సామాజిక బాధ్యత.. నటులు – క్రీడాకారులకు లేదా..!

0
800

– ఫిరోజ్‌ ఖాన్‌

క్యాన్సర్‌ ప్రాణాలను బలి తీసుకుం టోంది.. ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌ కుటుంబాలకు కుటుంబాలనే రోడ్డుపై పడేస్తోంది. ఆత్మ హత్యలకు ప్రేరే పిస్తోంది.  హత్యలకూ వెనకాడకుండా చేస్తోంది. ధనార్జనే ధ్యేయంగా ఉన్న కొన్ని కంపెనీలు సమాజంలో అశాంతికి కారణమవుతున్నాయి. అలాంటి కంపెనీలకు హీరో, హీరోయిన్లుగా చెప్పుకునే నటులు, స్పోర్ట్స్‌ స్టార్స్‌గా కీర్తించబడే క్రీడాకారులు ప్రచార సాధనాలుగా మారు తున్నారు. సామాజిక బాధ్యతను మరిచి కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా అలాంటి కంపెనీల ప్రకటనల్లో నటిస్తున్నారు. వినోద పరిశ్రమ అయినా, ఏ క్రీడ అయినా అది ప్రజల ఆదరణ తోనే ఎదుగు తుందని, ప్రజల అభిమానంతోనే నటులు, క్రీడాకారులు సెలెబ్రిటీలుగా మారు తారనే వాస్తవాన్ని మరిచి, సమాజానికి నష్టం చేకూర్చే ప్రకటనల్లో నటిస్తున్నారు.

సినిమాల్లో నటించే హీరోలను, పలు క్రీడల క్రీడాకారులను దేవుండ్లుగా ఆరాధించే అభి మానులు భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. అందుకే లక్షలాది, కోట్లాది మందిని ప్రభావితం చేయగల బలం నటులు, క్రీడాకారుల సొంతం. అయితే హీరోలుగా చెప్పుకునే కొందరు నటులు, రికార్డులను బద్దలు కొట్టే మరికొందరు క్రీడా కారులు సమాజానికి మేలు చేసే బదులు పరోక్షంగా కీడుకు కారణ మవుతున్నారు. అన్నీ తెలిసినా ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్న పలు కంపెనీల ప్రకట నల్లో నటిస్తూ సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గుట్కా.. మద్యాన్ని ప్రోత్సహించేలా..
భారతదేశంలో సంభవిస్తున్న మరణా లకు, వ్యాధులకు పొగాకు వాడకం ఒక ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. పొగాకు వినియోగం ప్రతి సంవత్సరం దాదాపు 1.35 మిలియన్ల మరణాలకు కారణ మవుతోంది. భారతదేశంలో 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు గల కోట్లాది మంది భారతీయులు పొగాకు ఆధారిత ఉత్పత్తులను వాడుతున్నారు. వీటిలో పొగ రహిత పొగాకు ఉత్పత్తులైన ఖైనీ, గుట్కా, జర్దా వంటివి కూడా ఉన్నాయి. ఇలాంటి గుట్కాతోపాటు మద్యాన్ని ప్రోత్సహించేలా కొందరు నటులు, క్రీడాకారులు ఆ కంపెనీల ప్రకటనల్లో నటిస్తున్నారు. గుట్కా అనేది పొగాకు నుంచి తయారవుతుంది. ఈ గుట్కాను పాన్‌ మసాలా పేరుతో కొన్ని బ్రాండ్స్‌ ప్రచారం చేస్తున్నాయి. పాన్‌ మసాలా పేరుతో విమల్‌ ప్రకటనలో షారుఖ్‌ ఖాన్‌, అజరు దేవగన్‌ కనిపిస్తారు. అదే తరహాలో కమలాపసంద్‌ తన బ్రాంచ్‌ ప్రకటనల్లో హిందీలో అమితాబ్‌ బచ్చన్‌, టైగర్‌ ష్రాఫ్‌, తెలుగులో మహేష్‌ బాబు, ఆయా భాషల్లోని స్థానిక హీరోలను వాడుకుంది. మద్యం కంపెనీ అయిన రాయల్‌ స్టాగ్‌ నీళ్ల ప్రకటన అంటూ పలు వురు క్రీడాకారులను, నటులను నటింప జేసింది. అంతేకాకుండా ఐపీఎల్‌లో ‘రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు’ అనే ఒక జట్టు ఉంది. రాయల్‌ చాలెంజర్స్‌ ఒక ప్రముఖ మద్యం కంపెనీ. జట్టుతోపాటు సోడా లేదా మంచినీళ్ల సీసాను ప్రమోట్‌ చేసేలా యాడ్స్‌ను రూపొందించి క్రీడాకారులు, నటులను నటింపజేశారు.

విమర్శలు రావడంతో..
పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు, పాన్‌ మసాలా ప్రకటనల్లో నటించవద్దని నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ టొబాకో ఎరాడికేషన్‌ (ఎన్‌ఓటీఈ) అమితాబ్‌ను కోరడంతో పాన్‌ మసాలా బ్రాండ్‌ ప్రమోషన్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్‌ తప్పుకున్నారు. పాన్‌ మసాలా యాడ్‌లో నటించడం లేదని, ఆ బ్రాండ్‌ ప్రమోషన్‌ ద్వారా వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేసినట్టు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా జేమ్స్‌ బాండ్‌ నటుడు అయిన పియర్స్‌ బ్రాస్నన్‌ను ఓ భారత పాన్‌ మసాలా కంపెనీ తమ ఉత్పత్తుల బ్రాండింగ్‌కు వాడుకోగా, భారత అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. మౌత్‌ ఫ్రెషర్‌కే మోడలింగ్‌ చేశానని, కానీ ఆ సంస్థ పాన్‌ మసాలాలు అమ్ముతుందని తెలిసి ఆయన ఫిర్యాదు చేయడమే కాకుండా, ఆ ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నారు.

