కొంటరా.. కొనరా?

0
44
 • యాసంగి వడ్లపై కేంద్రం స్పష్టం చేయాలి.. ఈ యుద్ధం ఆరంభమే
 • కేంద్రం దిగివచ్చేవరకూ ఉప్పెనలా సాగుతుంది
 • గ్రామగ్రామానా కేంద్రంపై చావుడప్పు కొడతాం
 • దేశ రాజధాని ఢిల్లీ వరకు యాత్ర చేపడతాం
 • బియ్యాన్ని బీజేపీ ఆఫీసు ముందు కుమ్మరిస్తాం
 • అవసరమైతే దేశంలోని రైతుల పోరాటాలకు
 • టీఆర్‌ఎస్‌ పార్టీయే నాయకత్వం వహిస్తుంది
 • సీఎం ధర్నా చేసే పరిస్థితిని కేంద్రమే కల్పించింది
 • కేంద్రంపై, బీజేపీపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌
 • ఇందిరాపార్కు వద్ద టీఆర్‌ఎస్‌ మహాధర్నా
 • ఇది ఆరంభం మాత్రమే. ఈ యుద్ధం ఒక్క రోజుతో
 • ఆగిపోదు. ఊరూరా కేంద్రంపై చావుడప్పు మోగిస్తాం.

ఢిల్లీకి యాత్ర చేపడతాం. ఉత్తర భారతదేశంలోని రైతుల పోరాటాలను కలుపుకొని భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అవసరమైతే దేశ రైతుల సమస్యలపై టీఆర్‌ఎస్సే నాయకత్వం తీసుకొని పోరాడుతుంది. – ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొంటారో, కొనరో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రం వైఖరికి నిరసనగా యుద్ధం చేస్తున్నామని, ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమేనని చెప్పారు. కేంద్రం దిగివచ్చి వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం ఆగదని, ఉధృతమై ఉప్పెనలా సాగుతుందని అన్నారు. రాష్ట్ర హక్కులను సాధించే వరకు, రైతుల ప్రయోజనాలను పరిరక్షించేంత వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఉత్తర భారతదేశంలోని రైతుల పోరాటాలను కూడా కలుపుకొని  ఉధృతం చేస్తామని, అవసరమైతే దేశ రైతుల సమస్యలపై టీఆర్‌ఎస్‌ పార్టీయే నాయకత్వం తీసుకొని పోరాడుతుందని తెలిపారు. రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల కేంద్రం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ గురువారం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన మహాఽధర్నాలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.

సుమారు రెండున్నర గంటలపాటు ధర్నాలో ముఖ్యమంత్రి కూర్చున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని, కానీ, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల మన రైతాంగం దెబ్బతినే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి ఎన్నిసార్లు లేఖ రాసినా.. ఉలుకూ పలుకూ లేదని, అందుకే కేంద్రం దిగి వచ్చేవరకు గ్రామగ్రామాన పోరాటం చేద్దామని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. అవసరమైతే కేంద్రంపై ప్రతి గ్రామంలో చావు డప్పు కొడతామని ప్రకటించారు. దేశంలో రణం చేయడంలో టీఆర్‌ఎ్‌సను మించిన పార్టీ మరొకటి లేదన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైతే రాజధాని ఢిల్లీ వరకు యాత్ర చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ధర్నా చేేస పరిస్థితిని కేంద్రమే కల్పించిందని ఆరోపించారు. ప్రధాని మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు 51 గంటల దీక్ష చేశారని కేసీఆర్‌ గుర్తు చేశారు. తాము కూడా అదే విధంగా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం ఉద్యమిస్తున్నామని, కేంద్రం కళ్లు తెరిపించడానికే యుద్థం చేస్తున్నామని తెలిపారు.

కొనకపోతే బీజేపీ ఆఫీసు ముందు గుమ్మరిస్తాం
భారత రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆ బాధ్యతను కేంద్రం విధిగా నిర్వర్తించాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు చేసే ఎఫ్‌సీఐ ఎవరి వద్ద ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీ నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై రూ.1-2లక్షల కోట్లు వెచ్చించి అయినా రైతాంగాన్ని సంక్షోభం నుంచి కేంద్రం గట్టెక్కించాలన్నారు. కానీ, ఆ పని చేయకుండా.. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్నారని మండిపడ్డారు. వడ్ల కోసం తమ పోరాటం మొదలైందని, రానున్న రోజుల్లో దేశం కోసం కూడా పోరాడతామని ప్రకటించారు. తెలంగాణ రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే.. బియ్యాన్ని తీసుకొచ్చి రాష్ట్ర బీజేపీ ఆఫీసు ముందు కుమ్మరిస్తామని హెచ్చరించారు.

తెలంగాణలోనే కాదు.. దేశమంతా గోస
మోదీ సర్కారు తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలు దేశవ్యాప్తంగా రైతులకు ఇబ్బంది కలిగించేవేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ గోస ఒక్క తెలంగాణలోనే కాకుండా.. దేశమంతటా ఉందన్నారు. దేశాన్ని పాలించడంలో మోదీ ప్రభుత్వం కూడా ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఆకలి సూచిక(హంగర్‌ ఇండెక్స్‌)లో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ కంటే కూడా భారతదేశమే దారుణమైన స్థితికి పడిపోయిందని చెప్పారు. ప్రపంచ ఆకలి సూచిలో 116 దేశాలలో మన స్థానం 101వ స్థానంలో ఉందని అన్నారు. దేశంలో 12 కోట్ల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారని, అయినా కేంద్ర ప్రభుత్వ తీరు వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.  రైతులను బతకనిస్తరా? లేదా? అని ప్రశ్నించారు. ఉత్తర భారతదేశంలో రైతులు సాగు చట్టాలపై పోరాడుతుంటే.. వారిని అణచివేస్తూ, కార్లతో తొక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు తెలంగాణలోని అన్నదాతల కల్లాల దగ్గరికి వచ్చి బీజేపీ నేతలు రాజకీయాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీ పర్యటన చేపట్టి న తర్వాత కేంద్ర ప్రభుత్వ దొంగ నీతి బహిర్గతమయిందని తెలిపారు. తెలంగాణ రైతులు మునగొద్దని, బాధపడొద్దనే తాము వరి పంటను వేయొద్దని చెప్పామన్నారు. ఇతర పంటలు సాగు చేయించేలా తాము ఆలోచిస్తుంటే.. బీజేపీ నేతలు వరి పంట వేయాలని చెప్పడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడలు వంచి కొనిపిస్తామంటూ బీజేపీ నాయకులు అహంకారంగా మాట్లాడారని సీఎం ధ్వజమెత్తారు. ఒకేసారి పంట మార్చడం రైతాంగానికి కష్టమేనని, కానీ, కేంద్రం కొనకపోతే రైతులు ఇబ్బందులకు గురవుతారని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ విషయంపై తాము ఇంకా పోరాటం చేస్తున్నామన్నారు. కానీ, దీనిని పక్కదారి పట్టించేందుకు బీజేపీ అనుబంధ సంఘాల కార్యకర్తలు సోషల్‌ మీడియాలో ఫేక్‌ వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనానికి కూడా ఒక పరిధి ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు.

కేంద్ర పెద్దలకు తెలివి లేదు..
భారత దేశానికి ప్రకృతి ఇచ్చిన సంపద 65 వేల టీఎంసీల నీరు, 40 కోట్ల ఎకరాల భూమి ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. వాటిలో కనీసం 30 నుంచి 35 వేల టీఎంసీలు కూడా మనం వినియోగించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో సమగ్ర విధానం లేకపోవడంతో 30 వేల టీఎంసీల నీరు సముద్రాల పాలువుతోందని తెలిపారు. ఎన్నికలు వస్తే భైంసాను చూపించాలని, హిందూ, ముస్లింలకు కొట్లాట పెట్టాలని బీజేపీ నేతలు చూస్తారని సీఎం ధ్వజమెత్తారు. ఇటువంటి రాజకీయం కోసమేనా.. మిమ్మల్ని దేశ ప్రజలు ఎన్నుకున్నదని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎంతో మంది సీఎంలుగా పని చేశారని, మరి 30 ఏళ్లు కరెంటు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. తాము వచ్చిన తర్వాత ఇది ఎలా సాధ్యం అయిందన్నారు. దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉందని, అందులో రెండు లక్షల మెగావాట్లు వినియోగంలో ఉండదని తెలిపారు. ఈ సమయంలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేలా రైతులపై ఒత్తిడి చేయని రాష్ట్రాలకు అప్పులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ నేతలు వడ్ల కల్లాల దగ్గరికి ఎందుకు పోతున్నారని మండిపడ్డారు. ఈ అంశాలపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి బీజేపీకి  చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్‌కు భయం ఉంటే తెలంగాణ వచ్చేదా?
దేశానికి అన్నం పెడతామంటే.. తీసుకునే తెలివిలేదని కేంద్రానికి సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడితే కేసులు పెడతామంటున్నారని, ఏం కేసులు పెడతారో పెట్టుకోవాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌కు భయం అంటే తెలుసా? తాను భయపడేవాడినైతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అని ప్రశ్నించారు. ఏ పదవులైనా తమకు చిత్తుకాగితాలతో సమానమన్నారు. ఈ పిచ్చికూతలు మానుకొని రైతుల విషయంపై మాట్లాడాలని బీజేపీ నేతలకు హితవు పలికారు. శుక్రవారం (ఈ నెల 19న) అనురాధ కార్తె వస్తుందని, యాసంగిలో వరి వేయాలా? వద్దా? అని నిలదీశారు. వడ్లు కొంటామంటే… తానే విత్తనాలు సరఫరా చేయించి రైతులతో వరి వేయిస్తానని చెప్పారు. దేశంలో రైతుల సమస్య రాజకీయ సమస్య కాదని, వారిది జీవన్మరణ సమస్య అని అన్నారు. కేంద్రం ధాన్యం కొనకపోతే అన్నదాతలు ఏంచేయాలని ప్రశ్నించారు. విషం తాగి చావాలా? చెట్లకు ఉరేసుకొని చావాలా? అని నిలదీశారు.

గవర్నర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేల వినతిపత్రం
ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా ముగిసిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ వద్దకు వెళ్లి వినతిపత్రం సమర్పించారు. అనంతరం నిరంజన్‌రెడ్డి రాజ్‌భవన్‌ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ధర్నాతో కేంద్రానికి తెలంగాణ విధానాన్ని స్పష్టం చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాల మూలంగా తెలంగాణ సర్కారు ధర్నా చేయక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. యాసంగిలో కేంద్రం వడ్లు కొనేలా చూడాలని గవర్నర్‌కు విన్నవించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా గవర్నర్‌.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు అడిగి తెలుసుకున్నారని  మంత్రి చెప్పారు.

Courtesy Andhrajyothi

Leave a Reply