గుండెలు పిండేసే దృశ్యం

0
54

పాలకుల అలసత్వానికి వలస మహిళా శ్రామికురాలు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. తిరిగిరాని తల్లి కోసం ఆమె చిన్నారి కొడుకు పడిన తపన యావత్‌ దేశాన్ని కన్నీళ్లు పెట్టించింది.

ముజఫర్‌పూర్‌: వలస శ్రామికుల దీనస్థితికి సజీవ సాక్క్ష్యంగా నిలిచిన ఈ హృదయ విదాకర ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ ఫ్లాట్‌ఫాంపై వెలుగు చూసింది. అన్నెం పున్నెం ఎరుగని పసిబాలుడు అమ్మ చనిపోయిందని తెలియక ఆడుకుంటున్న దృశ్యం చూపరులను కంటితడి పెట్టిస్తోంది. తల్లి మృతదేహంపై కప్పిన దుప్పుటితో పాపం పసివాడు ఆడుకుంటూ కనిపించాడు. నిద్రపోతున్నట్టుగా ఉన్న అమ్మను నిద్రలేపేందుకు చిన్నారి పదే పదే ప్రయ​త్నించడం అక్కడున్న వారిని కదిలించింది. రైల్వే స్టేషన్‌లో ఎవరి హడావుడిగా వారుండగా లోకం పోకడ తెలియని అమాయక బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన అమ్మకోసం ఆరాటపడుతున్న దృశ్యం హృదయాలను ద్రవింపచేసింది. ఈ విదారక ఘటనకు సంబంధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్‌ యాదవ్‌ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ఇది వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

మృతురాలు శనివారం గుజరాత్ నుంచి శ్రామిక ప్రత్యేక రైలు ఎక్కింది. ఆహారం, నీరు లేకపోవడంతో రైలులో అనారోగ్యానికి గురైనట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. రైలు సోమవారం ముజఫర్ నగర్ చేరుకున్నప్పుడు, ఆమె కూలిపోయింది. ఆమె మృతదేహాన్ని స్టేషన్ ప్లాట్‌ఫాంపై ఉంచారు. అప్పుడే మృతురాలి కొడుకు ఆమెను మేల్కొలపడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు డజన్ల కొద్దీ వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

మార్చి చివరలో లాక్డౌన్ విధించిన తరువాత, లక్షలాది మంది వలస కార్మికులు నిరుద్యోగులుగా మిగిలి పోయారు. ఫలితంగా, వారు తమ సొంత గ్రామాలకు వెళ్లడం ప్రారంభించారు. కాలినడకన, సైకిళ్లు, లోడ్ క్యారియర్లు, ట్రక్కులలో ప్రయాణిస్తూ వందల మంది మృత్యువాత పడ్డారు. వలస శ్రామికుల కోసం నడిపిస్తున్న శ్రామిక ప్రత్యేక రైళ్లలో తాగునీరు, ఆహారం అందించకపోవడంతో ఆకలి కేకలు వినపడు తున్నాయి. రోజుల తరబడి రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో పలువురు కార్మికులు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply