ప్రిన్స్‌ చార్లెస్‌కు కరోనా

0
149

ప్రస్తుతం స్వీయ ఐసొలేషన్‌లో!
కరోనాపై దేశాధ్యక్షుల బాధ్యతారాహిత్యం
మీడియా హడావుడితో ప్రజల్లో భయం
లాక్‌డౌన్లు ఎత్తివేయాలి: బ్రెజిల్‌ అధ్యక్షుడు
ప్రజలు పనిలోకి వెళ్లాలనుకుంటున్నారు
మాంద్యంలోకి నెట్టేస్తే ఆత్మహత్యలు: ట్రంప్‌
ట్రంప్‌ది బాధ్యతారాహిత్యం: బిల్‌ గేట్స్‌
ప్రపంచవ్యాప్తంగా మృతులు 19,246
4.27 లక్షల మందికి కొవిడ్‌-19

లండన్‌, లాస్‌ఏంజెలిస్‌ : కరోనా భయంతో గత కొద్దిరోజులుగా ఎవరిని కలిసినా భారతీయశైలిలో చేతులు జోడించి నమస్తే చెబుతున్నప్పటికీ.. బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ చార్లెస్‌ (71)కు ఆ వైరస్‌ ముప్పు తప్పలేదు. ఆయనకు కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. కొద్దిపాటి ఇన్ఫెక్షన్‌ లక్షణాలున్నాయని, ప్రస్తుతం ఆయన స్కాట్లాండ్‌లో స్వీయ ఐసోలేషన్‌లో ఉన్నారని చార్లెస్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆయన భార్య కామిల్లా (72)కు వైరస్‌ నెగెటివ్‌ వచ్చిందని వివరించాయి. అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా ఆమెను కూడా స్వీయ ఐసోలేషన్‌లో ఉంచారు. కాగా.. ప్రిన్స్‌ చార్లెస్‌ తన తల్లి క్వీన్‌ ఎలిజెబెత్‌ (93)ను మార్చి 12న కలిశారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. బ్రిటన్‌లో ఇప్పటిదాకా 8,264 మందికి వైరస్‌ సోకగా.. 435 మంది మరణించారు. ఇప్పుడు ప్రిన్స్‌ చార్లె్‌సకే వైరస్‌ పాజిటివ్‌ రావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మరోవైపు.. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ‘హార్వర్డ్‌ యూనివర్సిటీ’ అధ్యక్షుడికి, ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. అలాగే.. భూతాపం, పర్యావరణ ముప్పుపై కొద్దిరోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నే ఉరిమిచూసిన చిచ్చరపిడుగు గ్రెటా థెన్‌బర్గ్‌ గుర్తుందా? ఇటీవల మధ్యయూరప్‌ పర్యటనకు వెళ్లొచ్చాక తనకు కరోనా వైరస్‌ సోకిన లక్షణాలు కనిపిస్తున్నాయని ఆమె పేర్కొంది.

ఆమెకు వైరస్‌ పాజిటివ్‌ రాలేదుగానీ.. ముందు జాగ్రత్త చర్యగా ఆమె, ఆమె తండ్రి ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక.. బ్రెజిల్‌లో కరోనా బాధితుల సంఖ్య 2,274కు, మృతుల సంఖ్య 47కు చేరింది. దీంతో అక్కడి స్థానిక ప్రభుత్వాలు ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌ ప్రకటించాయి. కానీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో మాత్రం.. కరోనాను తేలిగ్గా తీసిపారేస్తున్నారు. ఈ వైర్‌సను మీడియా ట్రిక్‌గా రెండు రోజుల క్రితం అభివర్షించిన బొల్సొనారో.. బ్రెజిల్‌లో లాక్‌డౌన్‌ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని అన్ని రాష్ట్రాల గవర్నర్లు, నగరాల మేయర్లకు సూచించారు. కరోనా భయానికి కారణం మీడియానే అని..  ప్రజల్లో భయాందోళనలను పెంచడానికి మీడియా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బ్రెజిల్‌లో యువత సంఖ్య ఎక్కువగా ఉండడం, వేడి వాతావరణం ఉన్నందువల్ల ఇటలీలాంటి పరిస్థితులు నెలకొనవని.. కాబట్టి లాక్‌డౌన్లు ఎత్తేసి జనజీవనాన్ని సాధారణానికి తేవాలని, ప్రజలందరూ తమ పని తాము చేసుకోవాలని సూచించారు. తనకు వైరస్‌ సోకినా పెద్దగా ఆందోళన చెందనన్నారు.

