కులవివక్ష మహమ్మారి మాటేమిటి?

0
275

లాక్‌డౌన్‌ విధించిన మొట్టమొదటి రోజున (మార్చి 25) పారిశుధ్య కార్మికుడు సురేష్‌ ఢిల్లీ లోని ఓ మురుగునీటి శుద్ధి కేంద్రం దగ్గర మృతి చెందాడు. అతనితో పాటు పని చేసే జస్బీర్‌ సైతం ప్రమాదకర పరిస్థితుల్లో ఆస్పత్రి పాలయ్యాడు. పారిశుధ్య పని చేయడానికి అత్యవసరమని ప్రపంచం అంతా భావించే పరికరాలేవీ లేకుండానే, అత్యంత అపాయకర పరిస్థితులో వీరిరువురూ విధులు నిర్వహించారు. కోవిడ్‌-19 మహమ్మారిపై ముందు వరుసలో నిలబడి పోరాడిన యోధులుగా పారిశుధ్య కార్మికులు గుర్తింపు పొందారు. అయినప్పటికీ వారి జీవన పరిస్థితుల్లోగాని, సామాజిక హోదాలోగాని ఎటువంటి మార్పూ వుండదు. కారణం వారి కులమే. ఇప్పుడు కూడా కరోనా వైరస్‌ మూలంగా విధి నిర్వహణ లోనే తమ ప్రాణాలను కోల్పోతున్నారు.

ఏప్రిల్‌ 6వ తేదీన పారిశుధ్య కార్మికుడు ఆత్మారామ్‌ ఛత్రపాల్‌ ఉత్తరప్రదేశ్‌ లోని సీతాపూర్‌ దగ్గర ఫాగింగ్‌ చేస్తూ (పొగ వదులుతూ) సొమ్మసిల్లి పడిపోయాడు. రాష్ట్ర రాజధాని లక్నోకి 90 కి.మీ దూరంలో వుంటుందా ప్రాంతం. ఆ మరునాడే అతను మరణించాడు. గ్రామ సర్పంచిగాని, పంచాయతీ కార్యదర్శిగాని అతనికి చేతి తొడుగులు, ముఖానికి మాస్క్‌ ఇవ్వలేదని అతని భార్య పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వీరికి భద్రతా పరికరాలు ఇవ్వరని, ఒకవేళ ఇచ్చినా అరకొరగానే అందుతాయన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ ఆ వాస్తవాన్ని మరోసారి వెల్లడించేందుకు ఈ కేసు ఉపకరిస్తుంది.

కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన మహిళా పారిశుధ్య కార్మికురాలు ఏప్రిల్‌ 24వ తేదీన తూర్పు ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలో మరణించింది. విధి నిర్వహణకు గాను ఆమెకు కేవలం ఒక మాస్క్‌ మాత్రమే ఇచ్చారని, చేతి తొడుగులు లేవని ఆమె భర్త చెప్తున్నాడు. ఆమెతోపాటు పని చేసే మహిళకు సైతం కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు కూడా చేతి తొడుగులు లేవు.

మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌లో 76 మంది కరోనా రోగులు మరణించగా, వారి అంత్యక్రియల్లో పాల్గొనడానికి బంధువులు నిరాకరించారు. దాంతో మృతదేహాలను శ్మశాన వాటికలకు మోయడానికి, దహనం చేయడానికి పారిశుధ్య కార్మికులనే వినియోగించారు. తమకు అవసరం వచ్చినప్పుడు మాత్రం అంటరానివారు తాకినా ఏం కాదు!

పారిశుధ్య కార్మికులకు కనీస రక్షణ పరికరాలను అందించడంలో కన్పిస్తున్న నిర్లక్ష్యం కోవిడ్‌ మహమ్మారికి సంబంధించిన ఒకానొక అంశం కావొచ్చు. అయితే కులవివక్షత మన దేశంలో గత కొన్ని శతాబ్దాలుగా తిష్టవేసుకు కూర్చున్న సమస్య. దేశవ్యాప్తంగా ఉపద్రవం సృష్టిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు గొప్ప ఐక్యత, సంఘీభావం అవసరమైన సమయంలో, అవేవీ కనిపించకపోగా కుల దురహం కారపూరిత కిరాతక చర్యలు, నేరాలు పెరిగిపోవడం చూస్తున్నాం.

లాక్‌డౌన్‌ విధించిన రెండు రోజులకు అంటే మార్చి 27న తమిళనాడులో అత్యంత వెనుకబడ్డ కులానికి చెందిన సుధాకర్‌ తిరువన్నమలై ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. అతను అగ్రకులానికి చెందిన అమ్మాయిని పెళ్లాడడమే ఇందుకు కారణం. ఏప్రిల్‌ 2వ తేదీన ఉత్తర ప్రదేశ్‌ లోని లఖింపూర్‌కి చెందిన దళిత యువకుడు రోషన్‌ లాల్‌… పోలీసు కస్టడీలో దెబ్బలకు తాళలేక మరణించాడు. అదే రోజున హర్డోరు జిల్లాలో జరిగిన మరొక ఘటనలో అభిషేక్‌ను సజీవ దహనం చేశారు. ఆరేళ్ల కిందట అగ్రకుల యువతిని పెళ్లాడాడన్న కారణంగా అమ్మాయి కుటుంబీకులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఈ దుర్వార్త విని తట్టుకోలేని అతని తల్లి గుండె పగిలి మరణించింది.

పంజాబ్‌ లోని జలంధర్‌లో ఏప్రిల్‌ 5వ తేదీన దళిత మహిళ హత్యాచారానికి గురయ్యింది. ఆ మరుసటి రోజున ఏప్రిల్‌ 6వ తేదీన ఉత్తరప్రదేశ్‌ లోని హమీర్‌పూర్‌లో ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం, ఆపైన హత్య జరిగింది.

ఏప్రిల్‌ 16వ తేదీన ఉత్తర ప్రదేశ్‌ లోని రామ్‌పూర్‌ జిల్లాలో అత్యంత భయానక ఘటన చోటుచేసుకుంది. ఆరోజున పారిశుధ్య కార్మికుడు కున్వర్‌ పాల్‌… విధి నిర్వహణలో భాగంగా గ్రామంలో క్రిమి సంహారక రసాయనాన్ని చల్లుతుండగా పొరపాటున కొద్దిగా అగ్రకులస్తుడి కాలి మీద పడింది. దాంతో, అప్పటివరకు మందు చల్లడానికి ఉపయోగించిన పైపును అతని నోట్లో కుక్కి బలవంతంగా క్రిమిసంహారక మందు తాగించారు. ఆస్పత్రిలో చేరిన మూడు రోజులకు అతను ప్రాణాలు విడిచాడు. ఇంతజరిగినా, ‘సరైన సాక్ష్యం’ లభిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.

ఎఐఐఎంఎస్‌ లో తోటి వైద్యుల వేధింపులు తట్టుకోలేని ఓ మహిళా డాక్టర్‌ ఏప్రిల్‌ 17వ తేదీన ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఎలాగో ఆ గండం నుంచి బైటపడిందనుకోండి. ‘నువ్వు ఎస్‌.సి కులస్తురాలివి. నీ స్థాయికి తగ్గట్టు నువ్వు నడుచుకో. నల్ల పిల్లి లాగా నాకు ఎదురు రావద్దు…’ వంటి మాటలతో తనను అవమానపరచిన తోటి వైద్యులపై ఆమె కేసు పెట్టింది. రెండేళ్లగా కులం పేరుతో వేధింపులు ఎదుర్కొన్నానని, ఈ విషయమై ఎప్పుడు ఫిర్యాదు చేసినా వెనక్కు తీసుకోమనేవారన్నది బాధితురాలి ఆరోపణ. చివరికి తన జీవితాన్నే అర్ధంతరంగా ముగించేందుకు ప్రయత్నించింది. కేసు విషయమై దర్యాప్తు చేస్తున్నామని, ఎఐఐఎంఎస్‌ పాలనా మండలి, పోలీసులు చెప్తున్నారు.

ప్రస్తుతం సుప్రీంకోర్టు అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసులలో కూడా నెలల తరబడి విచారణ చేపట్టకుండా ఉన్నది. కాని ఏప్రిల్‌ 22న సుప్రీం కోర్టు రాజ్యాంగధర్మాసనం ఒక తీర్పు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (ఉమ్మడి రాష్ట్రం) 5వ షెడ్యూలు ప్రాంతంలో నివసించే గిరిజనులకు అక్కడి ఉద్యోగాలలో 100 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. ఆ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్రస్తుతమే గాక అవమానకరంగా కూడా ఉన్నాయని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

దళితుల్లో, గిరిజనుల్లో ఆర్థికంగా బలపడిన తరగతులవారు రిజర్వేషన్‌ ప్రయోజనాలు తక్కినవారికి అందనివ్వడంలేదని, అందుచేత రిజర్వేషన్‌ సదుపాయాలు పొందవలసిన కులాల జాబితాను, ఆ కులాల్లో ఏయే తరగతులవారికి అర్హత ఉందో ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సవరించాల్సిన అవసరం ఉందని ఆ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఆదిమకాలపు తరహా జీవన విధానంలో గిరిజనులు ఇప్పటికీ జీవిస్తున్నందున వారు ప్రధాన సమాజ స్రవంతిలో కలిసిపోవడానికి పనికిరారని, వారిని సాధారణ చట్టాల పరిధి లోనే నియంత్రించజాలమని కూడా న్యాయమూర్తులు అన్నారు. ఇవి చాలా అసాధారణమైన వ్యాఖ్యలు. అంతే కాదు, అవి కులవ్యవస్థలో నిబిడీకృతమైవున్న అసమానతలను సమర్ధించడమేగాక, వాటిని మరింత బలపరుస్తున్నాయి.

ఇంతకుమునుపు సుప్రీంకోర్టు దళిత, గిరిజనులపై అత్యాచారాలను నిరోధించడానికి చేసిన చట్టంపై కూడా ఇదేతీరున సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మోడీ ప్రభుత్వం దళిత, గిరిజనులకు ఉపకార వేతనాల మంజూరును కుదించడంలో, ఉన్నత విద్యాసంస్థలలో వారికి అవకాశాలను తగ్గించడంలో, ఉద్యోగాలలో అవకాశాలను నిరాకరించడంలో దూకుడుగా వ్యవహరిస్తూ పలు రంగాలలో రిజర్వేషన్‌ హక్కు అమలును దెబ్బతీస్తోంది.

ఈవిధమైన దాడికి మూలం పాలకపార్టీ సిద్ధాంతంలోనే ఉంది. ప్రస్తుత రాజ్యాంగాన్ని పక్కనబెట్టి దానిస్థానే మను ధర్మశాస్త్రాన్ని అమలుచేయాలని ఆ పార్టీకి చెందిన గత నాయకులు, పలువురు ప్రస్తుత నాయకులు కూడా వివిధ సందర్భాలలో డిమాండ్‌ చేస్తూనే వున్నారు.

భీమా-కోరేగావ్‌ కేసులో ఈ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలనుండీ ఒక కక్షపూనిన తీరున వ్యవహరిస్తున్న వైనం ఈ ధోరణికి అద్దం పడుతుంది. కోరేగావ్‌ వద్ద 200 ఏళ్ల క్రితం బ్రిటిష్‌ సైన్యం పీష్వాను పూర్తిగా ఓడించింది. ఈ బ్రిటిష్‌ సైన్యంలో దళిత కులానికి చెందిన మహర్‌లు (డా|| అంబేద్కర్‌ ఈ కులంలోనే జన్మించారు) పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతీ ఏడూ అక్కడ సంబరాలు జరుపుతూంటారు. అటువంటి ఒక సందర్భంలోనే అంబేద్కర్‌ పాల్గొని మహర్ల పోరాట స్వభావాన్ని శ్లాఘించారు. జనవరి 1, 2018 న ఆ యుద్ధం జరిగి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్దఎత్తున ఉత్సవాలను ప్లాను చేశారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతాలలో ముందుగా సన్నాహక సభలు, ర్యాలీలు జరిపారు. వాటి ముగింపుగా పూనే లోని శనివార్‌పేట వద్ద పెద్ద బహిరంగసభ కూడా జరిపారు. అక్కడే అనూహ్యంగా ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. హఠాత్తుగా సభికులపై పెద్దపెట్టున దాడి జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. అనేక వాహనాలు ధ్వంసం అయాయి.

మిలింద్‌ ఎక్బోటే, శంభూజీ భిడే (ఈయనను మోడీ తన గురువుగా చెప్పుకుంటారు) వంటి సీనియర్‌ బిజెపి నేతలు ముందు నుంచీ ఈ శనివార్‌పేట్‌ సభను వ్యతిరేకిస్తూ వచ్చారు. అది ఇప్పటికీ బ్రాహ్మణాధిపత్యం రాజకీయ, సామాజిక రంగాల్లో కొనసాగుతున్న ప్రాంతం కావడమే ఈ వ్యతిరేకత వెనక అసలు కారణం. భీమా-కోరేగావ్‌ లో జరిగిన హింసాకాండ వెనుక ప్రధాన పాత్రధారులు వీరేనని తొలుత నిర్ధారించారు. వారిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు కూడా. ఐతే మోడీ రాజ్యంలో ఇతర సందర్భాలలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా మొత్తం మసిపూసి మారేడుకాయ చేశారు. ఈ నాయకులపై ఉన్న ఆరోపణలు క్రమంగా నీరుగారిపోతూ వచ్చాయి. ఇంకోవైపు పలువురు మానవ హక్కుల ఉద్యమ నేతలపై, దళిత, గిరిజన హక్కుల ఉద్యమ నేతలపై ‘కుట్ర’ ఆరోపణలు ప్రచారం కాసాగాయి. ఆ విధంగా ‘భీమా కోరేగావ్‌ కేసు’ రూపు దిద్దుకుంది. భీమా కోరేగావ్‌ లో సభకు హాజరైన వారిపై జరిగిన దాడి కాస్తా మరుగున పడింది. దాని స్థానంలో జాతీయ నాయకుల్ని హత్య చేయడానికి కుట్ర జరిగినట్టు, ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించినట్టు కొత్త ‘ఆరోపణ’ ముందుకొచ్చింది.

2018-19 లో పలువురు హక్కుల ఉద్యమనేతలను అరెస్టు చేశారు. నిజానికి వీరిలో చాలామందికి భీమాకోరేగావ్‌ సభతో గాని, దాని నిర్వాహకులతోగాని ఎటువంటి సంబంధమూ లేదు. వారిలో, గౌతమ్‌ నవలఖ, డా|| ఆనంద్‌ తెల్తుంబ్డే (వీరు ప్రఖ్యాత మేథావులు, దళిత, వర్గ సమస్యలపై అధ్యయనం చేసినవారు. కాని వీరిద్దరూ ఆ సభలో పాల్గొనలేదు.) ఈ ఏడు ఏప్రిల్‌ నెల వరకూ బెయిల్‌ పొందగలిగారు. ప్రభుత్వం మాత్రం ఎలాగైనా వారిద్దరినీ నిర్బంధించి తీరాలనే పట్టుదలతో తన ప్రయత్నాన్ని కొనసాగించింది. మొత్తానికి వారిద్దరినీ ఏప్రిల్‌ 14న అరెస్టు చేశారు. అది డా|| అంబేద్కర్‌ జన్మదినం. డా|| ఆనంద్‌ తెల్తుంబ్డే అంబేద్కర్‌ కుమార్తె పుత్రుడు. ఈ విధంగా జరగడం యాదృచ్ఛికం ఎంతమాత్రమూ కాదు. మహర్ల పోరాట పటిమ చరిత్రను ఏ విధంగానైనా చరిత్ర పుటల్లోంచి చెరిపివేయాలన్నదే పాలకుల ప్రయత్నం. అందుకే వారు సంబరాలు జరుపుకునే రోజును, సామాజిక న్యాయం కోసం వారు దీక్ష పూనే సందర్భాన్ని అహంకారపూరితమైన విద్వేషంతో మసిపూయాలని ప్రయత్నిస్తున్నారు. బాబ్రీ మసీదును కూలదోయడానికి డిసెంబరు 6వ తేదీని ఎంచుకున్నారు. అదేమీ యాదృచ్ఛికం కాదు. ఆ రోజు అంబేద్కర్‌ వర్థంతి.

ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కరోనా వైరస్‌ ప్రమాదాన్ని వైద్య విజ్ఞానంతో, పరిశోధనలతో ఏదో ఒక రోజున నిర్మూలించగలుగుతాం. కాని శతాబ్దాల తరబడి కొనసాగుతున్న కులవివక్షత మాటేమిటి? దానిని తొలగించే వైపుగా కాకుండా పెంచే వైపుగా అడుగులు వేస్తున్న ప్రస్తుత పాలక పార్టీ ఎంత కర్కశంగా వ్యవహరిస్తోందో చూస్తే…ఈ దేశంలో సమానత్వానికి, ప్రజాస్వామ్యానికి ఎంత ముప్పు వాటిల్లుతోందో స్పష్టమౌతుంది.

సుభాషిణీ అలీ
(వ్యాసకర్త సిపిఐ(ఎం) మాజీ ఎంపి)

Courtesy Prajasakti

Leave a Reply