ఇదో సాంస్కృతిక విధ్వంసం!

0
24

వారాల ఆనంద్

ఇంటర్నెట్, యూట్యూబ్, ఓటీటీల కాలంలో ప్రపంచవ్యాప్తంగా దృశ్య మాధ్యమం సరికొత్త రూపాల్ని సంతరించుకుంటున్నది. కానీ మన కేంద్ర ప్రభుత్వం మాత్రం చరిత్రాత్మకమైన, ప్రతిష్ఠాత్మకమైన పలు ప్రభుత్వ సినిమా సంస్థల్ని విలీనంచేసే పనిలో పడింది. విలీనం పేర వాటిని నిర్వీర్యం చేసి భవిష్యత్తులో ప్రైవేటు కార్పొరేషన్లకు అప్పగించే పనిలో నిమగ్నమైంది. స్వాతంత్ర్యం లభించిన తర్వాత పలు దశాబ్దాల క్రితం ఎంతో దూరదృష్టితో నాటి ప్రభుత్వాలు పలు జాతీయ సినిమా సంస్థల్ని ఏర్పాటు చేశాయి. భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని దృశ్యమాధ్యమంలో నిర్మించి, పెంచి పోషించి, రక్షించి, ప్రదర్శించే లక్ష్యంతో ఆ సంస్థలు ఊపిరి పోసుకున్నాయి. నెహ్రూ పాలనలోనే ఎస్‌కె పాటిల్ నేతృత్వంలో ఓ కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సుల మేరకు అప్పటి ప్రభుత్వం సినిమాను కళగానూ, దృశ్య సాంస్కృతిక చరిత్రగానూ భావిస్తూ ఆ స్వతంత్ర సంస్థల్ని ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు పేరు ప్రతిష్ఠల్ని తెచ్చే ఎన్నో సినిమాల్ని రూపొందించే కృషిని చేపట్టింది. కానీ ఇవ్వాళ ప్రభుత్వం వాటిని దక్షత, ఆర్థిక స్వావలంబనల పేర విలీనం చేయడం మొదలుపెట్టింది. భారతీయత, సంస్కృతి అని అస్తమానూ మాట్లాడే పాలకులు భారతీయ చరిత్రనూ, వారసత్వాన్నీ దృశ్య మాధ్యమంలో నిక్షిప్తం చేసే సంస్థల్ని నిర్వీర్యం చేసే పనికి పూనుకున్నారు. భిన్న లక్ష్యాలతో భిన్న పరిధులలో పని చేస్తున్న సంస్థలను ఒంటి స్తంభం కిందికి తెచ్చి కేంద్రీకరించడం వలన అవి వాటి మౌలిక రూపాల్ని, తమ అసలైన లక్ష్యాల్ని వదిలేసే పరిస్థితి రానున్నది.

ఇప్పటికే ఫిలిమ్ సెన్సార్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను రద్దు చేసిన ప్రభుత్వం చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఫిలిమ్ ఫెస్టివల్ డైరెక్టరేట్, ఫిలిమ్స్ డివిజన్, నేషనల్ ఫిలిం ఆర్కైవ్‌లను మూకుమ్మడిగా నేషనల్ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో విలీనం చేసే పని ఆరంభించింది. ఈ మేరకు మొదటి అడుగుగా ఫిలిమ్ సెన్సార్ బోర్డ్ సీఈఓ రవీందర్ భాకర్‌ను చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఫిలిమ్స్ డివిజన్, నేషనల్ ఫిలిమ్ ఆర్కైవ్‌్స, నేషనల్ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల అధికారిగా నియమించింది. దీంతో ముంబైలో ఉన్న ఈ సంస్థలన్నీ ఒక రైల్వే స్టోర్స్ సర్వీస్ అధికారి ఆధీనంలోకి వచ్చేసినట్టయింది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అంతకుముందు బిమల్ జుల్కే ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఈ సంస్థల పని తీరును పరిశీలించి సూచనలు చేయమని ఆదేశించింది. దాంతో ఈ కమిటీ పలు సమావేశాలు నిర్వహించింది. కానీ ఏ సినిమా వాళ్ళను, నిర్మాతలను, నటీనటులను, రచయితలను సంప్రదించకుండానే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అందులో ఏముందో ఇప్పటికీ బయటి ప్రపంచానికి తెలీదు. పార్లమెంటులో పెట్టలేదు కానీ సినీ సంస్థల్లో మార్పులు మాత్రం ఆరంభమయ్యాయి.