భారీగా మరణాలు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 20,545కు చేరింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 181 దేశాల్లో 4,54,824కి చేరింది. ఇటలీలో అత్యధికంగా 74,386 మందికి సోకగా.. 7,503 మంది మరణించారు.  బుధవారం ఒక్కరోజే 683 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో కూడా మృతుల సంఖ్య చైనాను దాటి నమోదు కావడం విషాదం. అక్కడ 47,610 మంది వైరస్‌ బారిన పడగా.. 3,434 మంది మృతి చెందారు. ఇరాన్‌లో 27,017 కేసులు నమోదు కాగా.. 2.077 మంది మృతి చెందారు. ఫ్రాన్స్‌లో 22,302 కేసులు నమోదు కాగా.. 1100 మంది మృతి చెందారు. అమెరికాలో 61,081 మందికి వైరస్‌  సోకగా.. 841 మంది మరణించారు.

దక్షిణాఫ్రికాలో వైరస్‌ పాజిటివ్‌ వచ్చినవారి సంఖ్య ఒక్కరోజులో 28 శాతం మేర పెరిగి 554 నుంచి 709కి చేరింది. నేపాల్‌లో మూడో కరోనా కేసు నమోదు కగా.. పాకిస్థాన్‌లో కేసుల సంఖ్య 1037కు, మృతుల సంఖ్య ఏడుకు చేరింది.బంగ్లాదేశ్‌లో కరోనా మృతుల సంఖ్య 5కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఇక, ఈ వైర్‌సకు కేంద్రస్థానమైన వూహాన్‌లో వ్యాక్సిన్‌ ప్రయోగాలకు 108 మంది కావాలంటూ ప్రకటన ఇవ్వగా.. తాము సిద్ధమంటూ 5000 మంది ముందుకొచ్చారు.

కదిలిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌక
దాదాపు రెండు నెలలుగా జపాన్‌లోని యొకహామా తీరంలో నిలిచిపోయిన నౌక.. తొలి దశలో చైనా తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదైన నౌక.. డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌక ఎట్టకేలకు కదిలింది. కానీ, ఆ నౌక ఎక్కడికి వెళ్లేదీ, అందులో ఎంత మంది సిబ్బంది ఉన్నారనే విషయాలను అధికారులు తెలపలేదు. మరోవైపు.. ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో 3 నౌకల్లో వేలాది మంది చిక్కుకుపోయారు. ఆ ఓడల్లోని వారిని తమ తీరంలో దిగడానికి ఆస్ట్రేలియా అనుమతించట్లేదు.

సమస్త మానవాళికీ ముప్పు: యూఎన్‌
ప్రపంచంలోని అన్ని దేశాలకూ పాకుతున్న కరోనా మహమ్మారి మానవాళి మొత్తానికీ ముప్పుగా మారిందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మానవులంతా కలిసి దానిపై పోరాడాలని పిలుపునిచ్చింది. ఏ దేశానికి ఆ దేశం దానిపై విడివిడిగా చేసే పోరాటం కన్నా.. ప్రపంచదేశాలన్నీ కలిసి తీసుకునే చర్యలు, సహానుభూతి ఈ పోరులో కీలకమని సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుట్టెరెస్‌ అన్నారు.

ప్రజలారా బయటికెళ్లండి: స్వీడన్‌
కరోనా భయంతో ఒకవైపు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్లు విధిస్తుండగా.. స్వీడన్‌ మాత్రం కరోనాపై  విచిత్రమైన వైఖరి అవలంబిస్తోంది. ప్రాథమిక పాఠశాలలను, రెస్టారెంట్లు, బార్లను తెరిచే ఉంచుతోంది. అంతేకాదు.. తాజా గాలి కోసం ప్రజలంతా బయటకు వెళ్లాలని సూచిస్తోంది. స్వీడన్‌లో ప్రస్తుతం 2,526 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 44 మంది మరణించారు. అయినా.. ప్రభుత్వ వైఖరితో అక్కడి ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నారు. వారాంతాల్లో బార్లు, పబ్బులు కిటకిటలాడుతున్నాయి.

Courtesy Andhrajyothi

Leave a Reply