అనాథాశ్రమాలా ఆదాయ కేంద్రాలా?

0
364

చందు తులసి

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పిల్లల హోమ్స్ ఎప్పుడైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే నడవాలి. లేదా ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థల ఆధ్వర్యంలో నడవాలి. కానీ ఆశ్రమాల నిర్వహణ ప్రైవేటు స్కూళ్ల నిర్వహణలాగే తయారైంది. పైకి నాణ్యమైన చదువు పేరు చెప్పి ఎలా వ్యాపారం చేస్తున్నారో.. ప్రైవేటు వ్యక్తులు నడిపే ఆశ్రమాల్లోనూ పైకి సేవ పేరు చెప్పి నిరుపేద పిల్లల జీవితాలతో వ్యాపారం చేస్తున్నారు.

దగాపడి మరణించిన వాళ్ల కోసం కచ్చితంగా బతికున్నవాళ్లే గొంతెత్తాలి. మృతులకు జరిగిన అన్యాయమే బతికున్నవాళ్లు చనిపోయిన వాళ్ల కోసం పోరాడేందుకు ప్రాతిపదికవ్వాలి. కానీ అత్యాచారం లాంటి క్రూరమైన నేరాలపై స్పందించాలన్నా జరిగిన నేరం కాకుండా బాధితురాలి నేపథ్యం, కులం, ఆర్థిక స్థితే ప్రాతిపదికలౌతున్నాయి. అంటే ఆర్థికంగా, సామాజికంగా పై స్థాయిలో ఉన్న మహిళకో, బాలికకో అన్యాయం జరిగినప్పుడు.. సమాజానికి అదొక అతిపెద్ద సమస్య. మీడియా రాతలూ, లైవ్‌లూ అంతే స్థాయిలో ఉంటాయి. ప్రజలు కూడా బాధితురాలిని తమ ఇంటి బిడ్డకు అన్యాయం జరిగినట్లే ఓన్ చేసుకుంటారు. అదే ఘటన ఓ అనాథ బాలిక, కింది కులానికి చెందిన అమ్మాయికి జరిగితే మెజారిటీ సమాజం ఆ ఘటనతో కనెక్ట్ అవ్వరు. ఆ బిడ్డలో తమ బిడ్డను ఐడెంటిఫై చేసుకోరు. రోడ్లపైకి వచ్చో, సామాజిక మాధ్యమ గోడలపైకి ఎక్కో నిరసన తెలియజేయరు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ అమీన్ పుర లోని మారుతీ అనాథాశ్రమంలో జరిగింది. తల్లిదండ్రులు లేని ఓ అనాథ బాలికపై ఆమె ఉండే ఆశ్రమం నిర్వాహకురాలైన విజయ అత్యాచారం చేయించింది. శరీరం కూడా పూర్తిగా ఎదగని ఆ చిన్నారి బాలిక శరీరంతో 54 ఏళ్ల వేణుగోపాల్ రెడ్డి ఏడాది కాలంపాటు లైంగిక హింసకు పాల్పడ్డాడు. ఆశ్రమానికి దాతగా వచ్చి వెళ్లే వేణుగోపాల్ రెడ్డికి ఆశ్రమ నిర్వాహకురాలు విజయ ఈ బాలికను లైంగిక ఆహారంగా అందించింది. అనారోగ్యానికి గురైన బాలికను ఆశ్రమం నుంచి సమీప బంధువుల ఇంటికి పంపేశారు. వెళ్లినప్పట్నుంచి తీవ్ర అనారోగ్యంతోనే ఉన్న బాలిక నిలోఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆగస్టు 13న చనిపోయింది. జులై 31న తాను ఆశ్రమంలో పడ్డ హింసపై బాలికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆగస్ట్ 13న బాలిక చనిపోయేదాకా విషయం ఎక్కడా బయటికి పొక్కలేదు. బాలిక చనిపోకపోయి ఉంటే.. ఆమెపై జరిగిన లైంగిక హింస ఎప్పటికీ బయటికి వచ్చేదే కాదు. అనాథాశ్రమం నడుపుతున్న మహిళే బాలికపై అత్యాచారం చేయించడం ఏంటన్నదానిపై సామాజిక వేదికలపై పెద్దగా చర్చ కూడా లేదు. అంటే ఆ బాలికను ఎవరూ ఓన్ చేసుకోలేదు. తమ బిడ్డలాంటిదే కదా అన్న బాధ లేదు. ఇప్పుడు విచారణ అధికారులు కూడా బాలిక చావుకు చివరి కారణాలపైనే దృష్టిపెట్టారుగానీ, ఆమె ఆశ్రమంలో లైంగిక దాడి క్రమంలోనే కదా అనారోగ్యంపాలైందన్నది పెద్దగా పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఆశ్రమ నిర్వాహకురాలు, ఆమె బంధువు, బాలికను బలితీసుకున్న వేణుగోపాల్ రెడ్డిపైన పోక్సో చట్టం బుక్ చేసి అరెస్ట్ చేశారు.

