నవ్వులు మిగిల్చి… వెళ్లిపోయాడు!

0
353

మీ నాన్న పేరేంటి’ అంటే అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్‌.. సీట్‌ ఇచ్చేస్తారా సార్‌?(దిల్‌)
నల్ల బాలు.. నల్ల తాచు లెక్క.. నాకి చంపేస్తా(సై),
మహేశ్‌ నందా అందగాడు ఆఫ్‌ పెదవాల్తేరు’ (ఛత్రపతి),
నిప్పు నాగరాజు అంటే గోదావరి ట్రైన్‌ గడగడలాడతాది’(వెంకీ)
పైసల్‌ రాలే! ట్రైమ్‌ బ్యాడ్‌ ఉంటే ఏదీ వర్కవుట్‌ కాదక్క..(లక్ష్మీ)

సిటీ కాలేజ్‌ ‘గులాబ్‌ సింగ్‌’ ఉండగా మీకేం భయం లేదు.. (అతనొక్కడే).. ఇలా హాస్యనటుడు వేణుమాధవ్‌ చెప్పిన ప్రతి డైలాగ్‌ ప్రేక్షకుల చేత నవ్వులు పూయించింది. థియేటర్‌ దద్దరిల్లేలా చప్పట్లు కొట్టించింది. ఇప్పుడా నవ్వుల వేణగానం మూగబోయింది. తెలుగు తెరపై తనదైన శైలి హాస్యాన్ని పండించిన వేణుమాధవ్‌ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి తెలుగు చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచారు. గత కొద్దిరోజులుగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6న సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌ మీద ఉంచి చికిత్స అందించారు. చివరికి బుధవారం మధ్యాహ్నం 12.21 నిమిషాలకు వేణుమాధవ్‌ కన్ను మూశారు. సూర్యపేట జిల్లా కోదాడలో 1968 సెప్టెంబర్‌ 28న జన్మించిన ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేణుమాధవ్‌ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మిమిక్రీ ఆర్టి్‌స్టగా కెరీర్‌ ప్రారంభించిన వేణుమాధవ్‌ ‘సంప్రదాయం’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. 600లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పును పొందారు. రుద్రమదేవి ఆయన నటించిన చివరి చిత్రం.

పుట్టినరోజు వేడుకకు దూరం…పుట్టినరోజున కేక్‌ కట్‌ చేసి ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోవడం వేణుమాధవ్‌కు నచ్చేది కాదు. ఓ సారి మాత్రం ఆ రూల్‌ను బ్రేక్‌ చేశారు. ‘జై చిరంజీవ’ షూటింగ్‌ జరుగుతుండగా ఆయన పుట్టిన రోజని తెలిసి చిరంజీవి ప్రత్యేకంగా కేక్‌ తెప్పించి కట్‌ చేయించారు. వేణుకు సేవాగుణం ఎక్కువ. పుట్టినరోజున చేసే ఖర్చును కోదాడలో మిత్ర బృందంతో కలిసి పేదల ఆకలి తీర్చడం కోసం ఉపయోగించేవారు. పలు అనాధ శరణాలయాల్లో, ఆసుపత్రుల్లో పళ్లు పంచేవారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన పుట్టినరోజు తనకెంతో ప్రత్యేకమని వేణుమాధవ్‌ చెబుతుండేవారు.

పవన్‌తో ఒప్పందం..వేణుమాధవ్‌ సంపాదించిన డబ్బుతో తన సొంతూరులో పది ఎకరాల పొలం కొని వ్యవసాయం చేసేవారు. అలా సాగు చేసిన బియ్యంతో ఓ బస్తా తనకు ఎంతో ఇష్టమైన పవన్‌కల్యాణ్‌ ఇంటికి పంపేవారు. అలాగే పవన్‌ వ్యవసాయక్షేత్రంలో పండిన మామిడిపళ్లను వేణుకు పంపేవారట. ఇదీ వీరిద్దరి మధ్యనున్న ఒప్పందం.

అచ్చి‘ వచ్చిన ‘కృష్ణ’ నిలయం1995లో ఆకృతి కల్చరల్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన ఓ సభలో వేణు మాధవ్‌ చలాకీతనం చూసి రచయిత దివాకర్‌బాబు, అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి సినిమాల్లో యాక్ట్‌ చేస్తావా? అనడిగారట. ‘సినిమాల్లో యాక్ట్‌ చెయ్యడం మనకు తెల్వది’ అని సమాధానం చెప్పిన వేణుని ఏదోలా ఒప్పించి ‘సంప్రదాయం’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పటి వరకూ వెయ్యి రూపాయలకు మిమిక్రీ చేసే ఆయన ఒక్కసారిగా రూ.70,000 పారితోషికం అందుకున్నారు. ఎస్‌.వి.కృష్ణారెడ్డి ఆయన్ని హాస్య నటుడిగా పరిచయడమే కాకుండా ‘హంగామా’ సినిమాతో హీరోని కూడా చేశారు. వారిద్దరి మీదున్న అభిమానంతోనే వేణుమాధవ్‌ తన ప్రతి ఇంటికి ‘అచ్చి’ వచ్చిన ‘కృష్ణ’ నిలయం అని పేరు పెట్టుకున్నారు.

నిర్మాతగా రెండు చిత్రాలు…అప్పటి వరకూ చిన్నచిన్న పాత్రలతో ఆకట్టుకున్న వేణుమాధవ్‌కు పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘తొలిప్రేమ’ మంచి బ్రేక్‌ ఇచ్చింది. అందులో ఆర్నాల్డ్‌ శేఖర్‌గా తనదైన శైలి వినోదాన్ని పంచి అలరించారు. ఆ తర్వాత కమెడీయన్‌గా డిమాండ్‌ పెరిగింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు ‘తొలిప్రేమ’, దిల్‌’, సై’, సినిమాలతో తన కెరీర్‌ మలుపు తిరిగిందనీ, అప్పటి వరకూ వైట్‌రైస్‌లా ఉండే తన జీవితం బిర్యానీలా మారిందని ఆయన అంటుండేవారు. ఆ తర్వాత ‘తమ్ముడు’, ప్రియమైన నీకు’, నువ్వే నువ్వే’, వెంకీ’, ఆర్య’, ఛత్రపతి’, జై చిరంజీవా’, పోకిరి’, రణం’, కృష్ణ’, నేనింతే’, కిక్‌’ చిత్రాల్లో హాస్య నటుడిగా విభిన్న పాత్రలు పోషించి థియేటర్లలో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించారు. ఈ చిత్రాలన్నీ ఆయన కెరీర్‌కు మైలురాళ్లుగా నిలిచాయి. 2006లో వచ్చిన ‘లక్ష్మీ’లో టైగర్‌ సత్తి పాత్రతో అలరించిన ఆయనకు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం వరించింది. కమెడియన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే ‘ప్రేమాభిషేకం’, ‘భూకైలాస్‌’ చిత్రాలతో నిర్మాతగా మారారు. ఆ రెండు చిత్రాలూ నష్టాన్నే మిగిల్చాయి.

ఎన్టీఆర్‌ నేతి దోశలు పెట్టారు!ఓసారి ఎన్టీఆర్‌ ఇంట్లో పని చేస్తుండగా ఉదయం ఏడు గంటలు అయినా హాల్‌లో లైట్‌ ఆపలేదని వేణుమాధవ్‌ మీద కోప్పడ్డారు. ఓ సందర్భంలో చెయ్యి చేసుకున్నారు కూడా! దానితోపాటు ఆ రోజు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశాన్ని కూడా నిలిపేశారు. అదే రోజు మళ్లీ వేణుమాధవ్‌ను ఇంటికి పిలిచి నేతి దోశలు పెట్టారు. మళ్లీ అలాంటి తప్పు జరగకుండా చూసుకోమని మందలించారట. తనని అంకుల్‌ అని పిలిచే నారా లోకేశ్‌, బ్రహ్మణి, కేటీఆర్‌, హరీశ్‌రావు అంటే వేణుమాధవ్‌కి కోపమట.

 స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌..ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు వేణుమాధవ్‌. మిత్రుల సలహాతో చివరి క్షణంలో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

దేవుడు చిన్నచూపు చూశాడు! వేణుమాధవ్‌ అకాల మరణం నన్ను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. నాతో తొలిసారి ‘మాస్టర్‌’లో నటించాడు. తర్వాత చాలా చిత్రాల్లో కలిసి నటించాడు. కొన్ని పాత్రలు తనకోసమే పుట్టాయన్నంతగా నటించి, ఆ పాత్రలకు వన్నె తీసుకొచ్చేవాడు. హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. వయసులో చిన్నవాడు. చిత్ర పరిశ్రమలో తనకింకా బోలెడంత భవిష్యత్‌ ఉందనుకునేవాణ్ణి. కానీ, ఆ దేవుడు చిన్న చూపు చూశాడు. వేణుమాధవ్‌ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ… తన ఆత్మకు శాంతి చేకూరలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.’’

చిరంజీవి

వారం క్రితమే కలిశా వేణుమాధవ్‌ మా కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడు. నన్ను బావా అనీ, జీవితను అక్క అనీ పిలిచేవారు. ప్రతి పండక్కి తప్పకుండా ఫోన్‌ చేసి విష్‌ చేసేవాడు. మేమంటే తనకు అంత అభిమానం, ప్రేమ. నాతో పది చిత్రాల్లో నటించాడు. ‘మనసున్న మారాజు’, రాజసింహం’, ఒక్కడు చాలు’, గోరింటాకు’ చిత్రాల్లో తన నటనకు, హాస్యానికి మంచి పేరు వచ్చింది. చిత్రసీమలో ప్రతి ఒక్కరినీ వరుసలు పెట్టి పిలుస్తూ కుటుంబంలా కలుపుకుని వెళ్లేవారు. గత వారం తను హాస్పటల్‌లో ఉంటే వెళ్లి కలిశాను. సోమవారం డిశార్జ్‌ అయ్యారు. మళ్లీ సీరియస్‌ అయితే మంగళవారం హాస్పటల్‌లో చేరారు. ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళతాడునుకోలేదు. అందరినీ ఎన్నో ఏళ్లుగా నవ్వించి నవ్వించి ఈ రోజు ఏడిపిస్తున్నారు. వేణుమాధవ్‌ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు’’

రాజశేఖర్‌

Courtesy Andhrajyothi…

Leave a Reply