శిష్యుడి కుటుంబంలో మరో ఇద్దరికి పాజిటివ్
ఆనందయ్య నాటు మందు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన తరుణంలో ఆయన టీమ్‌లో వాలంటీర్‌గా పనిచేస్తోన్న ఓ యువకునికి కరోనా సోకింది. ఆ యువకుడి ద్వారా భార్య, కుమారుడుకి పాజిటివ్ వచ్చింది. శనివారం గ్రామంలో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించగా ఇది బయటపడింది. దీంతో ఒక్కసారిగా కృష్ణపట్నం ఉలిక్కిపడింది. ఆనందయ్య మందు కరోనాను తగ్గిస్తోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన టీమ్‌లోని వ్యక్తికి కరోనా రావడం చర్చనీయాంశమైంది. సుమారు 15 రోజుల నుంచి గ్రామంలోని కొందరు యువకులు, మహిళలు ఆనందయ్య టీమ్‌లో వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. ఆకులు, మూలికలు తీసుకురావడం, ఆకులు వలవడం, పొయ్యి మీద కాయడం వంటి పనులు చేస్తున్నారు. కృష్ణపట్నం గ్రామం మొత్తం మందు పంపిణీ చేశారని, ఒక్కరూ కరోనా బాధితులు లేరని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల మెడికల్ ఆఫీసర్ గ్రామంలో 14 పాజిటివ్ కేసులు ఉన్నాయని మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే. శనివారం గ్రామంలో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆనందయ్య టీమ్‌లో 15 రోజుల నుంచి పనిచేస్తోన్న కృష్ణపట్నం గ్రామంలోని కరణం వీధికి చెందిన కరణం సునీల్‌కు కరోనా నిర్ధారణ అయింది. ఆయన భార్య కరణం సాయి రమ్య, వారి మూడు సంవత్సరాల కుమారుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. సునీల్ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం.
120కి చేరిన కృష్ణపట్నం బాధితులు!
కృష్ణపట్నం ఆనందయ్య నాటు మందు కళ్లలో వేసుకొని ఆక్సిజన్ లెవల్ పెరిగాయని ఇంటికి వెళ్లిన అనేక మంది ఇప్పుడు ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో ప్రతి రోజూ పదుల సంఖ్యలో తిరిగి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుతున్నారు. శుక్రవారం రాత్రి 110 మంది ఆస్పత్రిలో ఉండగా, శనివారం మరో పది మంది సీరియస్ కండిషన్‌లో చేరారు. కళ్ల మంటలు, ఆక్సిజన్ లెవల్స్ బాగా తగ్గడంతో వచ్చిన్నట్లు తెలుస్తోంది. డి.లక్ష్మమ్మ అనే వృద్ధురాలు శనివారం సాయంత్రం 6.30 గంటలకు జిజిహెచ్‌కు వచ్చింది. అప్పటికే ఆమెకు ఆక్సిజన్ లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. సీరియస్ కావడంతో వెంటనే ఐసియులో చేర్పించారు. 202116712 నంబర్‌తో రిజిస్టర్ చేసుకొని చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ఈ నెల 15న కరోనా పాజిటివ్ వచ్చింది. 19న ఆనందయ్య మందు తీసుకుంది. నోటి ద్వారా, కంట్లో చుక్కలు వేయించుకుంది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటోంది. ప్రస్తుతం పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో శనివారం చేరిన వారిలో ఎస్‌కె షేష్మా (ఆక్సిజన్ లెవల్స్ 62 శాతం), శోభ (ఆక్సిజన్ లెవెల్స్ 52 శాతం) ఎస్‌కె.ఇంతియాజ్ (ఆక్సిజన్ లెవెల్స్ 98 శాతం), ఒ.నాగులు (ఆక్సిజన్ లెవెల్స్ 95 శాతం), సిహెచ్.మల్లికార్జున (ఆక్సిజన్ లెవెల్స్ 61 శాతం), ఇ.పోతయ్య (ఆక్సిజన్ లెవెల్స్ 90 శాతం), బ్రహ్మరెడ్డి (ఆక్సిజన్ లెవెల్స్ 97 శాతం), డి.లక్ష్మమ్మ (నో ఆక్సిజన్ లెవల్స్), పి.సురేష్ (ఆక్సిజన్ లెవెల్స్ 95 శాతం) ఉన్నారు. కృష్ణపట్నం చుక్కల మందు కేసుల పేరుతో కేష్ షీట్‌లో నమోదు చేసుకొని వీరికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జిజిహెచ్‌లో 120 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 12 మంది ఐసియులో ఉన్నారు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య పరిస్థితి నేటికీ విషయంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
కృష్ణపట్నం కేసులపై కలెక్టర్ ప్రత్యేక సమావేశం
జిజిహెచ్‌లోని కృష్ణపట్నం కేసులపై కలెక్టర్ చక్రధర్‌బాబు శుక్రవారంం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బాధితులకు వైద్యం ఎలా అందుతోంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపై చర్చించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకోవాలని వైద్యులను ఆదేశించారు.
మళ్లీ పోలీసుల రక్షణలో ఆనందయ్య
ఆనందయ్యను పోలీసులు మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆనందయ్యను ఇంటికి పంపిన సంగతి తెలిసిందే. శనివారం తెల్లవారుజామున ఐదు గంటలను పోలీసులు ఆయనను ఇంటి నుండి మళ్లీ తీసుకెళ్లారు. గ్రామంలో ఆందోళనగా ఉండడంతో కృష్ణపట్నంలోని సివిఆర్ అతిథి గృహంలోని డి బ్లాక్‌లో ఉంచారు. ఆయనను బిజెపి నేతలు, ఇతర నేతలు కలిశారు.
Courtesy Prajashakti