సగం సగం..

0
206

విద్య, వైద్యంపై తగ్గుతోన్న కేంద్ర వ్యయం
– 8ఏండ్లుగా జీడీపీలో 1.4శాతం దాటలేదు : రాజకీయ విశ్లేషకులు
ఉన్నత విద్యలో నిధుల పెరుగుదల ఏటా 0.035 శాతం
ఆయుష్మాన్‌ భారత్‌కు కేటాయింపు రూ.6400కోట్లు
వాస్తవ వ్యయం రూ.3199కోట్లు
సామాజిక సంక్షేమానికి అరకొర నిధులు

న్యూఢిల్లీ : ఒక దేశం సమగ్ర అభివృద్ధితో ముందుకు వెళ్లాలంటే ఆ దేశ కేంద్ర బడ్జెట్‌ అత్యంత కీలకం. ఈ బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొనే రాష్ట్రాలు తమ తమ బడ్జెట్‌కు రూపకల్పన చేస్తాయి. ఫిబ్రవరి 1, 2023న మోడీ సర్కార్‌ 2023-24 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న మోడీ సర్కార్‌, ఈసారి బడ్జెట్‌లో పేర్కొనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు గత బడ్జెట్‌కు సంబంధించి అంచనాలు, సవరింపులు, వాస్తవ గణాంకాలు బయటకు రాబోతున్నాయి. అయితే, గత 8 ఏండ్లుగా అభివృద్ధి, సంక్షేమంపై మోడీ సర్కార్‌ వ్యయం అరకొరగా ఉందనీ, ఇప్పుడున్న అవసరాలకు కేటాయింపులు సరిపోవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బడ్జెట్‌ కాగితాల్లో పేర్కొనే మొత్తాలకు..వాస్తవ వ్యయానికి చాలా తేడా ఉంటున్నదన్న విమర్శలున్నాయి. ఉదాహరణకు గత బడ్జెట్‌లో ఉపాధి హామీ (నరేగా) పథకానికి కేటాయింపులు భారీగా చూపారు. కానీ ప్రతి రాష్ట్రంలో ఉపాధి హామీ కార్మికులకు పెద్ద మొత్తంలో వేతన బకాయిలు పేరుకుపోయాయి.

రెవెన్యూ ఆదాయం గతకొన్నేండ్లుగా తగ్గుతూ వస్తోంది. పెట్టుబడి వ్యయంపై కేంద్రం చెబుతున్న లక్ష్యాలు చేరాలంటే రెవెన్యూ ఆదాయం 65శాతం పెరగాల్సి ఉంది. 2021, 22లోనూ ద్రవ్యలోటు పెద్ద ఎత్తున కనపడింది. ఈ ఏడాది మరింత పెరిగి ఉంటుందని సమాచారం. ఉచిత రేషన్‌ ద్వారా పేదలు పొందుతున్న లబ్దికన్నా, పన్ను మినహాయింపులు, ఇతర ప్రయోజనాలతో దేశంలోని బడా కార్పొరేట్లకు కేంద్రం నుంచి దక్కుతున్నది ఎన్నో రెట్లు ఉందన్న విమర్శలున్నాయి.

ఆరోగ్యం, విద్య
దాదాపు 8ఏండ్లుగా ప్రజా ఆరోగ్యం, విద్యపై కేంద్రం అశ్రద్ధ చేస్తున్నది. మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంతా అటకెక్కింది. దేశ జీడీపీలో నిధుల వ్యయం కేవలం 1.4శాతానికి పరిమితమైంది. కోవిడ్‌-19 సంక్షోభ సమయంలో వైద్యంపై చేసిన ఖర్చును పరిగణనలోకి తీసుకున్నా జీడీపీలో ఆరోగ్యం వాటా 2శాతం దాటడం లేదు. ఆరోగ్యం, విద్య రాష్ట్ర జాబితాలోని అంశమంటూ కేంద్రం తప్పించుకుంటున్నది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రజా ఆరోగ్యంపై వ్యయం తగ్గుతూ వస్తోంది. మూడేండ్లుగా కోవిడ్‌ సంక్షోభంతో రాష్ట్రాల ఆదాయాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై రాష్ట్రాల వ్యయం గణనీయంగా పెరిగింది. జీఎస్‌డీపీలో 7శాతం కేరళ ఖర్చు చేయగా, ఢిల్లీ 11శాతం ఖర్చు చేసింది. రాష్ట్రాల సగటు జీఎస్‌డీపీ 5శాతంపైనే ఉంది.

