యెస్‌ బ్యాంక్‌కు చేయూత

0
291

 ఉద్దీపన పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం
త్వరలో మారిటోరియం ఎత్తివేత
చేతులు కలిపిన ఇతర బ్యాంకులు
రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఆసక్తి 

న్యూఢిల్లీ: యెస్‌ బ్యాంకును పట్లాలెక్కించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇందుకోసం ఆర్‌బీఐ సమర్పించిన ఉద్దీపన (బెయిల్‌ఔట్‌) పథకానికి కేంద్ర కేబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయం చెప్పారు. ఈ ఉద్దీపన పథకం నోటిఫికేషన్‌ వెలువడిన మూడు రోజుల్లో యెస్‌ బ్యాంకు నుంచి డిపాజిట్ల ఉపసంహరణపై ఉన్న మారిటోరియాన్నీ ఎత్తివేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత వారం రోజుల్లో బ్యాంకుకు కొత్త డైరెక్టర్ల బోర్డునీ ఏర్పాటు చేస్తారు.

ఇతర బ్యాంకుల నుంచీ పెట్టుబడులు
యెస్‌ బ్యాంకును గాడిలో పెట్టేందుకు ఎస్‌బీఐతో కలిసి పని చేసేందుకు నాలుగు ప్రముఖ ప్రైవేటు బ్యాం కులూ ముం దుకొచ్చాయి. ఇందులో  భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు చెరో రూ.1,000 కోట్లు యెస్‌ బ్యాంకు ఈక్విటీలో వాటా తీసుకుంటున్నాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు మరో రూ.1,100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాయి. దీంతో బ్యాంకు అధీకృత ఈక్విటీ మూల ధనాన్ని ప్రస్తుత రూ.1,100 కోట్ల నుంచి రూ.6,200 కోట్లకు పెరగనుంది.

బిగ్‌ బుల్‌ ఆసక్తి!
ఈ బ్యాంకులకు తోడు డీమార్ట్‌ ప్రమోటర్‌ రాధాకిషన్‌ దమానీ, బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, అజీమ్‌ ప్రేమ్‌ జీ ట్రస్టులు చెరి రూ.500 కోట్ల చొప్పున యెస్‌ బ్యాంకు ఈక్విటీలో వాటా తీసుకునేందుకు  సిద్ధమైనట్టు సమాచారం. ఇందుకోసం ఆర్‌బీఐ ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలు, వ్యక్తులతో చర్చలు జరుపుతున్నట్టు సీతారామన్‌ చెప్పారు. ఎల్‌ఐసీ కూడా యెస్‌ బ్యాంకు ఈక్విటీలో వాటా తీసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

మూడేళ్లు లాక్‌ ఇన్‌ పీరియడ్‌
యెస్‌ బ్యాంకు ఈక్విటీలో కొత్తగా పెట్టుబడి పెట్టే బ్యాంకులు, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో 75 శాతాన్ని మూడేళ్ల వరకు విక్రయించేందుకు వీల్లేదని ఆర్థిక మంత్రి సీతారామన్‌ చెప్పారు. ఎస్‌బీఐ తీసుకునే 49 శాతం ఈక్విటీలోనూ 26 శాతాన్ని మూడేళ్ల వరకు కదలించేందుకు వీల్లేదు.

మొత్తం రూ.50 వేల కోట్లు
ఆర్థిక పునర్‌ వ్యవస్థీకరణ కింద యెస్‌ బ్యాంకుకు మొత్తం రూ.50,000 కోట్లు అందుబాటులోకి వస్తాయి. ఇందులో రూ.20,000 కోట్లు ఈక్విటీ నిధులు. రూ.30,000 కోట్లను బల్క్‌ డిపాజిట్ల కింద ఇతర బ్యాంకులు సమకూరుస్తాయి. మారటోరియం తొలగించాక డిపాజిటర్ల ఒత్తిడి ఎదురైతే ఎదుర్కొనేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

రాణా కపూర్‌ దంపతులపై మరిన్ని కేసులు
యెస్‌ బ్యాంకు ప్రమోటర్‌ రాణా కపూర్‌, ఆయన బార్య బిందుపై సీబీఐ తాజాగా మరిన్ని కేసులు  నమోదు చేసింది. కపూర్‌ దంపతులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం ధాఫర్‌పైనా కేసులు నమోదయ్యాయి. అమృతా షెర్గిల్‌ బంగళా కొనుగోలు కోసం మంజూరు చేసిన రూ.2,000 కోట్ల రుణం కోసం ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలపై సీబీఐ ఈ కేసులు నమోదు చేసింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ, ముంబైల్లోని వారి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలూ జరిపింది. ఈ కేసులకు సంబంధించి ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్యాలయాల్లోనూ సీబీఐ సోదాలు జరిపింది.

Courtesy Andhrajyothi

Leave a Reply