రేకా చంద్ర శేఖర రావు.
ఉసా – ఉప్పుమావులూరి సాంబశివరావు గారి అమరత్వ సందర్భం , ఇటీవల కాలంలోనే కాదు, నాకు తెలిసి ఏ అమరుడి సంస్మరణ సందర్భంలో కూడా ఉసా గురించి జరిగినన్ని వాదోపవాదాలు ఎవరి సంస్మరణలో కూడా జరగలేదని చెప్పవచ్చును. ఆ వివాదాలు నెల రోజులు పైగా కొనసాగాయి. దీనిని బట్టే మన తెలుగు సమాజంలో ఉసా స్తానం విడదీయరానిదని స్పష్టంగా అర్ధం అయింది. అయితే విచారించ వలసిన విషయం ఏమంటే ఉసా చివరి వరకు నమ్మిన సిద్ధాంతాలు ; కులం పునాది అంశం, కుల నిర్మూలన, కులాంతర వివాహాలు, వర్గం-కులం వాటి జమిలి పోరాటాల ఆవశ్యకత, మార్క్స్ తో పాటు మన దేశానికి అంబేద్కర్ ప్రాముఖ్యత, లాల్- నీల్ శక్తుల మైత్రీ ఆవశ్యకత తదితర విషయాలపై చర్చలు జరిగితే బావుండేది. అలాటివి ఏమీ జరగకుండా వేరే అవసరం లేని వివాదాలు సంచలన తరహా వివాదాల చర్చల చుట్టూ కాలం గడిచింది. ఈ కాలంలో ప్రగతిశీల శక్తులము అని , వారి మేధావులము అని చెప్పుకున్న వారి “డొల్లతనం “ పూర్తిగా బట్టబయలు అయింది. ఈ సందర్భంగా ఉసా గురించి ప్రశాంతంగా అవలోకనం చేసుకోవాలి.
ఉసా ఉద్యమ గమన సూక్ష్మ అవలోకనం:
ఉసా గురించిన చర్చలకు ఆయన జీవిత గమనం చాలా అవసరమై యున్నది. ఉ సా గుంటూరు జిల్లా నిడుబ్రోలుకు దగ్గరలోని బ్రాహ్మణ కోడూరులో మంగలి కుటుంబంలో జన్మించారు. వైద్య వృత్తి ( RMP) ప్రధానంగా కలిగిన కుటుంబం అది. తమ కుటుంబంలో చాలా తెలివి తేటలు గలిగిన చిన్న వాడు అయిన ఉసా ని డాక్టరుగా చేయాలని ఉసా అన్నలకు తీవ్ర అపేక్ష వుండేది.
1969 లో పియుసి మరియు 1970 -1973 లలో బియస్సీ తెనాలి వియస్ ఆర్ కాలేజి లో ఉసా చదివారు. ( నేను కూడా అదే కాలేజిలో 1969-72 లో బి.కామ్ చదివాను) మొదట నాస్తిక భావాలు , 1973 నుండి మార్క్స్ వాద భావజాలంతో ప్రయాణం . డాక్టర్ కావాలన్న వారి కుటుంబ సభ్యుల కోరిక నెరవేర లేదు , సమాజానికి చికిత్స చేసే సామాజిక వైద్యుడుగా ఉసా మారాడు.
