలు అంత భద్రంగా ఉన్నాయని అనుకోవడం లేదన్నారు. మెక్సికోలో 60 శాతం, కెనడాలో 50 శాతం, జర్మనీలో 47 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సర్వేలో 11 దేశాల ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించారు. ఇందులో ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఇండియా, మెక్సికో, నెథర్లాండ్స్‌, న్యూజీలాండ్‌, బ్రిటన్‌, అమెరికా దేశాలున్నాయి.

Courtesy Nava Telangana

Leave a Reply