బాబు ‘వలస’ బంధం ‘రాయిటర్స్‌’

0
342
బాబు ‘వలస’ బంధం ‘రాయిటర్స్‌’
ఏబీకే ప్రసాద్‌,సీనియర్‌ సంపాదకులు

 రెండో మాట 

‘అత్యధిక పాఠకలోకం ఆదరణ పొందడం అందుకు అనుగుణంగా పాఠకులకు అబద్ధాలతో కాకుండా వాస్తవాలతో కూడిన సరైన సమాచారం అందించడమే వార్తా సర్వీసుల (న్యూస్‌ సర్వీసెస్‌) లక్ష్యం. వార్తల్ని బట్వాడా చేసే సంస్థలు ఆ వార్తల్ని అందించడంలో తమ సొంత తీర్పుల్ని చొప్పించకూడదు. అది పాటిం చినప్పుడే ఆ వార్తలను అందించే సర్వీసులు తమపై పాఠకులలో అనుమానాలూ, అస్పష్టతా రేకెత్తకుండా జాగ్రత్త పడగలుగుతాయి. అలా అయితేనే వార్తలు అందించే న్యూస్‌ సర్వీసుల లక్ష్యానికి తాత్విక పునాది ఉంటుంది. లేదా అది పాఠకులకు స్థూలంగా ఆమోదయోగ్యమైన వార్తగానైనా ఉండాలి’.– ప్రపంచ వార్తా సర్వీసుల తాత్విక పునాది పట్ల సుప్రసిద్ధ పాత్రికేయ చరిత్రకారుడు జొనాధన్‌ ఫెన్‌బీ నిర్వచనం.

‘ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసం’ అన్న దశలో పతనావస్థకు చేరుకున్న టీడీపీ నాయకుడు చంద్రబాబు, ప్రస్తుతం పాత వలసపాలన అవశేషాలకు చిహ్నాలుగా మిగిలి ఉన్న కొన్ని విదేశీ న్యూస్‌ సర్వీసులను ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి వాడుకునే స్థితికి దిగజారిపోయారు. వ్యక్తులు సమాజ సంపదను పోగేసుకోవడానికి స్వేచ్ఛను కాపాడుతున్నది 1935 నాటి బ్రిటిష్‌ ఇండియా సామ్రాజ్యవాద ప్రభుత్వం రూపొందించిన చట్టం. దాని ఆధారంగా స్వతంత్ర భారత రాజ్యాంగంలో చేరిన 31వ అధికరణ చంద్రబాబు చేతిలో ఇప్పుడు బినామీ ఆస్తుల కేంద్రీకరణకు ఎలా యథేచ్ఛగా దోహదపడుతున్నదీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ముసుగులో ‘అమరావతి’ బినామీ కథలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు ఈ  బినామీ ఆస్తుల రక్షణలో తాడూ బొంగరంలేని అమరావతి రాజధానికి ముక్కూముఖం ఏర్పరిచే మిష పైన ప్రపంచ వార్తా సర్వీసుగా బ్రిటిష్‌ ఇండియా నుంచి నేటిదాకా ఉనికిలో ఉన్న రాయిటర్స్‌ వార్తా సంస్థ సేవలను తన అధికార దాహంకొద్దీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తర్వాత కూడా చంద్రబాబు వాడుకోదలిచారు. స్థానికంగా తన ‘ఉంపుడు పత్రికలు’గా తయారైన రెండు తెలుగు దినపత్రికలను తన ప్రభుత్వ పతనం తర్వాత మరింతగా వినియోగించడంతో సంతృప్తిపడని బాబు మరికొన్ని అడ్డదారులు తొక్కడానికి సాహసించారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా అశేష ప్రజాదరణతో, రాష్ట్ర చరిత్రలో అరుదైన అఖండ మెజారిటీతో పరిపాలనా పగ్గాలు అందుకున్న యువనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో సంస్కరణవాద సంక్షేమ పథకాల అమలు జరుగుతుంటే అడుగడుగునా చంద్రబాబు అడ్డుతగలడాన్ని ప్రజలు గమనిస్తున్నారు.

ఈ క్రమంలో తాజా పరిణామం.. అనంతపురం జిల్లాలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఒక రూపు తొడిగి భారీ పరిశ్రమగా దక్షిణ కొరియా ‘కియా’ మోటారుకార్ల యూనిట్‌ ఎదుగుతూ వేలసంఖ్యలో స్థానికుల ఉపాధి కల్పనకు శరవేగాన ముందడుగు వేస్తోంది. అమరావతి పేరిట రాజధాని నిర్మాణం లేకుండా పేద మధ్యతరగతి ప్రజల భూముల్ని ముందుగానే అన్యాక్రాంతం చేసి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఉత్తి చేతులు చూపిన వ్యక్తి బాబు. ఇప్పుడు కియా మోటార్‌ కార్ల పరిశ్రమ యాజమాన్యానికి దిగులు కలిగించే సరికొత్త ప్రచారానికి బాబు గజ్జె కట్టారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ విధానాల వల్ల అనంతపురం నుంచి కియా మోటార్‌ భారీ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతోందన్న నీలివార్తల్ని బాబు, అతని రెండు అనుకూల పత్రికలు వ్యాపింపచేశాయి. రాష్ట్ర ప్రజలు బాబు నీలివార్తల్ని ఎక్కడ నమ్మరోనని భావించి బాబు కొత్త ఎత్తుకు దిగారు. దేశ స్వాతంత్య్రానికి ముందు నుంచీ భారతప్రజలను, నాయకుల్ని వంచిస్తూ సామ్రాజ్యవాద పాలనకు అనుకూలంగా, భారత స్వాతంత్య్ర ఉద్యమానికి వ్యతిరేకంగా వార్తలు గుప్పిస్తూ వచ్చినవి– రాయిటర్స్‌ (బ్రిటన్‌), ఎ.ఎఫ్‌.పి. (ఫ్రాన్స్‌), అసోసియేటెడ్‌ ప్రెస్‌ (ఎ.పి. అమెరికా). భారతదేశంలోని పెట్టుబడిదారీ పత్రికలు కొన్ని మినహాయింపులతో వార్తల కోసం ఈ విదేశీ సంస్థలపై ఆది నుంచీ ఆధారపడుతూ మన దేశ పాఠకులకు వార్తలు అందిస్తూ వస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పెక్కు పత్రికల, నాయకుల బానిస మనస్తత్వమూ, బుద్ధులూ పెద్దగా మారిందేమీ లేదు. పైగా చంద్రబాబులాంటి ‘తిమ్మిని బమ్మిని’ చేయగల అక్రమ సంపాదనాపరుల చేతుల్లో ‘రాయిటర్స్‌’ లాంటి పెద్ద సంస్థ కూడా ఇరుక్కుపోవడం విశేషం– ఎందుకంటే సర్వత్రా వ్యాపార ధోరణి కావటంవల్ల!

అసలు రాయిటర్స్‌కు, బాబు పాత సర్కారుకు ‘లంకె’ ఎలా కుదిరింది? బాబు పాలనలో విశాఖ, హైదరాబాద్‌లలో ‘డిజిటల్‌ డెవలప్‌మెంట్‌’ కార్యక్రమాల పథకాన్ని తలపెట్టి ఎన్నికలలో ప్రయోజనాలు పొందే టెక్నాలజీ మతలబుకు అంకురార్పణ జరిగింది. 2018–2019 ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షాన్ని ఎన్నికలలో విజయం సాధించకుండా అడ్డుకోగల నానా అడ్డగోలు ప్రయత్నాలకు పాల్పడిన బాబు వర్గం డిజిటల్‌ యంత్రాల్ని వినియోగించి దొరికిపోయింది. అలా డిజిటల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం ఆధారంగా 2017లో రాయిటర్స్‌ సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ టీడీపీ నాయకత్వం రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల సారాంశం– డిజిటల్‌ కంటెంట్స్‌ మార్పిడి పేరిట, టెండర్లు పిలవకుండానే (ఇతర ప్రపంచ సంస్థలేవీ పోటీకి రాకుండా) చంద్రబాబు హయాంలో ఒక్క రాయిటర్స్‌కే ప్రయోజనం కల్పిస్తూ ఒప్పందం చేసుకుంది. ఇదీ– ఇప్పుడు ఇందుకు ముదరాగా రాయిటర్స్, నేటి వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన రాజధాని వికేంద్రీకరణ సహా ఆచరణలోకి తెస్తున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు పన్నిన వలలో చిక్కుకుంది. అయితే బాబు రాయిటర్స్‌ సంస్థ ద్వారా కియా సంస్థ మేనేజ్‌మెంట్‌పైన, జగన్‌ ప్రభుత్వంపైన వ్యాపింపజేసిన తప్పుడు ప్రచారానికి తాళం పడిపోయింది. అటునుంచి తమిళనాడు ప్రభుత్వమూ ఖండన పరంపర ద్వారా బాబు, రాయిటర్స్‌ జమిలిగా తలపెట్టిన కుట్రను భగ్నం చేయవలసి వచ్చింది.