1974 లో తెనాలిలో అరుణోదయ సాహితీ సాంస్కృతిక సంస్త కన్వీనర్ గా ప్రయాణం ప్రారంభం. ఎమర్జన్సీలో తరిమెల నాగిరెడ్డిగారి విప్లవ కమ్యూనిష్టు పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా పనిచేసేందుకు నిర్ణయించుకుని అజ్నాత జీవితం, 1976 లో అరెస్టులు, జైలు జీవితం గడిపాడు. 1978 లో గుంటూరులో జనశక్తి పత్రిక పని. ఆ సంవత్సరమే ఏర్పడిన జనసాహితీలో ముఖ్య పాత్ర. మోతడక ప్రాంతంలో అప్పులు మేము తీర్చలేం పాటలతో ఆందోళన. 1981 లో మంగళగిరి చరిత్రలోనే పెద్ద చేనేత ఉద్యమం , ఆ సందర్భంగా ఉసా పార్టీ బాధ్యుడు. 1982 లో కొద్ది నెలలు కొండమొదలు వుద్యమంలో పాల్గొన్నారు, ముఖ్య పాత్ర నిర్వహించారు. 1983 నుండి నల్గొండ జిల్లాలో పార్టీ బాధ్యుడిగా పనిచేశారు. 1984 లో లో ఓల్టేజి సమస్య పైన పెద్ద ఎత్తున ప్రజలను కదలించి వుద్యమాన్ని నిర్మించారు. 1986 తర్వాత విప్లవ కమ్యూనిష్టు పార్టీ నుండి దూరమై తన సొంత అన్వేషణలో సుదీర్ఘ ప్రయాణం చేశారు. కారంచేడు దళిత పోరాట స్ఫూర్తి అనేక కమ్యూనిష్టు విప్లవకారులను ప్రభావితం చేసింది, ఆ ప్రభావానికి ఉ సా కూడా గురయ్యారు.
సత్యమూర్తి గారితో కలసి ప్రయాణం ఎదురీత, ఏకలవ్య పత్రికల నిర్వహణ.
1991 లో చుండూరు దళితులపై జరిగిన మారణకాండ ఉ సా ఆలోచనలకు పదునెక్కించింది. 1994 లో BSP లో చేరడం గురించి సత్యమూర్తి గారితో విభేదించి విడిపోవడం, మారోజు వీరన్నతో కలసి ప్రయాణం, తర్వాత బహుజన వుద్యమ కారుడిగా అనేక రకాల ప్రయత్నాలు నిరంతరం కొనసాగించారు. మరణించే నాటికి అనేక సంస్తలకు సలహాదారుగా, గౌరవాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా , OPDR అధ్యక్షుడిగా , ఫాసిస్ట్ వ్యతిరేక వేదిక అధ్యక్షుడిగా తదితర బాధ్యతలు నిర్వహించారు.
బహుముఖ ప్రజ్నాశాలి ఉ సా:
ఉసా బహుముఖ ప్రజ్నాశాలి. కవి, గాయకుడు, రచయిత , ఉపన్యాసకుడు , ఆందోళన కారుడు, వుద్యమ కారుడు, కళాకారుడు, చిత్ర కారుడు, ప్రింటును బోలిన వ్రాతగాడు, పెయింటర్ , ఎప్పుడూ చెదరని చిరునవ్వు , అందగాడు, నిబద్దత , కష్టపడి పనిచేయడం , శ్రమ సంస్కృతి తన జీవన శైలిలో భాగం కావడం తదితర మంచి లక్షణాలు అన్నీ అమరిన వాడు “ Multi talented person ఉ సా. “ ఈ లక్షణాలన్నీ తనకు అసంఖ్యాకమైన మితృలను సంపాదించి పెట్టింది. ఉసా తనకు సహజంగా వున్న మంచి లక్షణాలను వుద్యమ క్రమంలో వుద్యమాల ద్వారా అభివృద్ది చేసుకున్నాడు.
ఆయన రాసిన పాటలు:
1.జోలాలి పాడాలి!
2 మేం పాడుతాం జనం పాట పాడుతాం!
- మేమెందుకిలా మారామో తెలుసా!
- కవీ! ఓ కళాకారుడా!
- అప్పులు మేం తీర్చలేం !
- అమరుడవో నాగిరెడ్డి లాల్ సలామ్!
- రాజులన్నా! లచ్చుమన్నా!