నిజానికి ఫిలిమ్స్ డివిజన్ స్వాతంత్రం వచ్చిన ఏడాదికే 1948లోనే ఏర్పాటయింది. ప్రజల ఉపయోగార్థం చిన్న సినిమాలు తీయడం, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి విద్య, వైద్యం లాంటి పలు అంశాలపైన డాక్యుమెంటరీ సినిమాలు నిర్మించడంలాంటివి  ఫిలిమ్స్ డివిజన్ చేయాల్సిన పనులుగా నిర్దేశించారు. అంతేకాకుండా జాతీయ ప్రాముఖ్యం కలిగిన అనేక సందర్భాలనీ, సమావేశాలనీ సెల్యులాయిడ్‌పై చిత్రించి భద్రపరచడం కూడా దాని కర్తవ్యాలుగా నిర్దేశించారు. ఆ క్రమంలో ఫిలిమ్స్ డివిజన్ అనేక డాక్యుమెంటరీలతో భారతీయ చరిత్ర సంస్కృతుల్ని చిత్రబద్ధం చేసిందనే చెప్పాలి. కొంతమేర ఆ డాక్యుమెంటరీలు ఇవ్వాళ మన చరిత్ర వారసత్వాలను కదిలే బొమ్మల్లో నిలిపాయనే చెప్పాలి. చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ ఆఫ్ ఇండియా 1955లో ఏర్పాటయింది. బాలల కోసం ప్రత్యేకంగా సినిమాల్ని నిర్మించడం, ప్రదర్శించడం, పంపిణీ చేయడంతో పాటు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించడం దాని ప్రధాన బాధ్యతగా నిర్దేశించారు. ఈ మేరకు ఆ సంస్థ పిల్లల సినిమాలు రూపొందిస్తూనే, హైదరాబాద్ నగరం శాశ్వత కేంద్రంగా చిత్రోత్సవాల్ని నిర్వహిస్తున్నది. ఇక నేషనల్ ఫిలిం ఆర్కైవ్స్‌ 1964లో ఏర్పాటైంది. ఆ సంస్థ ప్రధాన బాధ్యత సినిమాల పరిరక్షణ, భద్రపరచడం, డిజిటైజేషన్. పీ.కే.నాయర్ లాంటి వారి నేతృత్వంలో ఆర్కైవ్స్ గొప్ప కృషి చేసింది. అంతర్జాతీయంగా దానికి గొప్ప పేరుంది. అనేక అపురూప సినిమాలు పుణె ఆర్కైవ్స్‌లో వున్నాయి. ఇక పుణెలోనూ, కోల్‌కతాలోనూ ఉన్న ఫిలిం ఇనిస్టిట్యూట్‌లు ఎంతోమంది ప్రతిభావంతులైన దర్శకులని నటీనటుల్ని సినీ సాంకేతిక నిపుణుల్ని దేశానికి అందించాయి. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్ని మరింత బలోపేతం చేయాల్సిన సందర్భంలో వాటిని వ్యాపార సంస్థ లాంటిదైన ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో విలీనం చేయడం అర్థంలేని మాట. వివిధ సంస్థల్ని కేంద్రీకరించి ఒకే గొడుగు కిందికి తేవడం వల్ల వాటి ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఆ సంస్థలు స్వతంత్రంగా ఉండి సినిమా వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ళ నేతృత్వంలో పని చేసినట్టయితే మరింత ప్రతిభావంతంగా పనిచేసే అవకాశం ఉంది. ఆ సంస్థలకు సృజనాత్మక స్వేచ్ఛ ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తే మరెన్నో గొప్ప ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆధునిక సాంకేతికతల అభివృద్ధి నేపథ్యంలో ఇలాంటి సాంస్కృతిక సంస్థలలో పరిశోధన, సేకరణ, పరిరక్షణ విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉంది. అది కూడా దీర్ఘకాలం జరగాలి. తత్ఫలితంగానే భారతీయ చరిత్ర సంస్కృతి, వారసత్వం పది కాలాలపాటు భద్రంగా నిక్షిప్తమై ఉంటుంది. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంటుంది.

