కరోనా కల్లోలంలో పాఠశాలలా..?

0
40

-ట్రంప్‌ ఒత్తిళ్లపై పెరుగుతోన్న వ్యతిరేకత

వాషింగ్టన్‌ : ఒకవైపు అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో రెచ్చిపోతున్నా ప్రజారోగ్య రక్షణ చర్యలు తీసుకోని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారశైలిపై వ్యతిరేకత తీవ్రమౌతోంది. దేశంలో భారీస్థాయిలో కరోనా వ్యాప్తి ఉన్నా చిన్నారుల ఆరోగ్యాన్ని ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా పాఠశాలల పున:ప్రారంభంపై ఆయన చేస్తున్న ఒత్తిడిపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు, ప్రజారోగ్య సంస్థలకు చెందిన నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలను ప్రారంభించాల్సిందే అంటున్న ఆయన మొండి వైఖరిని తప్పుపడుతున్నారు. కరోనా నుంచి చిన్నారులను, దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయంలో ఇంకా ఆ మహమ్మారికి ఆహారం అందించేలా ట్రంప్‌ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కాగా, పాఠశాలలను తిరిగి ప్రారంభించాల్సిందేనన్న ట్రంప్‌ ఆదేశాలను పలు జిల్లాల యంత్రాంగాలు తిరస్కరించాయి. భౌతికంగా పాఠశాలలను తెరిచేందుకు ఎంతమాత్రం సుముఖంగా లేమనీ, కొత్త అకడమిక్‌ సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభిస్తామని లాస్‌ఏంజెల్స్‌, శాన్‌డియాగో, అట్లాంటా జిల్లాలు పేర్కొన్నాయి.

సమాజంపై కోవిడ్‌-19 విరుచుకుపడుతు న్నంత వరకూ సురక్షితంగా పాఠశాలను తెరవడం సాధ్యం కాదని విద్యావేత్తలు, ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలలను తెరిచి విద్యార్థులను కరోనాకు బలిచేయవద్దని పేర్కొంటున్నారు. భౌతికంగా పాఠశాలల కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సమయంలో పాఠశాలను ప్రారంభించడం కన్నా దూరవిద్య(ఆన్‌లైన్‌) క్లాసులే ఉత్తమమని దాదాపు 83 శాతం మంది పేర్కొన్నట్లు యునైడెట్‌ టీచర్స్‌ ఆఫ్‌ లాస్‌ ఏంజెల్స్‌(యూటీఎల్‌ఏ) నివేదిక పేర్కొంది. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలని విద్యావేత్తలు, కార్మికులను కోరుతున్న పాలకులు, ఇతర రాజకీయ నేతలు ఈ విషయంలో ఎవరిని బలి చేయాలని అనుకుంటున్నట్టు అని యూటీఎల్‌ఏ ప్రశ్నించింది. ప్రస్తుత అల్లకల్లోల పరిస్థితుల్లో పిల్లలను పాఠశాలలకు పంపండం అంటే అది తీవ్ర ప్రమాదకరమైన అడుగు అని దాదాపు 70 శాతానికి పైగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. పాఠశాలలను తెరవడంలో ఆరోగ్య నిపుణుల ‘ఎప్పుడు’ అనే సూచన, విద్యావేత్తలు, తల్లిదండ్రుల ‘ఎలా’ అనే భావనకు కీలక ప్రాథాన్యం ఉంటుందని పలు ఉపాధ్యాయ సంఘాలు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.

అమెరికాలో ఇప్పటి వరకూ 35 లక్షల మంది కిపైగా కరోనా బారిన పడగా, దాదాపు లక్ష 50 వేల మంది మరణించారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో, దేశ పౌరులకు ఆరోగ్య రక్షణ కల్పించడంతో ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు ట్రంప్‌పై ఉన్నాయి. ఈ సమయంలో ఈఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ట్రంప్‌ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ పేరుతో నాటకాలు అడుతున్నారనీ, అందుకోసం అర్ధంపర్ధం లేని ఒతిళ్లు తీసుకువస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply