కరాటే కల్యాణి ఇంట్లో ‘చైల్డ్‌ లైన్‌’ అధికారుల తనిఖీలు

0
72
  • చిన్నారుల కిడ్నాప్‌, కొనుగోలు చేసినట్లు ఫిర్యాదుతో దాడులు
  • కల్యాణి ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లిని ప్రశ్నించిన అధికారులు

ఎర్రగడ్డ : సినీనటి కరాటే కల్యాణి ఇంటిపై ఆదివారం చైల్డ్‌ లైన్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారులను దత్తత తీసుకోవడం, కిడ్నాప్‌, కొనుగోలు చేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నారంటూ చైల్డ్‌ లైన్‌ టోల్‌ఫ్రీ నం.1098కు ఆదివారం ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశాడు.

దీంతో, ఎస్సార్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ రాజీవ్‌ నగర్‌, లక్ష్మీనిలయంలోని కరాటే కల్యాణి ఇంటికి చేరుకున్న చైల్డ్‌ లైన్‌ అధికారులు మహేశ్‌, సంతోష్‌ విచారణ చేపట్టారు. అయితే, ఆ సమయంలో కరాటే కల్యాణి  ఇంట్లో లేరు. కరాటే కల్యాణి తల్లి విజయలక్ష్మిని అధికారులు విచారించారు. కరాటే కల్యాణికి చిన్నతనం నుంచి పిల్లలంటే చాలా ఇష్టమని, ఎవరూ లేని అనాఽథ పిల్లలను, చెత్తకుప్పల్లో తల్లిదండ్రులు వదిలేసిన చిన్నారులను చేరదీసి పెంచుకుంటారని విజయలక్ష్మి తెలిపారు. అలాగే, ఆర్థిక స్తోమత లేక ఓ కుటుంబంలోని వారు ఓ ఆడపిల్లను కరాటే కల్యాణికి ఇచ్చారని చెప్పారు. కరాటే కల్యాణి తల్లి విజయలక్ష్మి అందజేసిన వివరాల మేరకు చట్టబద్ధత లేకుండా చిన్నారులను తెచ్చి, పెంచుకుంటున్నట్లు తాము అనుమానిస్తున్నామని చైల్డ్‌ లైన్‌అధికారులు తెలిపారు. పలువురు చిన్నారులను కిడ్నాప్‌ చేయడంతో పాటు 2 నెలల వయసున్న పిల్లలను కొనుగోలు చేసినట్టు, పిల్లలను అడ్డుపెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. సోమవారం మళ్లీ వచ్చి విచారిస్తామని వారు స్పష్టం చేశారు.

Leave a Reply