విడిపోయిన నూతన ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని కోసం వెతుకులాటలో సుదీర్ఘ పర్యటనానంతరం ఉన్నతస్థాయి కేంద్ర విచారణ సంఘం (శ్రీరామకృష్ణన్‌ కమిటీ) అన్ని పరిస్థితులను బేరీజు వేసుకుని, మూడు పంటలు పండే అమరావతి ఏరియా మాగాణి సుక్షేత్రాలను పొరపాటున కూడా రాజధాని పేరిట పాడుచేయవద్దని హెచ్చరించింది. అంతేగాదు, అమరావతి ప్రాంతంలో పర్యావరణ ప్రమాణాల దృష్ట్యా తక్కువ లోతునుంచే నీరు ఉబికివచ్చే ప్రమాదం ఉన్నందున, భారీ నిర్మాణాలకు అది అనువైనది కాదని కూడా నివేదికలో హెచ్చరించింది. అయినా ఆ నివేదికను అసెంబ్లీ ఛాయలకు కూడా రానివ్వకుండా, ప్రవేశపెట్టకుండా, చర్చించకుండానే విద్యా వ్యాపారవేత్త చేత రాజధానిగా అమరావతికి అనుకూలంగా నివేదికను గిలిగించి దాంతోనే భూములపైన స్పెక్యులేషన్‌ వ్యాపారం చేసింది బాబు ప్రభుత్వం. బినామీ భూముల కోసమే అమరావతిని బాబు బలి చేశాడు. అయిదేళ్లయినా అవసరమైన రాజధానిని నిర్మించడంలో విఫలమయ్యారు. ఈ తరుణంలో కేంద్ర పర్యావరణ సాధికార సంస్థ, నిర్ణయాధికార సంస్థ రాజధానిగా అమరావతి నిర్మాణం తగదని సూచనప్రాయంగానూ, లిఖితపూర్వకంగానూ స్పష్టంగా హెచ్చరించినా బాబు పెడచెవిన పెట్టడానికి కారణం– కేవలం బినామీ ఆస్తుల్ని పోగేసుకోవడానికేనని తరువాతి పరిణామాలు రుజువు చేశాయి.

ఇదే సమయంలో మన కోస్తాలో మాదిరే తీర ప్రాంతాల పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని 2019 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశిస్తూ అందుకు 138 రోజుల వ్యవధినిస్తూ తీర్పు చెప్పవలసి వచ్చిందని మరచిపోరాదు. ఆ కారణంగానే కేరళలోని మరడు ప్రాంతంలో నిర్మించిన భవంతులను క్షణాలలో కూల్చివేయించిన ఘటననూ మనం మరవరాదు. ఈ సాధికారికమైన హెచ్చరికలను సహితం ఖాతరు చేయకుండా, ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణను ఇప్పటికీ బాబు మొండిగా వ్యతిరేకించడమంటే నదిలో మునిగిపోతున్నవాడు ఆఖరి ప్రయత్నంగా ‘గడ్డిపోచ’ను పట్టుకుని బయటపడదామన్న వృథా తాపత్రయమే అవుతుంది. భారతదేశంలోని అరడజను రాష్ట్రాలు, ప్రపంచంలో పన్నెండు దేశాలు– పరిపాలనా విభాగాలుగా, శాసన వేదికలుగా, న్యాయస్థాన కేంద్రాలుగా రెండేసి, మూడేసి రాష్ట్రాలలో వేర్వేరుగా ఏర్పరచుకుని పాలనా సౌలభ్యాన్ని, ప్రాంతాల మధ్య అసమానతలను క్రమంగా తొలగిస్తూ అభివృద్ధినీ సాధించాయి.

ఈ దేశీయ, అంతర్జాతీయ పాఠాల నుంచే జగన్‌ ప్రభుత్వం పాలనా, ప్రాంతీయ స్థాయి అభివృద్ధికి అనుగుణంగా వికేంద్రీకరణ పథకాన్ని తలపెట్టడం ఒక ప్రయోగంగా వినూత్నమేగాదు, అవశ్యం, అవసరం కూడా అని మరవరాదు. గత చరిత్రను తవ్విచూసుకున్నా– శాతవాహనుల కాలం నుంచి కాకతీయుల దాకా కోటి లింగాల, బోధన్‌ల నుంచి అమరావతి వరకూ, రెండేసి, మూడేసి రాజధానులను పాలనా కేంద్రాలుగా మలచుకున్నవారే. అంతేగాదు, పల్లవులు, విష్ణుకుండినులు కూడా పాలనా సౌలభ్యం కోసం రెండేసి, మూడేసి ప్రాంతాలలో రాజధానులు నిర్వహించారు. ఆంధ్రుల చరిత్రలో విష్ణుకుండినుల పాలకులకు వేములవాడ, నాగార్జునకొండ రాజధానులుగా ఉండేవని కొందరు చారిత్రికుల భావన. నాడూ, నేడూ, ఏనాటికైనా పాలన ఎక్కడినుంచి సాగిం దని కాదు, ఎంత మంచిగా ప్రజానురంజకంగా ఎంతకాలం సాగిందన్నదే ప్రజల జ్ఞాపకంలో ఉండేదీ, లెక్కల్లో నిలిచేదీ!!

సీనియర్‌ సంపాదకులు

Courtesy Sakshi

Leave a Reply