ఉన్నత విద్యారంగంలో కేంద్ర వ్యయం నామమాత్రం. బడ్జెట్‌ వ్యయంలో పెరుగుదల ప్రతిఏటా 0.035 శాతం. యువత జనాభా, విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుంటే ఉన్నత విద్యపై కేంద్ర వ్యయం ఏమాత్రమూ సరిపోదని విశ్లేషకులు చెబుతున్నారు. సుదీర్ఘకాలంగా నిధుల వ్యయం అరకొరగా ఉందని వారు అంటున్నారు. దీంతో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతులు లేకపోవటం ఉన్నత విద్యారంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వర్సిటీల్లో పరిశోధన, ఆవిష్కరణలు పడిపోతున్నాయి. ఈ రంగంలో స్వల్ప, మధ్య ఆదాయ దేశాల వ్యయం (జీడీపీలో) 1.5శాతం దాటుతోంది. భారత్‌లో మాత్రం 1శాతం లోపే. ఆరోగ్యం, రక్షణ, వ్యవసాయ పరిశ్రమల్లో పరిశోధన, ఆవిష్కరణల్ని ప్రోత్సహిస్తూ పలు దేశాలు ముందుకెళ్తుంటే, మనదగ్గర వ్యయంపై కోతలు విధిస్తున్నారు.

సామాజిక సంక్షేమం
ఉపాధి హామీ, గ్రామ్‌ సడక్‌ యోజన, మధ్యాహ్న భోజనం, ఆయుష్మాన్‌ భారత్‌.. మొదలైన వాటిపై బడ్జెట్‌ గణాంకాలు అంత గొప్పగా ఏమీలేవు. ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకంగా పేరొందిన ‘ఉపాధి హామీ’ (నరేగా)ని బలహీన పర్చడానికి కేంద్రం చేయని ప్రయత్నం లేదు. క్రితం బడ్జెట్‌లో రూ.98వేలు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌ (2022-23)లో రూ.73వేల కోట్లు కేటాయించింది. 25.2శాతం నిధులు కోతపెట్టింది. కోవిడ్‌ సంక్షోభం, లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల పట్టణాల్లోని కోట్లాది మంది ఉపాధి కోల్పోయి గ్రామాలకు తరలివెళ్లారు. వారిని ఆదుకునేందుకు ‘నరేగా’ పెద్ద దిక్కుగా మారింది. అయినా వేతనాల చెల్లింపుల్లో వేల కోట్లు బకాయిలున్నాయి.9ఏండ్ల క్రితం మన్మోహన్‌ సర్కార్‌ ‘నరేగా’పై వ్యయం (మొత్తం బడ్జెట్‌లో) 2.4శాతం. ఇప్పుడు కేంద్రం చేసిన వ్యయం 2.6శాతం. సంక్షోభ సమయంలోనూ పథకంపై వ్యయాన్ని కేంద్రం పెంచలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో గణాంకాలతో గారడీ చేస్తోంది. 2018-19లో రూ.6400కోట్లు కేటాయించింది. వాస్తవ వ్యయం రూ.3200 కోట్ల దగ్గర ఆగిపోయింది. 2020-21లోనూ కేటాయింపు రూ.6వేల కోట్ల పైన చూపారు, వ్యయం రూ.3100 కోట్లు మాత్రమే. క్రితం ఏడాది (2021-22) వాస్తవ వ్యయం రూ.3199 కోట్లు ఉండగా, 2022-23లో దానికి రెట్టింపు రూ.6412 కేటాయింపులు చేసింది. వాస్తవ వ్యయానికి రెట్టింపు కేటాయింపులు చూపుతూ దేశ ప్రజల్ని కేంద్రం మభ్యపెడుతోంది.

Leave a Reply