పన్నుల కోటాలో కేంద్రం కోత

0
252

రాష్ట్రాల వాటాలో 17.81 శాతం కట్‌
తెలంగాణకు ఈ నెల 212 కోట్ల గండి
వెసులుబాట్లపై ఉలుకూపలుకూ లేదు
ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రాల విలవిల

కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతూ, కేంద్రంవైపు చూస్తున్న రాష్ట్రాలకు పెను నిరాశ ఎదురైంది. ప్రత్యేక సాయం, వెసులుబాట్లు కల్పించే సంగతేమోగానీ, రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన వాటాలోనే కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. బడ్జెట్లో చేసిన కేటాయింపుల్లో దాదాపు ఐదోవంతును తగ్గించింది. తమ వాటా డబ్బులైనా తమకు ఖాయంగా వస్తాయని గండపెడాశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది అశనిపాతంగా మారింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మాసంలోనే తెలంగాణకు దాదాపు 212 కోట్ల రూపాయల్ని కేంద్రం కోత పెట్టింది.

హైదరాబాద్‌: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్రాలు మరో ఊహించని సమస్యలో చిక్కుకున్నాయి. కేంద్రం నుంచి వాటికి రావాల్సిన పన్నుల వాటాలో కోత పడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా రూపేణా తెలంగాణకు నెలకు 1195 కోట్లు రావాల్సి ఉన్నది. అయితే ఇందులో కేంద్రం 17.81 శాతం కోత విధించింది. ఏప్రిల్‌ నెలకు కేవలం 982 కోట్లను మాత్రమే ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇది రావాల్సిన దానికన్నా దాదాపు 212 కోట్లు తక్కువ. తెలంగాణకే కాదు; అన్ని రాష్ట్రాలకూ ఇదే రీతిలో కేంద్రం కోత పెట్టింది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణీత నిష్పత్తిలో పంచుకుంటాయి. దీనికి ఆర్థిక సంఘం సూత్రీకరణను అనుసరిస్తారు.

ఒక ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టాలకు ఇచ్చే పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం ముందే బడ్జెట్లో ప్రతిపాదిస్తుంది. ఆ మొత్తాన్ని 14 భాగాలు విభజిస్తారు. ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి వరకూ ప్రతి నెలా ఒక భాగాన్ని అందజేస్తారు. ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో మిగతా మూడు భాగాల మొత్తాన్ని విడుదల చేస్తారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వాటాగా 28 రాష్ట్రాలకూ కలిపి 7,84180.87 కోట్లు ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. ప్రతి నెలా 56,012.92 కోట్ల ను విడుదల చేస్తామని తెలిపింది. కానీ ఏప్రిల్‌ నెల వాటాగా కేవలం 46,038 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అందులో తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది 982 కోట్లు మాత్రమే. తెలంగాణతోపాటు అన్ని రాష్ర్టాలకు రావాల్సిన వాటా లో 17.81 శాతం కోత పెట్టినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. ఆర్థిక సంఘం ఫార్ములా ప్రకారమే నిధుల కేటాయింపు జరిగినట్టు పేర్కొన్న కేంద్రం, కోత పెట్టిన విషయాన్ని గానీ, అందుకు కారణాలనుగానీ ప్రత్యేకంగా పేర్కొనలేదు. కరోనా వల్ల పన్నుల వసూలు పడిపోవడమే కోతకు కారణమై ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కేంద్ర, రాష్ట్రాలు రెంటికీ పన్నుల వసూలు బాగా తగ్గిన సంగతి తెలిసిందే.

కేంద్రం ఇబ్బందుల్లో ఉన్న సంగతిని తెలంగాణ, తదితర రాష్ట్రాలు ముందే గుర్తించాయి. అందుకే ఇతరత్రా మార్గాల్లో తమకు ఆర్థిక వెసులుబాట్లు కల్పించాలని సూచించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు ఆర్థిక వేత్తలతో సంప్రదించిన తర్వాత, క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ పద్ధతిలో రాష్ర్టాలకు నిధుల లభ్యతను పెంచవచ్చని నేరుగా ప్రధానమంత్రికే ప్రతిపాదించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీనికి మద్దతు తెలిపారు. దీంతో పాటు రాష్ట్రాల రుణ పరిమితిని పెంచాలనీ, రుణాల చెల్లింపులను వాయిదా వేయాలనీ కేసీఆర్‌ పలు ప్రతిపాదనలు చేశారు.

ఈ చర్యల వల్ల కేంద్రంపై ఎలాంటి భారమూ పడదనీ, రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత ఉపశమనం లభిస్తుందనీ తెలిపారు. కానీ కేంద్రం వీటిపై ఇప్పటికీ నోరు మెదపలేదు. రాష్ట్రాల ప్రతిపాదనను ఔననీ, కాదనీ చెప్పకుండా, తన మనసులో మాట బయటపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం సాచివేత విధానాన్ని అనురిస్తున్నది. ఏదో ఒక విధానంలో తమను అదుకోవడం తక్షణావసరమని రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటుండగా, వాటిపై స్పందించని కేంద్రం, ఇప్పుడు రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన నిధుల్లో కోత పెట్టడం గమనార్హం. పైగా పదిహేనవ ఆర్థిక సంఘం ఫార్మలా మేరకే ఇలా చేసినట్టు పేర్కొనడం విశేషం. గతంలో 42 శాతంగా ఉన్న రాష్ట్రాల వాటాను కేంద్రం ఇప్పటికే 41 శాతానికి తగ్గించింది. నిధుల విడుదలలో వెయిటేజీ ఇవ్వడంలో కేంద్రం సరైన విధంగా వ్యవహరించలేదనే విమర్శ ఉండనే ఉన్నది.

జనాభాకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి అభివృద్ధికి తక్కువ వెయిటేజీ ఇవ్వడం వల్ల తెలంగాణ వంటి రాష్ర్టాలకు అన్యాయం జరుగుతున్నది. నిధుల కేటాయింపులో ప్రాధాన్య క్రమాలను మార్చాలని, అభివృద్ధి, ప్రగతిశీల విధానాలకు ఎక్కువ వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ మొదటి నుంచీ వాదిస్తున్నది. అయినా 15వ ఆర్థిక సంఘం దానిని పట్టించుకోలేదు. ఫలితంగా తెలంగాణ నిధుల వాటా 2.47నుంచి 2.33 శాతానికి తగ్గింది. ఇప్పుడు మళ్లీ అడిగిన వెసులుబాట్లు ఇవ్వకుండా, ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం కోత పెట్టింది. కరోనా పోరాటానికి, ప్రభావిత వర్గాలను ఆదుకోవడానికి భారీగా నిధులు అవసరమైన ఈ తరుణంలో కేంద్రం వైఖరి రాష్ర్టాలను మరింత సంకటంలో పడేస్తున్నది.

Courtesy Namaste Telangana

Leave a Reply