మన దేశంలో అనాథాశ్రమాలు లాభదాయకమైన వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయన్నది వాస్తవం. తెలంగాణలో మహిళా శిశు సంరక్షణ శాఖ గుర్తించిన చిల్డ్రన్ హోమ్సే 700 పైగా ఉన్నాయి. ఇవి ప్రభుత్వ హోమ్స్‌కు అదనం. ఒక్క మేడ్చల్ జిల్లాలోనే 132 ప్రైవేటు చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి. వాటిలో 8 వేల మందికి పైగా పిల్లలున్నారు. ఇక హైదరాబాద్ లోనూ, తెలంగాణ మొత్తంలోనూ గల్లీ గల్లీకీ అనుమతుల్లోనే అనాథ శరణాలయాలు కనిపిస్తున్నాయి. వాటిలో ఉన్న పిల్లలు ఎవరు, ఎంతమంది అన్న డేటా ప్రభుత్వం వద్ద లేదు. ఈ విషయాన్ని సీడబ్ల్యూసీ లోని ఉన్నత స్థాయి అధికారులే అంగీకరిస్తున్నారు. నిధుల సేకరణే లక్ష్యంగా పిల్లలను ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పెట్టుకొని ఆశ్రమాలు నడిపేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన మారుతీ హోంను చూస్తే కళ్లు చెదిరిపోతాయి. విలాసవంతమైన ప్రాంతంలో ఉన్న ఆ ఐదంతస్థుల భవనం విలువ రెండు కోట్లకుపైనే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం విజిటర్స్ వచ్చిపోయేందుకు కేటాయించారు. ఐదో ఫ్లోర్లో హోటల్ రూముని తలపించే బెడ్ రూం, తదితర ఏర్పాట్లున్నాయి. ఈ ఘటన బయటపడ్డాక స్థానికులు నిత్యం పెద్ద పెద్ద కార్లలో ఎవరెవరో వచ్చిపోతోంటే అంతా దాతలే అనుకున్నామనీ, చివరికి ఆశ్రమం పేరుతో బ్రోతల్ హౌజ్ నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమాజంలోని సానుభూతిని ఆదాయ వనరుగా మార్చుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు. అనాథాశ్రమాలు నిర్వహిస్తే సమాజంలో గౌరవం, పిల్లల పేరుతో సమీకరించే నిధులు రెండూ ఉంటాయి. హైదరాబాద్ చుట్టూనే ఎక్కువ ఇలాంటి హోమ్స్ తెరుస్తున్నారు. పెద్ద పెద్ద ప్రైవేటు కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చుపెట్టాల్సిన నిధులు పొందేందుకూ ఆశ్రమాలు పెట్టేస్తున్నారు. బ్లాక్ మనీకీ, మనీ లాండరింగుకూ ఈ ఆశ్రమాలు అడ్డాలుగా మారుతున్నాయని కాస్త అధ్యయనం చేస్తే ఇట్టే తెలిసిపోతుంది. అన్ని స్వచ్ఛంద సంస్థలూ ఇలానే పని చేస్తున్నాయని చెప్పలేం. కానీ పిల్లల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి హైదరాబాదులో ఆశ్రమం పెట్టేస్తున్నారంటే అనుమానించాల్సిందే. ఆశ్రమ నిర్వాహకుల ప్రచారం కూడా వ్యాపారాన్ని తలపించేలాగే ఉంటోంది. పిల్లలకు సౌకర్యాలు కల్పించి మంచి ఆహారం పెట్టినంత మాత్రాన ప్రతి ఒక్కరూ చిల్డ్రన్ హోమ్స్ నిర్వహించవచ్చా? ఎందుకంటే ప్రభుత్వాధికారులు తనిఖీలకు వచ్చిన ప్రతిసారీ ఈ మారుతీ ఆశ్రమంలో ఉన్న ఆధునిక హంగులూ, ఆర్భాటాలు, అందమైన విలాసవంతమైన భవనాన్ని చూసి మెచ్చుకునేవారట. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హోమ్స్ నుంచి కూడా కొంత మంది పిల్లల్ని ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ప్రైవేటు చిల్డ్రన్ హోమ్స్ లో జరుగుతున్న అనేక ఘటనల్లో అప్పుడప్పుడూ ఒకటి బయటికి వచ్చి ఆశ్రమాలను సీజ్ చేస్తున్నా కొత్త పేర్లతో మళ్లీ దుకాణాల్లా తెరిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్ లో మంచి ఆదరణ పొందుతున్న ఓ బాలికల హోమ్ నిర్వాహకుడు అత్యాచారం కేసులో అరెస్టయి జైలుకెళ్లాడు. అదే వ్యక్తి మూడేళ్ల శిక్ష తర్వాత బిందాస్ గా బయటికొచ్చి ‘కొత్తగా ఆదరణ’ పొందడం మొదలు పెట్టాడు. వేరేవాళ్ల పేరుతో హోమ్ రిజిస్టర్ చేయించి మరో ఏరియాలో పిల్లల సేవ పేరుతో దందా మొదలు పెట్టాడు. పిల్లల్ని ఆదరించే పేరుతో ఈజీగా డబ్బు డబ్బు, పేరు సంపాదించే ఫక్తు దందా ఇది.