సరోగేట్‌ అడ్వర్టైజింగ్‌..
భారతదేశంలో కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ (రెగ్యులేషన్‌) చట్టం ద్వారా ఆల్కహాల్‌, సిగరెట్లు, ఇతర పొగాకు ఆధారిత ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం విధించారు. కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ రూల్స్‌, 1994లో సెక్షన్‌ 7 (2) (V×××) ప్రకారం.. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, వైన్‌, మద్యం.. ఉత్పత్తి, అమ్మకం లేదా వినియోగానికి సంబంధించిన ఏ ప్రకటనను అనుమతిం చరాదు. సిగరెట్లు లేదా ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సూచించే లేదా ప్రోత్సహించే ఏ ప్రకటనలోనూ ఎవరూ పాల్గొనరాదని ‘సిగరెట్స్‌ అండ్‌ అదర్‌ టొబాకో ప్రొడక్ట్స్‌ యాక్ట్‌ 2003, సెక్షన్‌ 5’ సూచిస్తుంది. దీంతో చట్టాలకు చిక్కకుండా, సరోగేట్‌ అడ్వర్టైజింగ్‌ ద్వారా ఆ కంపెనీలు తమ ఉత్పత్తులకు ప్రచారం నిర్వహిస్తు న్నాయి. దీని కోసం సెలెబ్రెటీలను వాడు కుంటున్నాయి. కేవలం డబ్బు కోసం మాత్రమే అలాంటి ప్రకటనల్లో క్రీడాకారులు, హీరోలు కనిపిస్తున్నారు. గుట్కా ఉత్పత్తులను ప్రచారం చేయడం భారతదేశంలో చట్టారీత్యా నేరం. దీంతో విమల్‌, కమలాపసంద్‌ లాంటి కంపెనీలు పాన్‌ మసాలా ముసుగులో మార్కెట్లోకి వచ్చి ప్రమోషన్‌ చేసుకుంటున్నాయి. నీళ్లు, సోడా ముసుగులో మద్యం కంపెనీలు తమ ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నాయి.

బెట్టింగ్‌ కంపెనీలకు కూడా..
ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు అలవాటు పడి చాలా మంది తమ ఆస్తులను పోగొట్టుకొని రోడ్డుపై పడుతున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో అన్నీ కోల్పోయిన వారు కొన్ని సార్లు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరికొన్ని సార్లు ఇది హత్యలకు సైతం దారితీస్తోంది. అయితే అలాంటి ఓ బెట్టింగ్‌ కంపెనీ అయిన డ్రీమ్‌ 11 ను బీసీసీఐ తన ఐపీఎల్‌ స్పాన్సర్‌గా ఎంపిక చేసింది. దీనిపై ఎన్ని విమ ర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఐపీఎల్‌లో కొత్తగా అహ్మదాబాద్‌, లక్నో టీములకు వేలంపాట నిర్వహించగా, ఆహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ పార్టనర్స్‌ సంస్థ బెట్టింగ్‌, గేమింగ్‌ను అధికారికంగా నిర్వహించే కంపెనీ. ఆన్‌ లైన్‌ లో రమ్మీ సర్కిల్‌తోపాటు చాలా బెట్టింగ్‌ విధానాల్లో యువత పాల్గొని ఎంతో నష్టపోతున్నారు.

దీంతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌ వల్ల ఎంతోమంది అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అలాంటి వాటిని కేవలం డబ్బుల కోసం ఎలా ప్రోత్సహిస్తారని నటులు, క్రీడాకారులపై మద్రాస్‌ హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎల్‌ స్పాన్సర్‌ అయిన డ్రీమ్‌ 11, ఆన్‌లైన్‌ రమ్మీ, జంగ్లీ, రమ్మీ సర్కిల్‌, ఎంపీఎల్‌ లాంటి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్‌ రాజ్‌, సుదీప్‌లతో పాటు నటి తమన్నాపై మద్రాస్‌ హైకోర్టు అసంతృప్తి సైతం వ్యక్తం చేసింది. సినిమా స్టార్లు, క్రీడాకారులు తమకు ఉన్న పాపులారిటీని ప్రజలకు అనారోగ్యం కల్పించే ఉత్పత్తుల ప్రకటనలకు ఉపయో గించడం వివాదాస్పదమవుతోంది. నేటి యువతరంపై నటులు, క్రీడాకారుల ప్రభావం చాలా ఎక్కువ. అలాంటిది బాధ్యతాయుతంగా వ్యవహరిం చాల్సిన వారు బాధ్యతలను గాలికొదిలేశారు. ఎవరేమైపోతే మాంకేటి అన్నట్టు వ్యవహరి స్తున్నారు. హీరోల ఉపదేశాలూ, ఉగ్రరూ పాలూ సినిమా తెర మీద తప్ప వారి నిజ జీవితాల్లో కనిపించడం లేదు. ఇప్పటికైనా వారు మేల్కొ నాలి. తమకు ఇంత గుర్తింపు ఇచ్చిన సమాజా నికి రుణపడి ఉండాలి. సమాజానికి నష్టం చేకూర్చే ప్రకటనలకు దూరంగా ఉండాలి. బాధ్యతయుతంగా వ్యవహరించాలి.

Courtesy Nava Telangana

Leave a Reply