-వలసకార్మికులకు 14 రోజులపాటు క్వారంటైన్
– నగరాలు.. రాష్ట్రాలు దాటకుండా చర్యలు : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్-19) ధాటికి యావత్ ప్రపంచం గజగజ వణికిపోతున్నది. దేశంలోనూ చాపకింద నీరులా కోవిడ్-19 వ్యాపిస్తున్నది. లాక్‌డౌన్ కొనసాగు తున్నప్పటికీ దేశంలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. దీంతో అప్రమత్తమైన కేంద్రం అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివే యాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శు లతో ఆదివారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ.. కూలీలతో పాటు సాధారణ ప్రజలెవరూ రాష్ట్రాలూ, నగరాలు దాటకుండా సరిహద్దులను మూసివేయాలని ఆదేశించారు. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక తమ సొంత రాష్ట్రాలకు చేరుకుం టున్న వలస కూలీలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని తెలిపారు. అవ కాశం ఉన్నంత వరకు జాతీయ రహదారుల పక్కనే క్వారం టైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అయితే, ఇప్పటికే తమ సొంత ప్రాంతాలకు పయనమైన వలస కూలీలను రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని క్వారంటైన్లకు తరలించాలని ఆదేశించారు.
స్వరాష్ట్రాలకు కూలీలు…
వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల ఉపాధి కరువవ్వడంతో ఆయా ప్రభుత్వాలు కూలీలనువారి స్వరాష్ట్రాలకు వెళ్లటానికి సరిహద్దుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి బయలుదేరిన కూలీలు..కాలిబాటలో మరి కొందరు సరిహద్దులకు చేరుకున్నారు. వారిని అనుమతించమని పోలీసులు..భారీ సంఖ్యలో వచ్చిన జనాన్ని అదుపుచేయటం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఉత్తరప్రదేశ్, బీహార్, తదితర రాష్ట్రాలకు చెందిన వారిని క్వారంటైన్స్‌కు తరలించమని కేంద్రం ఆదేశాలిచ్చినా..వారిని ఏవిధంగా తరలించాలో తెలియక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సరిహద్దుల్లో ఆకలితో అలమటిస్తున్న వారిని ప్రభుత్వాలు,స్వచ్ఛందసంస్థలు ఆహారపొట్లాలు అందజేశాయి.
Courtesy Nava Telangana