అయితే ఈ సంస్థల్లో అంతగా పని జరగడం లేదని, అలసత్వం నెలకొన్నదని, ఒకే పనిని పలు సంస్థలు నిర్వహిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు ఒక వాదనను తెస్తున్నాయి. కుక్కను చంపాలని అనుకున్నప్పుడు దానికి మొదట పిచ్చిది అనే ముద్ర వేయాలనే నానుడి ఉంది. ఈ వాదన కూడా అట్లాగే ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే– ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగులబెట్టడం లాంటిదే ఈ చర్య.

 

అంతేకాదు ప్రభుత్వాలు అన్ని సంస్థల్ని పెట్టుబడులు లాభాలు అన్న దృష్టితో చూడడం సరైనది కాదు. కొన్ని సంస్థలు ప్రజా సంక్షేమం కోసం, భవిష్యత్తు అవసరాల కోసం పనిచేస్తాయి. అది మరిచిపోయి కేవలం గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంస్థలు అన్న కారణంతో వాటిని విలీనం చేయటమో రద్దు చేయటమో సరికాదు.

ప్రధానంగా సినిమా వ్యాపార రంగం కనుక ఈ సంస్థలు కూడా లాభాలు తేవాలనుకుంటే  అది కూడా సాధ్యమే. ఇప్పటివరకు చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఫిలిమ్స్ డివిజన్, నేషనల్ ఫిలిం ఆర్కైవ్‌్స ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లాంటి సంస్థలు ఇన్ని దశాబ్దాలుగా నిర్మించి భద్రపరిచిన సినిమాల్నీ, డాక్యుమెంటరీలను, ఇతర స్టిల్ ఇమేజేస్, మూవింగ్ ఇమేజెస్‌ని డిజిటైజ్ చేయడం ద్వారా లాభాల్ని ఆర్జించవచ్చు. అంతేకాదు ప్రభుత్వమే స్వంతంగా ఓటీటీలను ప్రారంభించి కొత్త ఆదాయ వనరుల్ని సృష్టించవచ్చు. ఇప్పటివరకు ఆయా భారతీయ సినిమా సంస్థలు నిర్మించిన కంటెంట్ తక్కువదేమీ కాదు. సరైన సృజనకారుల చేతుల్లో ఆయా సంస్థల్ని పెట్టి, మౌలిక పెట్టుబడిని సమకూర్చగలిగితే గొప్ప ఫలితాలను సాధించడం అసాధ్యమేమీ కాదు. కానీ ప్రభుత్వం అట్లా ఆలోచించకుండా కేంద్రీకరించడం అన్న మిషతో క్రమంగా ప్రైవేటీకరించడం వైపే సాగితే భారతీయ సినిమా వారసత్వ సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

ప్రభుత్వ చర్యలు ఇట్లాగే విలీనమో, రద్దో అన్నట్టుగా సాగితే ఇవ్వాళ సినిమా సంస్థలకు పట్టిన గతే రేపు లాభ రహితమైన, వ్యాపార రహితమైన సాహిత్య అకాడెమీ, సంగీత నాటక అకాడెమీ లాంటి కళా సాంస్కృతిక సంస్థలకూ పడుతుంది. కవులూ, కళాకారులూ, సినిమా సృజనకారులూ మౌనంవీడి స్పందించకపోతే ఫిలిమ్ సంస్థలతో పాటు అకాడెమీలు కూడా రద్దు కావడమో ప్రైవేటు కార్పొరేషన్ల పాలబడడమో తప్పదు. ‘చెరువుల నీళ్ళు చెరువెనుక పడ్డంక ఎవరెంత ఏడ్చినా’ ఫలితం ఉండదు గాక ఉండదు.

Courtesy Andhrajyothi

Leave a Reply