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పిల్లల హోమ్స్ ఎప్పుడైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే నడవాలి. లేదా ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థల ఆధ్వర్యంలో నడవాలి. కానీ ఆశ్రమాల నిర్వహణ ప్రైవేటు స్కూళ్ల నిర్వహణలాగే తయారైంది. పైకి నాణ్యమైన చదువు పేరు చెప్పి ఎలా వ్యాపారం చేస్తున్నారో.. ప్రైవేటు వ్యక్తులు నడిపే ఆశ్రమాల్లోనూ పైకి సేవ పేరు చెప్పి నిరుపేద పిల్లల జీవితాలతో వ్యాపారం చేస్తున్నారు. ఎంత ఎక్కువ మంది పిల్లలు ఆశ్రమంలో ఉంటే అంత ఎక్కువ నిధుల్ని ప్రభుత్వం నుంచీ, దాతల నుంచి వసూలు చేయవచ్చన్నమాట.

ప్రైవేటు ఆశ్రమాల్లో ఉండే పిల్లల్లో ఎక్కువ మంది సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు. అయితే తల్లో తండ్రో ఉండగా ఆ బిడ్డ ఆశ్రమంలో ఉండటం బాలల హక్కులకు విరుద్ధం. పేదరికం కారణంగా కన్నవాళ్లు పెంచలేకపోతే ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ హోమ్స్ తోపాటు గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, స్కూళ్లు ఉన్నాయి. ఆ స్కూళ్లలో సాధారణ పిల్లలతో కలిసి చదువుకోవడం వల్ల న్యూనతా భావం లేకుండా పిల్లలు పెరిగిపెద్దవుతారు. ఉచితంగానే చదువుకునే అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో ఉన్నప్పుడు.. తల్లిదండ్రులున్న పిల్లలపై కూడా అనాథల ముద్ర వేసి ప్రైవేటు ఆశ్రమాల్లో ఎందుకు బందీలుగా చెయ్యాలి..? బాలల కోసం పనిచేసేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పెద్ద పెద్ద యంత్రాంగాలు ఉన్నా క్షేత్ర స్థాయిలో, పిల్లల కోణంలో చూసే వ్యక్తులు లేకపోవడం వల్ల చిన్నారుల సమస్యను అప్పుడప్పుడు పిల్లల చావులతో వెలుగులోకి వచ్చే చిన్న కేసుల్లాగే చూస్తున్నారు.

కుటుంబంలోనే పిల్లలకు సరైన రక్షణ, భద్రత లేకపోవడం వల్ల, తల్లిదండ్రులు జైలుపాలవడం వల్ల కూడా చిన్నారులకు హోమ్స్ కు తరలిస్తుంటారు. అంటే వీరంతా పోలీసుల ద్వారా ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఆశ్రమాలకు వెళ్లే పిల్లలు. వీరి సంఖ్య కూడా పరిమితంగానే ఉంటుంది. తల్లిదండ్రులు జైలు నుంచి వచ్చేదాకా మాత్రమే వీరు ఆయా ఆశ్రమాల్లో ఉంటారు. అలాగే బాల కార్మికులు, యాచక వృత్తిలో ఉన్న పిల్లల విషయంలో ప్రభుత్వమే పేరెంటింగ్ చెయ్యాలి. అంటే వారు ఉద్యోగాల్లో స్థిరపడేదాకా పూర్తి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. ఈ బాధ్యత నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం ప్రైవేటు ఆశ్రమాలను ప్రోత్సహిస్తోంటే… ఆ ప్రైవేటు వ్యక్తులు పిల్లలను ఆదాయ వనరులుగా చూస్తున్నారు. ఏ దిక్కూ లేని పిల్లలకు మన దేశంలో ఇంత వరకు ఓ చట్టం లేదు. ఎస్సీఎస్టీలకు మించిన రిజర్వేషన్ ఈ పిల్లలకు ఇచ్చే విధానం లేదు. 18 ఏళ్లు నిండగానే ఆశ్రమాల్లోని పిల్లల్ని ఒక్కసారిగా బయటికి పంపేస్తారు. ఆశ్రమాలు నిర్వహించేవారు కోట్లకు పడగలెత్తుతున్నారు. భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. సేవను ఓ తిరుగులేని ఆదాయవనరుగా మార్చుకుంటోంటే.. లక్షలాది మంది పిల్లలు తమకు తెలియకుండానే ఆశ్రమాల్లో బందీలుగా మారిపోతున్నారు. బాల్యమంతా ఆశ్రమ వాతావరణంలో, దయనీయ జీవిత గాథల మధ్య సాగుతూ 18 ఏళ్ల తర్వాత బయటికి వస్తే ఆ యువతీ యువకులు సాధారణ జీవితం గడపడం సాధ్యమేనా? పిల్లల హక్కులకు చాలా ప్రైవేటు ఆశ్రమాల్లో భంగం కలుగుతోందన్నది వాస్తవం. తన బిడ్డల పూర్తి బాధ్యత తీసుకొని పేరెంటింగ్ చేసే బాధ్యత ప్రభుత్వానిదే అనేది కూడా అంతే వాస్తవం.

Courtesy Andhrajyothi

Leave a Reply