‘కొలీజియం వివాదం’లో కపట వ్యూహాలు!

0
15
పి. చిదంబరం 
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

‘చరిత్రను మరచిన వారు దానిని పునరావృతం చేస్తారు’– తరచు ఉదాహృతమవుతుండే ఈ మాటలు ఎడ్మండ్ బర్క్‌వని కొందరు, జార్జి శాంటాయనవని మరికొందరు, విన్‌స్టన్ చర్చిల్‌వని ఇంకొందరు అంటారు. ఎవరివైతేనేం అవి పరిపూర్ణ సత్య వాక్కులు కదా. కార్ల్‌మార్క్స్ కూడా అదే సత్యాన్ని మరింత ప్రభావశీలంగా చెప్పారు. ఈ విప్లవ ప్రవక్త ఇలా అన్నారు: ‘తొలుత ఒక విషాదంగానూ పిదప ఒక ప్రహసనంగానూ చరిత్ర తనను తాను పునరావృతం చేసుకొంటుంది.’

సరే, పార్లమెంటు, సుప్రీంకోర్టు నిర్ణయాలలో ఏది సర్వోన్నతమైనది? ఇదీ, ఇప్పుడు న్యాయకోవిదులు, శాసనకర్తలు, పాలనా విజ్ఞులు చర్చిస్తున్న ప్రశ్న. రాజ్యాంగ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు పెద్దలు ఈ చర్చలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. మొదటివారు గౌరవనీయ ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ (జననం 1951); రెండవవారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (జననం 1962); మూడవ వారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు (జననం 1971). మొదటి మాన్యుడికి అత్యవసర పరిస్థితి (1975–77) అనుభవాలు ఉండి ఉంటాయి. రెండో మాన్యుడు ఎమర్జెన్సీ గురించి విని ఉంటారు లేదా చదివి ఉంటారు, మూడో మాన్యుడు, తాను నిర్వహిస్తున్న పదవి రీత్యా అత్యవసర పరిస్థితి చరిత్రను చదివి ఉంటారు.

1967లో ఒక మామూలు ఆస్తి వివాదం చరిత్ర సృష్టించింది. అది గోలక్‌నాథ్ వెర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్’. ఈ కేసులో సుప్రీంకోర్టు మెజారిటీ తీర్పు (6:5) వెలువరించింది. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను రద్దు చేసే లేదా తగ్గించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధానాంశం ‘స్వేచ్ఛ’ కాదు, ‘ఆస్తి’. ఈ కారణంగా ఆ చర్చ అప్పటికి సైద్ధాంతిక రూపం తీసుకున్నది.

కేశవానంద భారతి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (1973) కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో కలవరం కలిగించే అంశాలు ఏవీ లేవు. ఇందులోనూ ప్రధాన సమస్య ‘ఆస్తి’. కేరళ భూసంస్కరణల చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. పిటీషనర్ వాదన తిరస్కృతమయింది. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు అధికారమున్నదని సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే రాజ్యాంగ మౌలిక నిర్మాణం లేదా స్వభావాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగ మౌలిక నిర్మాణమేమిటో వివాదానికి తావు లేని విధంగా సుప్రీంకోర్టు పేర్కొంది. సమాఖ్య విధానం, లౌకికవాదం, స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ మౌలిక లక్షణాలు అని నాటి రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించింది. దీన్ని ఎవరు తప్పుపట్టగలరు? పార్లమెంటు, సుప్రీంకోర్టు నిర్ణయాలలో ఏది సర్వోన్నతమైనది అనే అంశంపై చర్చ కొనసాగింది. అయితే గోలక్‌నాథ్ కేసులో వలే కేశవానంద భారతి కేసులో చర్చ అంత సైద్ధాంతిక ఉద్వేగంతో జరగలేదు.

1975 జూన్ 25న అత్యవసర పరిస్థితిని విధించారు. ఇందుకు దారి తీసిన తక్షణ కారణం రాజ్యాంగ సవరణలో పార్లమెంటు అధికారాలతో సంబంధం లేని ఘటన. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అది. సుప్రీంకోర్టులో ఇందిర తరపున వాదించేందుకు నానీ పాల్ఖీవాలా అంగీకరించారు. క్రమబద్ధమైన విచారణలో అయితే పాల్ఖీవాలా తన కక్షిదారుకు న్యాయాన్ని సాధించడంలో సఫలమయివుండేవారనడంలో నాకు సందేహం లేదు. అయితే కీలక రాజ్యాంగ సవరణలతో సహా కొన్ని ఘటనలు వడివడిగా సంభవించాయి. అవి భారత్‌ను నియంతృత్వ వ్యవస్థగా మార్చివేశాయి.

ఆ పరిస్థితుల్లో భారత ప్రజాస్వామ్యానికి ఏకైక రక్షణ న్యాయవ్యవస్థ. నిజం చెప్పాలంటే ప్రజల హక్కులను రక్షించడంలో న్యాయవ్యవస్థ విఫలమయింది. సుప్రీంకోర్టు చరిత్రకు ఏ మాత్రం ప్రతిష్ఠాకరం కాని తీర్పు ఎడిఎమ్ జబల్పూర్ కేసులో వెలువడింది. దేశ పౌరులకు రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛా హక్కులపై దాడిని జస్టిస్ హన్స్‌రాజ్ ఖన్నా మాత్రమే వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండడానికి తిరస్కరించిన హైకోర్టు న్యాయమూర్తులు కొంత మంది ఉన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జెఎస్ వర్మ, జస్టిస్ ఆర్‌కె టాంకా వారిలో ప్రముఖులు. 1967–77 సంవత్సరాల మధ్య దేశ చరిత్రను ధన్‌ఖర్, బిర్లా, రిజిజులు చదివే ఉంటారని నేను భావిస్తున్నాను. రెండు భిన్న విషయాలను ధన్‌ఖర్ కలగలిపివేశారు. రాజ్యాంగంలోని ప్రతీ లేదా ఏదైనా ఒక నిబంధనను పార్లమెంటు సవరించగలదా; ఆ సవరణ న్యాయ వ్యవస్థ సమీక్ష పరిధిలోకి రాదా అన్నది ఒక అంశం. 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సరైనదేనా అన్నది రెండో అంశం. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీసుకున్న నిర్ణయం సరైనదని, జాతీయ న్యాయనియామకాల కమిషన్ చట్టం కేసులో తప్పుడు నిర్ణయం తీసుకున్నదని అభిప్రాయపడేందుకు ఆస్కారమున్నది. నిజానికి న్యాయ శాస్త్ర పండితులు అనేక మంది ఇదే విధంగా అభిప్రాయపడుతున్నారు.

పార్లమెంటు నిర్ణయమే సర్వోన్నతమైనదని గౌరవనీయ ఉపరాష్ట్రపతి చేస్తున్న వాదన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. దురదృష్టవశాత్తు అవి ఒక సమాఖ్య, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా భారత్ భావనను తిరస్కరించేవిగా ఉన్నాయి. న్యాయశాఖ మంత్రి చర్చను మరింత గందరగోళపరుస్తున్నారు. కొలీజియం వ్యవస్థ రద్దు కావాలని ఘోషిస్తున్న మంత్రి మహాశయుడు అందులో ప్రభుత్వానికి కూడా స్థానముండాలని డిమాండ్ చేస్తున్నారు! ‘సమగ్ర పరిశీలన’ పేరిట రాజ్యాంగాన్ని మార్చివేసేందుకు కుటిల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా? రాజ్యాంగ విధులు నిర్వర్తిస్తున్న మాన్యుల వాదనలు మన సమున్నత సంవిధానానికి ప్రమాద ఘంటికలుగా విన్పించడం లేదూ?

న్యాయవ్యవస్థ నిర్ణయాల కంటే పార్లమెంటు నిర్ణయాలే సర్వోన్నతమైనవనే వాదనను అంగీకరించామనుకోండి. జరిగేదేమిటి? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను: జమ్మూ–కశ్మీర్‌లో వలే ఒక రాష్ట్రాన్ని విభజించి, పలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడాన్ని మీరు ఆమోదిస్తారా?; వాక్ స్వాతంత్ర్యాన్ని, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే స్వేచ్ఛను, ఏ వృత్తినైనా ఆచరించే, ఏ వ్యాపారాన్ని అయినా చేసే స్వేచ్ఛను రద్దుచేయడాన్ని మీరు ఒప్పుకుంటారా?; స్త్రీ పురుషులను సమానంగా పరిగణించని, హిందువులు, ముస్లింల పట్ల రాజ్య వ్యవస్థ భిన్న రీతుల్లో వ్యవహరించడాన్ని అనుమతించే, స్వలింగ సంపర్కులకు హక్కులు నిరాకరించే చట్టాలను మీరు ఆమోదిస్తారా?; ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు, జైనులు, బౌద్ధులు, యూదులు, ఇతర మైనారిటీ వర్గాలకు రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులను రద్దు చేయడాన్ని మీరు అంగీకరిస్తారా?; ఏడవ షెడ్యూలు నుంచి రాష్ట్ర జాబితాను తొలగించి, శాసన నిర్మాణాధికారాలు అన్నిటినీ పార్లమెంటుకు అప్పగించడాన్ని మీరు సమ్మతిస్తారా?; ఒక నిర్దిష్ట భాషను యావద్భారతీయులు తప్పనిసరిగా నేర్చుకుతీరాలనే ఆదేశాన్ని మీరు పాటిస్తారా?; నేరారోపణకు గురైన ప్రతీ వ్యక్తి అమాయకుడుగా నిరూపణ కానంతవరకు అతడిని అపరాధిగా భావించాలని నిర్దేశిస్తున్న చట్టాన్ని మీరు అంగీకరిస్తారా?

పార్లమెంటు నేడు అటువంటి చట్టాలు చేయదు, చేయలేదు. చేసినా వాటిని సమీక్షించి తిరస్కరించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉన్నది. ఇందుకు భిన్నంగా ‘పార్లమెంటరీ పూర్ణాధిపత్యం, న్యాయవ్యవస్థ సంయమనం’ సిద్ధాంతం కింద అటువంటి చట్టాలపై న్యాయ సమీక్ష జరగదు. న్యాయస్థానాలు వాటిని కొట్టివేస్తాయి. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడి యాభై సంవత్సరాలు అయింది. అయినా ఆ తీర్పు ఇప్పటికీ భారత్‌ను ఒక భూతంలా వెన్నాడుతుందని, దేశ పురోగతికి ఆటంకమవుతుందని అభివర్ణిస్తున్నారు. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చడానికి వీలులేదని స్పష్టం చేసిన ఆ సమున్నత తీర్పు మన దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజలను కాపాడే దేవత అని నేను సునిశ్చితంగా విశ్వసిస్తున్నాను.

Leave a Reply