నదులపై పెత్తనం ఎవరిది?

0
250

మన సంవిధానం ప్రకారం కేంద్రంతోపాటు రాష్ట్రాలకు సమాన సార్వభౌమాధికారాలు ఉండాలని, కేంద్రీకృత పాలనాధికార కేంద్రం, పెద్దరికం ఉండరాదని పాఠాలు చెప్పుకుంటున్నాం. ఆచరణలో ఇది రానురాను అసాధ్యంగా మారుతున్నది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర అధికారాలు రక్షించాలని కోరుకున్నవారు, తరువాత కేంద్రంలో అధికారానికి రాగానే కేంద్రానికే ఎక్కువ అధికారాలుండాలని కోరుకోవడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు భారతీయ సంవిధానంలోని సమాఖ్య లక్షణానికి నదీ శాసనాల నుంచి సవాలు ఎదురవుతున్నది.  కేంద్రం హడావుడిగా శాసనాలు చేస్తూ కూలంకషంగా రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నది.

నదీ పరివాహక ప్రాంత నిర్వహణ బిల్లు 2019 ద్వారా 13 అంతర్రాష్ట్ర నదులకు పరివాహక ప్రాంత అథారిటీలు ఏర్పాటుచేసి, నదుల నీళ్లను శాస్త్రీయంగా ఆదాయ మార్గంగా వాడుకునే సదుద్దేశం ఉన్నట్టు ప్రకటిస్తున్నారు. రెండో బిల్లు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు 2019 ద్వారా వివాద పరిష్కార కమిటీ ఒకటి, ఆ తరువాత శాశ్వతంగా పరిష్కార న్యాయస్థానం ఒకటి ఏర్పాటు చేయదలచుకున్నారు. మూడో బిల్లు ఆనకట్టల భద్రతా బిల్లు 2019. ఈ మూడు బిల్లులు ప్రవేశపెట్టడం జరిగిపోయింది. ఎవరూ అధ్యయనం చేసినట్టు లేదు. బిల్లులను కూలం కషంగా అవగాహన చేసుకుని రాష్ట్రాల హక్కులకు ఏవైనా  సవరణలు ప్రతిపాదించేందుకు ప్రతి రాష్ట్రంలో ఒక విభాగం ఉండాలి. లేకపోతే, ఈ బిల్లులన్నీ శాసనాలుగా మారిన తరువాత సవరించడం సాధ్యం కాకపోవచ్చు. కోర్టుల్లో సవాలు చేసే అవకాశం ఉన్నా ఎన్నేళ్లకు ఏవిధంగా తెములు తాయో తెలియదు కనుక ప్రయోజనం లేదు.

కేంద్ర–రాష్ట్రాల మధ్య అధికారాలను పంచడానికి రాజ్యాంగం ఏడవ షెడ్యూలులో మూడు జాబితాలు రచించింది. నదుల నీటిని రాష్ట్రాల జాబితాలో చేర్చారు. అంతర్రాష్ట్ర నదుల విషయంలో వివాదాలు వచ్చినపుడు మాత్రం కేంద్రం శాసనాలు చేయడానికి వీలుగా దాన్ని కేంద్ర జాబితాలో చేర్చారు. నీటి సరఫరా, సేద్యపు నీరు, సేద్యపు కాలువలు, డ్రైనేజీ, ఆయకట్టు, నీటి నిలువ, జల విద్యుచ్ఛక్తి అంశాలను ఒకటో జాబితాలో చేర్చారు. అంటే అంతర్రాష్ట్ర నదీ జలాలు, నదీ లోయల అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణకు సంబంధించిన ప్రజాప్రయోజనాల కోసం పార్లమెంటు రూపొందించిన చట్టాలకు అనుగుణంగా అధికారాలను నిర్వహించాలి.

ఆర్టికల్‌ 262 ప్రకారం అంతర్రాష్ట్రీయ నదీ జలాల వివాదాలు వినడానికి, ఫిర్యాదులు పరిష్కరించడానికి పార్లమెంటుకు చట్టం చేసే అధికారం ఉంది. ఈ అధికారాన్ని వినియోగించి పార్లమెంట్‌ రివర్‌ బోర్డుల చట్టం 1956, అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఈ రివర్‌ బోర్డులు నదుల సమగ్ర అభివృద్ధి కోసం కావలసిన సలహాలు ఇవ్వవలసి ఉంటుంది. దారుణం ఏమంటే ఇంతవరకు ఈ చట్టం అమలు చేయలేదు. ఇది నిర్జీవపత్రంగా మిగిలిపోయింది. రివర్‌ బోర్డులు లేవు.

నదీ జలాల మీద ఇరు రాష్ట్రాల మధ్యనున్న జగడాలు పరిష్కరించడం సాధ్యమే కావడం లేదు. ట్రిబ్యునల్స్‌ అవార్డు (తీర్పు)లు ఇచ్చినప్పటికీ అవి అమలు కాకపోవడం, దానిపైన సుప్రీంకోర్టుకు రాష్ట్రాలు వెళ్లడం వల్ల వివాదాలు ముదురుతున్నాయే తప్ప పరిష్కారం కావడం లేదు. నదులమీద ఏ శాసనం చేయాలన్నా రాష్ట్రాలతో సమగ్రంగా సంప్రదించాలని జాతీయ రాజ్యాంగ సమీక్షా కమిషన్‌ సిఫార్సు చేసింది. నదులు పారే రాష్ట్రాలకు ఆ నదులను రక్షించే బాధ్యత, నదీజలాలను సక్రమంగా వినియోగించి జాతి సంపద పెంచడానికి ప్రయత్నించే బాధ్యత ఉంటాయి. సమాఖ్య లక్షణాలను, రాష్ట్ర కేంద్ర సంబంధాలను సమీక్షించిన సర్కారియా కమిషన్‌ కూడా ఈ అంశాలనే ప్రస్తావించింది. రాష్ట్రం తనకు మరొక రాష్ట్రంతో వివాదం ఉందని కేంద్రం దృష్టికి తెచ్చిన తరువాత వివాదాన్ని గుర్తించడానికి విపరీత జాప్యం చేయడం, తరువాత ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయకపోవడం, ట్రిబ్యునల్‌ కాలాన్ని విపరీతంగా పెంచుతూ పోవడం, చివరకు అవార్డు వచ్చిన తరువాత కూడా దాని అమలుకు సాయపడకపోవడం సమస్యలుగా మారాయి. ఈ సమస్యల పరిష్కారం పేరుతో తెస్తున్న ఈ మూడు నదీ శాసనాలు ఎంతవరకు ఉపయోగపడతాయి. వీటిని తెచ్చే ముందు రాష్ట్రాలను ఎందుకు సంప్రదించలేదు. రాష్ట్రాల హక్కులను కాపాడుతున్నారా? నదుల మీద పెత్తనం ఎవరిది?


మాడభూషి శ్రీధర్‌
 
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

 

Leave a Reply