కరోనాపై పత్రికల పోరాటం.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పత్రికా రంగం

0
209

చెన్నుపాటి రామారావు

ఆర్థిక రంగం, తయారీ రంగం.. ఇలా రంగమేదైనా కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. ప్రతి ఒక్కరికీ సమాచారాన్ని అందించే పత్రికా రంగమూ కకావికలమైంది. గతానికి భిన్నంగా దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. రెవెన్యూ ఘోరంగా పడిపోయినా జన జీవన స్రవంతిలో భాగమైన పత్రికలు ఒడిదుడుకులను తట్టుకుని మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. సంక్షోభ సమయంలో పాలకుల లోపాల వెల్లడిలో ముందుండి, ప్రజల వెతలను తీర్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజా హృదయాలను హత్తుకుంటున్నాయి. అక్షర వెలుగుల ప్రసరణలో పత్రికలదీ అలుపెరుగని పోరాటమే.

కరోనా విశ్వవ్యాప్తంగా జనావళిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న మహమ్మారి. అన్ని రంగాలను చిన్నాభిన్నం చేసింది. ఏడు నెలలుగా సమాచార యజ్ఞాన్ని నిర్విఘ్నంగా సాగించిన పత్రికల పాత్ర గణనీయమైనదే. సంక్షోభ కాలంలోనూ పత్రికలు సమాచారాన్ని అందించడం ఆపలేదు. తొలుత పేపర్ పై వైరస్ ఉంటుందని, దాని ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని దుష్ప్రచారం జరగడంతో అసలు పత్రికలు కొనాలంటేనే జనం భయపడ్డారు. దీంతో చాలా పత్రికల సర్క్యులేషన్ గతంలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. ప్రకటనల ఆదాయం తగ్గిపోయి, యాజమాన్యాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. పత్రికల నిర్వహణే కత్తిమీద సాములా మారింది. ఈ గడ్డు పరిస్థితుల నుంచి చాలా పత్రికలు నేటికీ కోలుకోలేదు. కొన్ని చిన్నాచితకా పత్రికలు మూతపడ్డాయి కూడా.

కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ..
ప్రధాన పత్రికలన్నీ కరోనా ప్రభావం, పరిణామాలను అక్షర బద్ధం చేయడంలో గత కొంత కాలం నుంచి అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత లాక్ డౌన్ మొదలయ్యాయి. భౌతిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ల వాడకం నిత్యకృత్యమైంది. సాక్షాత్తు మన ప్రధానమంత్రి సైతం ఇప్పటికీ కరోనా జాగ్రత్తలపై జనాన్ని తరచూ అప్రమత్తం చేస్తున్నారు. ఈ జాగ్రత్తలను ప్రజలకు చేరవేయడంలో పత్రికలు కీలకంగా మారాయి. జనం పాటించాల్సిన జాగ్రత్తలు, చట్టపరంగా తెలుసుకోవాల్సిన విషయాలను ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ వైరస్ వ్యాప్తి కట్టడిలో తమ పాత్రను నిబద్ధతతో పోషించాయి. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు, కోలుకున్న వారి వివరాలు, వైరస్ నుంచి కోలుకోవడంలో ఎదురైన అనుభవాలు వంటి వాటిని ప్రజలకు చేర్చడం ద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు పత్రికలు ఉపయోగపడ్డాయి. ఈ కష్టకాలంలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ఏమాత్రం వెరవకుండా తమ ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చిన తీరును ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేశాయి. కరోనా వ్యాక్సిన్ పై జరుగుతున్న పరిశోధనలను తెలియజేస్తూ ప్రజల్లో ఆశావాద దృక్పథాన్ని నింపడంలో పత్రికలు సాయపడ్డాయి. వైరస్ లో వచ్చే మార్పులు, వ్యాప్తి తీరును అప్ డేట్ చేస్తూ అప్రమత్తంగా ఉండేలా సమాచారాన్ని చేరవేశాయి. కరోనా కాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన సమస్యల పైనా కథనాలు విశ్లేషణలు ఎప్పటికప్పుడు వెలువడుతూ వచ్చాయి. అన్ లాక్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల విషయంలో అప్రమత్తం చేస్తూ ఎత్తేసింది లాక్ డౌన్ మాత్రమేనని, కరోనా మన మధ్యనే ఉందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ వచ్చాయి.

రిపోర్టర్ల ధైర్యానికి ప్రశంసలు
కరోనా చుట్టుముడుతున్న విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులు ప్రాణ భయాన్ని లెక్క చేయకుండా ప్రజలకు సమాచారం అందించడానికి ముందడుగు వేశారు. మిగతా వాళ్లు కరోనా ట్రీట్మెంట్ చేస్తున్న ఆస్పత్రుల వైపు వెళ్లడానికే భయపడుతున్న సమయంలో రిపోర్టర్లు నేరుగా కోవిడ్ వార్డుల వరకూ వెళ్లేందుకూ వెనుకాడలేదు. డాక్టర్లు, నర్సులపై సైతం కొంత మంది మూర్ఖంగా దాడులు చేసిన సమయంలో మీడియా ప్రతినిధులు వాళ్ల బాధలను ప్రపంచానికి తెలిసేలా చేశారు. పీపీఈ కిట్లు లేక పడిన ఇబ్బందులను, జీతాల విషయంలో నర్సులు ఎదుర్కొన్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయడంలో తమ పాత్ర పోషించారు. భయాలను అధిగమిస్తూ రిపోర్టర్లతో డెస్క్ సిబ్బంది, ఫొటో గ్రాఫర్లు, ప్రింటింగ్ సెంటర్ల స్టాఫ్, ఇతర టెక్నికల్ సిబ్బంది అంతా తమ ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తున్నారు. మరోవైపు ఆర్థిక సమస్యలు, ఆటుపోట్లు ఎదురైనా యాజమాన్యాలు, సంస్థలు పత్రికల ప్రచురణను ఆపకుండా ముందుకెళ్లడాన్ని ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు.

అపోహలతో దెబ్బతిని.. ఇప్పుడిప్పుడే గాడిన
గత మార్చిలో దేశ వ్యాప్తంగా కరోనా భయాలు విజృంభిస్తున్న తరుణంలో వార్తా పత్రికలపైనా వైరస్ ఉంటుందని జోరుగా ప్రచారం సాగడంతో జనం న్యూస్ పేపర్లు కొనేందుకు ముందుకు రాలేదు. కానీ పత్రికల వల్ల వైరస్ వ్యాపించే అవకాశం ఉందని ఏ పరిశోధనల్లోనూ నిరూపణ జరగలేదని డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు సైతం ప్రకటించాక పటాపంచలయ్యాయి. ఇప్పుడిప్పుడే పత్రికల ప్రచురణ, అమ్మకంలో కాస్తంత వేగం పెరిగింది. కరోనా పరిస్థితుల్లో ప్రజలకు అవగాహన పెంచుతూ వైరస్ ను ఎదుర్కోవడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయనడంలో సందేహం లేదు. అన్ని రంగాలూ దెబ్బతిని ప్రకటనల ఆదాయం కూడా కోల్పోయినా ప్రజలకు సమాచారాన్ని అందించే యజ్ఞాన్ని ఆపలేదు.

వలస కూలీల వెతలపై..
కరోనా తొలినాళ్లలో వలస కూలీల వెతలపై ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు అందించడం ద్వారా వారి కష్టనష్టాలను అందరికీ తెలియజేశాయి పత్రికలు. లాక్ డౌన్ సమయంలో వాస్తవిక పరిస్థితి ప్రజలకు తెలిసేలా సాయపడ్డాయి. నలుగురూ నాలుగు రకాలుగా తోటి వారికి సాయపడ్డ విషయాలను అందరిలో స్ఫూర్తి పెంచేలా ప్రచురితమయ్యాయి. బాధితులను ఆదుకోవడంలో దాన గుణం కలిగిన వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగాయి. దేశ వ్యాప్తంగా అన్ని పత్రికలు కరోనా వార్తలు విరామమెరుగని రీతిన ప్రచురిస్తున్నాయి. వైద్యం, ఆరోగ్యం, పరిశోధనలు, జాగ్రత్తలు, మెళకువలు, సమాజ పరిరక్షణ ఇలా పలు అంశాల్లో పుంఖానుపుంఖాలుగా వార్తలు రావడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. కరోనాకు సంబంధించి టీవీ చానెళ్లు సమాచారమిచ్చినా భిన్నకోణాల్లో పూర్తి వివరాలు, విశ్లేషణలతో కూడిన కథనాలను  తెలుసుకోవడానికి ప్రజలు పత్రికలపైనే ఆధారపడుతున్నారు.

సీనియర్ జర్నలిస్ట్

Leave a Reply