మన దేశంలో కోవిడ్‌ మందగమనం

0
249

మార్చి 14కు తొలి వంద కేసులు
15 రోజుల్లో పెరిగింది పది రెట్లే!
స్పెయిన్‌లో 100 రెట్లు, ఇటలీలో 90 రెట్లు
మనకు కాస్త ముప్పు తక్కువన్న శాస్త్రవేత్తలు
మనది ఉష్ణ దేశం కావడమే కారణమా?
కావచ్చంటున్న వైద్య నిపుణులు
భారత్‌లో వైర్‌సతో ప్రమాదం తక్కువేనట!
లాక్‌డౌన్‌ పాటిస్తే పూర్తిగా బయటపడతాం

కరోనా వైరస్‌తో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ వంటి దేశాలు మరీ విలవిలలాడిపోతున్నాయి. అయితే విచిత్రంగా భారత్‌లో మాత్రం కరోనా వ్యాప్తి అంత వేగంగా లేదు. మన దేశంలో మార్చి 14 నాటికి తొలి వంద కోవిడ్‌ 19 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 15 రోజుల్లో… మార్చి 29 నాటికి కేసుల సంఖ్య సుమారు వెయ్యికి చేరింది. అంటే 15 రోజుల్లో బాధితుల సంఖ్య పది రెట్లు అయ్యింది. కానీ ఇతర బాధిత దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా వ్యాప్తి చాలా నెమ్మదిగానే ఉంది. ఎందుకంటే తొలి వంద కేసుల నమోదైన తేదీ నుంచి 15 రోజుల తర్వాత బాధితుల సంఖ్య స్పెయిన్‌లో 100 రెట్లు, ఇటలీలో 91 రెట్లు, ఇరాన్‌లో 90 రెట్లు, ఫ్రాన్స్‌లో 67 రెట్లు, అమెరికాలో 63 రెట్లు అయ్యింది. భారత్‌లో వ్యాధి వ్యాప్తి మందకొడిగా ఎందుకు ఉంది అనేదానిపై భిన్న వాదాలు వినిపిస్తున్నాయి. భారత్‌లో కరోనా పరీక్షలు సరిగా జరగడం లేదని, అందువల్ల బాధితుల సంఖ్య పూర్తిగా బయటపడడం లేదని కొందరు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో ఒక వ్యక్తి కరోనాతో చనిపోయిన తర్వాతే అతడికి వ్యాధి ఉన్నట్లు తేలడాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. అయితే అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వేలాది మంది కరోనా పరీక్షల కోసం బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే అక్కడా పరీక్షలు వేగంగా జరగడం లేదు. కానీ బాధితుల సంఖ్య మనకంటే చాలా ఎక్కువగా కనిపిస్తోంది. భారత్‌లో ఒకవేళ కరోనా చాపకింద నీరులా వ్యాపించి ఉంటే ఏదో ఒక దశలో పెద్దసంఖ్యలో వ్యాధిగ్రస్థులు బయటపడాలి. కానీ ఇంతవరకూ అలాంటిదేమీ జరగలేదు కాబట్టి ప్రస్తుతానికి భారత్‌లో కరోనా వ్యాప్తి నెమ్మదిగానే ఉందని భావించవచ్చు. వేడి ఎక్కువగా ఉండడమే వ్యాధి వ్యాప్తి నెమ్మదించడానికి కారణమని కొందరు శాస్త్రవేత్తలు, వైద్యులు విశ్లేషిస్తున్నారు. కరోనా ప్రధానంగా తుంపర్ల ద్వారా వ్యాపించే వ్యాధి. అంటే వ్యాధిగ్రస్థుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు ఇతరుల శరీరంలోకి నేరుగా ప్రవేశించవచ్చు. లేదా టేబుల్స్‌, కుర్చీలు, ప్లేట్లు, గ్లాసుల వంటి వాటిపై పడి… ఇతరులు వాటిని తాకి ఆ చేతితో ముక్కు దగ్గరో, నోటి దగ్గరో పెట్టుకుంటే అలా కూడా వ్యాపించవచ్చు.

అయితే ఈ రెండో రకంగా వ్యాపించే అవకాశం భారత్‌లో తక్కువని కొందరి విశ్లేషణ. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్‌ మనుగడ సాగించలేదని, అందువల్ల ఉపరితలాలపై ఉన్న వైరస్‌ భారత్‌లో త్వరగా నిర్వీర్యమైపోతోందని వారు చెబుతున్నారు. ‘‘32 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఈ వైరస్‌ మన జాలదు. అంటే బహిరంగ ప్రదేశాల్లో ఉపరితలాల ద్వారా వైరస్‌ మరొకరికి సోకే అవకాశం చాలా తక్కువ. కానీ ఇంటి లోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ మేరకు ప్రమాదం ఉంటుంది’’ అని ప్రముఖ గాస్ట్రో ఎంటరాలజిస్టు నాగేశ్వరరెడ్డి చెప్పారు. ఇంట్లో ఏసీ వాడకపోవడం ద్వారా వ్యాధి వ్యాప్తిని కొంతవరకూ అరికట్టవచ్చని దీనిని బట్టి స్పష్టమవుతోంది. ఇరాన్‌లో ఏసీలు ఎక్కువగా వాడడమే అక్కడ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉండడానికి ఒక కారణమనే అభిప్రాయమూ శాస్త్రవేత్తల్లో వినిపిస్తోంది. డీ విటమిన్‌ లోపం ఉన్నవారికే కరోనా వల్ల ప్రమాదం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల కూడా ఉష్ణ మండల దేశాలకు… ప్రత్యేకించి ఎండలో పనిచేసేవారికి ప్రమాదం కొంత తక్కువగా ఉండవచ్చనే భరోసా కలుగుతోంది. ఉష్ణోగ్రత ఎక్కువ ఉండే దేశాల్లో కరోనా ముప్పు తక్కువగా ఉన్నట్లు ఇటీవల మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) జరిపిన అధ్యయనంలోనూ వెల్లడైంది.

భారత్‌లో వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉండడానికి మరో కారణం… మన దేశంలోకి ప్రవేశించిన వైరస్‌ భిన్నమైనది కావడమేనని కూడా నిపుణులు చెబుతున్నారు. ‘‘ఇటలీ, స్పెయిన్‌లలో వ్యాపిస్తున్న వైరస్‌ తీవ్రమైనది. మన దేశంలో ఉత్పరివర్తనం చెందిన వైరస్‌ వాటికంటే బలహీనమైనది. ఈ వైరస్‌ మన శరీరంలో నిలబడడానికి ఉపయోగపడే కొమ్ములు (స్పైక్స్‌) అంత బలంగా లేవు. అందువల్ల కూడా ప్రభావం తక్కువగా ఉంది’’ అని నాగేశ్వరరెడ్డి విశ్లేషించారు. భారత్‌లో ప్రతి అయిదు రోజులకు బాధితుల సంఖ్య రెట్టింపు కావచ్చనే అంచనాలు తొలుత వెలువడ్డాయని, కానీ అలా జరగడం లేదని, భయపడాల్సిందేమీ లేదన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల ద్వారా ఈ వ్యాధికి ప్రభావవంతమైన మందులు మరో రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి రావచ్చు. అయితే ఈలోగా వైరస్‌ వేగంగా విస్తరిస్తే మాత్రం మనం తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. అందువల్ల వచ్చే రెండు వారాలు మనకు చాలా కీలక సమయం కాబోతోంది. ఈ సమయంలో లాక్‌డౌన్‌ పాటించకుండా ఎక్కువమంది ప్రజలు గుమిగూడడం మంచిది కాదని, ఉష్ణ దేశం అయినప్పటికీ ఇది వైరస్‌ వ్యాప్తికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో వ్యాధి వ్యాప్తిని బాగా తగ్గించగలిగితే భారత్‌ ఈ గండం నుంచి సురక్షితంగా బయటపడగలుగుతుందని చెబుతున్నారు.

‘‘35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఈ వైరస్ మనజాలదు. అంటే బహిరంగం ప్రదేశాల్లో ఉపరితలాల ద్వారా వైరస్ మరొకరికి సోకే అవకాశం చాలా తక్కువ’’ -ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వరరెడ్డి

Courtesy Andhrajyothy

Leave a Reply