తదితర పాటలు నినాదాలుగా, వుద్యమ గీతాలుగా మారాయి. ఉసా అనర్ఘళంగా గంటల కొలది మాట్లాడ గల్గిన ఉపన్యాసకుడు. వినేవారి స్తాయి , వారి మానసిక స్తితిని పసికట్టి మాట్లాడడంలో తరిమెల నాగిరెడ్డి గారి నుండి స్ఫూర్తి పొంది , తనదైన శైలిలో అద్భుతంగా మాట్లాడే వాడు ఉసా. అలాగే ఎక్కడ సమస్యలు వున్నా స్పందించడం అనేది ఉసా లోని ప్రత్యేకత, తన జీవితాంతం ఆ రకంగానే స్పందించారు. ఉ సా ప్రాసంగికత: మార్క్స్ వాదంని పట్టిన చేతిని వదలకుండా ఉసా అంబేద్కర్ వాదాన్ని కూడా రెండో చేతితో పట్టుకున్నాడు.
కలగూర సిద్ధాంతం:
కొంతమంది పైరెండు వాదాలు – మార్క్స్ వాదం , అంబేద్కర్ వాదం గురించి చెప్పడం అంటే , ఆ రెండు వాదాలు కలసి పనిచేయడం అంటే కలగూర సిద్ధాంతం అవుతుంది అని రెండు వైపుల మేధావులు కొందరు అంటున్నారు. అలా అనేవారు ఒక విషయం మరిచారు. కారల్ మార్క్స్ కూడా హెగెల్ నుండి గతితర్కాన్ని, డార్విన్ పరిణామ వాదం నుండి సమాజ పరిణామాన్ని, రికార్డో తదితరుల నుండి అర్ధ శాస్త్రాన్ని , రాబర్ట్ ఓవెన్ , సైమన్ ల నుండి సోషలిజాన్ని స్వీకరించి , వాటికి “వర్గపోరాట సిద్దాంతాన్ని జోడించి “ నూతన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని రూపొందించారు.
తత్వవేత్తలు ప్రపంచాన్ని వ్యాఖ్యానించారని, అసలు తత్వ శాస్త్ర లక్ష్యం ప్రపంచాన్ని మార్చడం అని ఆయన చెప్పారు . అనేక రకాల సిద్ధాంతాల నుండి మార్క్సిజాన్ని రూపొందించాను అని మార్క్స్ మహనీయుడే చెప్పుకుంటే ఆనాడుగానీ , ఈనాడు గానీ “మార్క్సిజం కలగూర సిద్ధాంతం “ అని కొందరు మాట్లాడుతూనే వున్నారు. అలాగే అంబేద్కర్ భారత రాజ్యాంగ రచన కోసం ప్రపంచంలోని అనేక ప్రముఖ రాజ్యాంగాలను చదివానని, ప్రాచీన బౌద్ద సాహిత్యం చదివాను అని వాటన్నిటిలోని మంచిని స్వీకరించాను అని చెప్పివున్నారు. అలా ఆయనే వినమ్రంగా చెప్పుకుంటే , మరి కొందరయితే భారత రాజ్యాంగ రచన కలగూర సిద్ధాంతం లేక అతుకుల బొంత సిద్ధాంతం వంటిది అని అపహాస్యం చేస్తున్నారు, ఇంకా కొందరయితే MN రాయ్ రాసిన వాటిలోని రాజ్యాంగం గురించి రాసిన రచనా భాగం యెక్క అనుసరణ అంబేద్కర్ రాజ్యాంగ రచన
అని చెబుతున్నారు. అసలు అన్నీ అధ్యయనం చేసి మన దేశ పరిస్తితులకు తగినవి అని భావించిన వాటిని అన్నిటినీ చేర్చాను అని అంబేద్కరే చెప్పి వున్నారు.
మనువాద వ్యతిరేక పోరాటానికి ఆమడ దూరంలో వుండే MN ROy ని తీసుకోవలసిన అవసరం అంబేద్కర్ కి లేదు. అందరి పుస్తకాలు చదివిన దాంట్లో భాగంగా MN ROy సాహిత్యం కూడా అంబేద్కర్ చదివి వుండవచ్చును.
అంబేద్కర్ సృజనశీలి, ఆచరణ నుండి , అనుభవాల నుండి సిద్దాంతాలను రూపొందించ గలరు, రాయగలరు . “ He is a creator of theories and policies. “పై వారిద్దరూ – మార్క్స్ , అంబేద్కర్ లు ఇద్దరూ తమ విజ్ఞానం తమ వ్యక్తిగతం కాదని అది మానవ సమాజ విజ్నానంలో అంతర్భాగం మాత్రమే అని చెప్పారు.
కనుక కలగూర సిద్ధాంతం అనే విమర్శలు అర్ధం లేనివి అని , వారిని విమర్శించే వారు గ్రహించాలి. అలాగే ఆ రెండు సిద్ధాంత శక్తుల మైత్రిని వ్యతిరేకించే వారు కూడా గుర్తించాలి! సిద్ధాంతాలను adopt చేసుకోవడం ( కలుపుకోవడం) , వర్తింప చేయడం కూడా సిద్ధాంతం యొక్క అభివృద్దిలో భాగమని గుర్తించాలి. సిద్ధాంతాలను ఆయా దేశ , కాలాలను బట్టి అన్వయించడమే అత్యంత కీలకమని గమనించాలి.
వర్గము- కులము జమిలి పోరాట సిద్దాంత కర్త:
మన దేశానికి కారల్ మార్క్స్ తో పాటు అంబేద్కర్ అవసరమని భూపతి నారాయణ మూర్తి, బొజ్జా తారకం, సత్యమూర్తి, చార్వాక రామకృష్ణ , రాజన్న, మారోజు వీరన్న , ఓంకార్ తదితరులతో పాటు ఉసా కూడా బలంగా అభిప్రాయ పడ్డారు.
వర్గము- కులము లేక కులము- వర్గము జమిలిగా కలసి వున్నాయని వర్గపోరాటాలు, కుల నిర్మూలనా పోరాటాలు జమిలిగా సాగాలని , ఎక్కడ ఏది అవసరమయితే అది సాగాలని కోరుకున్నారు. లాల్- నీల్ శక్తుల బలమైన మైత్రి ద్వారానే నేటి మనువాద , ఫాసిస్టు పాలకులను ఎదుర్కోగలమని భావించారు.
గాంధీ పట్ల , నెహ్రూ పట్ల , రాజ్యాంగం పట్ల మనువాద పాలకులు చేస్తున్న దాడులను ప్రగతిశీల శక్తులు పట్టనట్లుగ వుండకూడదని , వాటిని తిప్పి కొట్టాలని ఉసా నూతనంగా విశ్లేషించి; RSS దాడులను ఎదుర్కునేందుకు బహుముఖంగా ప్రగతిశీల శక్తులను సమీకరించాలని కోరారు, ఫాసిస్ట్ వ్యతిరేక వేదికలు అవసరమని భావించారు, అలాటి వేదికను ఏర్పరిచారు.
మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా సిద్దాంతాలను అన్వయించ గలిగినంతటి శక్తిగలిగిన వాడు ఉసా . ఆయన మరణం ప్రగతిశీల శక్తులకు తీరని లోటు. భావజాల మితృలను ఓపికగా, సంయమనంతో సమీకరించ గలిగిన దిట్ట ఉసా. గాలి వాటంగా ఉద్రేకాలను రెచ్చగొట్టే మేధావులకు భిన్నమైన వాడు ఉసా. ఉసా మరణం మార్క్స్ వాద , అంబేద్కర్ వాద మరియు ఫూలే వాద మైత్రీ శక్తులకు తీరని లోటు.
ఉసా చూపిన మార్గాన్ని శక్తివంతం చేసుకుంటూ లోటు పాటులను సరిచేసుకంటూ పురోగమించడమే నేటి లాల్- నీల్ మైత్రీ శక్తుల కర్తవ్యం. అది కష్టమైన మార్గం అయినప్పటికీ తప్పనిసరి అవసరమైన మార్గం.
జోహార్! ఉసా జోహార్! జోహార్!