మతోన్మాదుల కుట్రలలో రామోజీపేట !

0
283
టి.స్కైలాబ్‌ బాబు

ఉన్మాదం తలకెక్కితే బుద్ధి మోకాళ్ళ కిందికి జారుతుందటాడు మహనీయుడు పెరియార్‌ రామస్వామి. సరిగ్గా రామోజీపేటలో అదే జరిగింది. మరో కారంచేడు పునరా వృతమైంది. పసిపిల్లలు, వద్ధులు స్త్రీలు, పశువులు, నీళ్ల పంపులు, బైక్‌లు తలుపులు కిటికీలు ఏది వదలలేదు. మహిళల రైకలు చింపారు, రాయలేని బూతులు తిట్టారు. దసరా పండుగ రోజు కదా అని ఆడబిడ్డలు పండుగ కోసం వస్తే, అల్లుండ్లపై కూడా దౌర్జన్యం చేశారు.12 బైక్‌లను ధ్వంసం చేశారు. 9మంది దళితుల తలలు పగిలాయి. మరికొంత మందికి కనిపించని దెబ్బలు తగిలాయి. చంపుతారనే భయంతో ఒకే గదిలో 30మందిని కుక్కారు. వద్ధులు ఉరకలేక పొలాల్లో పత్తి చేనుల్లో, కట్టెల మధ్యలో దాక్కున్నారు. మీ కొడుకులను బయటకు పంపండి చంపుతాం అని తల్లులను బెదిరించారు. కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, లక్ష్మిమ్‌పేట, వేంపెంట అఘాయిత్యాలు మానవ మగాలు చేసిన దుర్మార్గం. రామోజీపేట సంఘటన వాటిని మరిపించింది.
రామోజీపేటలో అసలు అర్థరాత్రి అలజడి ఎందుకు రేగింది? దాని వెనుక సూత్రధారులెవరు? అనే విషయాలను పరిశీలిద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో 150 వరకు ఒక సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలుండగా, 35 దళిత కుటుంబాలున్నాయి.

అన్ని కుటుంబాలూ అన్నదమ్ముల్లా ఐక్యంగా ఉండే ప్రశాంత గ్రామం అది. ఆరేండ్ల క్రితం ఆ గ్రామంలో కొంత మంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి గ్రామంలో ప్రశాంతత చెదిరింది. గ్రామంలోని దళితుల్లో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన విద్యావంతులు ఉన్నారు. కొంత భూమి కలిగి ఉండి గతంలో రిజర్వేషన్‌తో దళితుడు సర్పంచ్‌ కూడా అయ్యాడు. ప్రస్తుతం ఉపసర్పంచ్‌ కూడా దళితుడే ఉన్నాడు. దీనిని బీజేపీ పెత్తందారులు ఓర్వలేక పోయారు.

గత ఆరేండ్ల్ల కిందటనే ఈ ఘర్షణకు పెత్తందారులు బీజం వేశారు. అంబేద్కర్‌ విగ్రహం పెట్టుకుంటామని ఊరి చౌరస్తాలో దళితులు భూమి పూజ చేసుకున్నారు. అదే స్థలంలో శివాజీ విగ్రహం పెడతామని దళితులతో ఘర్షణకు దిగారు. దీంతో దళితులు 10మందిపై నాడే కేసుపెట్టారు. అంబేద్కర్‌ విగ్రహంతోపాటు మహాత్మాపూలే విగ్రహం కూడా పెడితే బాగుంటుందని దళితులు సూచించారు. నాటి నుంచి దళితులపై కక్ష్య పెంచుకున్నారు. సెప్టెంబర్‌ 4న దళితవాడలో ఒక వద్ధుడు మరణించగా అంతక్రియల్లో వాళ్ళు ఉండగా దొంగచాటుగా బీజేపీ యువకులు శివాజీ విగ్రహాన్ని పెట్టడానికి సిద్ధమయ్యారు. దీంతో మళ్ళీ ఘర్షణ జరిగింది. అప్పటినుంచి దళితులను పరోక్షంగా కులం పేరుతో అవమానించడం, డైరీ వద్ద పాలు పోసే దగ్గర భూతులు తిట్టడడం చేశారు.

చివరికి ”మేము అంబేద్కర్‌ విగ్రహం పెట్టనివ్వం, దాని స్థానంలో ఛత్రపతి శివాజీ విగ్రహం పెడతాం” అంటూ గ్రామ సర్పంచ్‌ భర్త బొప్పరి భూమయ్య, ఇంకా మొండయ్య, కాట్ల రాజు అనే వ్యక్తులు అంబేద్కర్‌ విగ్రహం పెట్టడాన్ని అడ్డుకున్నారు. పెద్దలు కలుగజేసుకుని దీనికి పరిష్కారంగా అంబేద్కర్‌ విగ్రహంతో పాటు ఆయన గురువు పూలే విగ్రహం కూడా పెట్టడానికి ఇరు వర్గాలను అంగీకరింపజేశారు. కానీ తర్వాత ఒక సామాజిక వర్గానికిచెందినవారు మాట తప్పి అంబేద్కర్‌ విగ్రహం పెట్టడానికి వీలు లేదని అడ్డం తిరిగారు. ఇది కుల పోరుగా మారింది. దీంతో పరోక్షంగా కుల బహిష్కరణ చేశారు. దళితులతో మాట్లాడినా, పనికి పిలిచినా రూ.5000 జరిమానాతోపాటు చెప్పుదెబ్బలు కొట్టాలి అని తీర్మానించారు. ఈ కుల బహిష్కరణ వ్యవహారం పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. పోలీసువారు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించివేశారు.
బొడ్రాయి దగ్గర పూజ చేయడానికి దళిత ఉప సర్పంచ్‌తో పాటు మరి కొందరు దళితులు వెళితే కొబ్బరికాయ కొట్టకుండా పూజ చేయనీయకుండా అడ్డుకున్నారు. ”అందర్నీ నరికి తగలబెట్టి పోతాం” ”ఒక్కడిని చంపినా అదే కేసు, వందమందిని చంపినా అదే కేసు” అని దాడికి తెగబడ్డారు. అదేసమయంలో అక్కడికి పోలీసులు చేరుకోవడంతో పారిపోయారు.

ఇక ఇప్పుడు విచిత్రం ఏమిటంటే దాడి చేసిన వారే మాపై దళితులు దాడి చేశారని పోలీస్‌ స్టేషన్లో కేసలు పెట్టారు. దళితులు దసరా పండుగ రోజు డీజే పెట్టి దాండియా ఆడుతుంటే ఓర్వలేకపోయారు. అప్పటికే వాళ్ళ డీజే నడుస్తున్నది. సర్పంచ్‌ వారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో గ్రామంలో పెత్తనం చెలాయించ గలుగుతున్నారు. దీంతో మీరు డీజే పెట్టొద్దు మాకు సౌండ్‌ వస్తుందని డీజే ఆపేయ్యండని బెదిరించారు. ఆ తర్వాత పిఎస్‌కు సర్పంచ్‌ ఫోన్‌ ద్వారా పిర్యాదు చేశాడు. దళితుడైన ఉపసర్పంచ్‌కు పిఎస్‌ నుంచి ఏఎస్‌ఐ కాల్‌ చేసి బంద్‌ చెరు అనగానే బంద్‌ పెట్టారు. అనంతరం రెచ్చిపోయిన పెత్తందారులు పథకం ప్రకారం కర్రలు ఇనుప రాడ్లు, కారంపొడి, ఇటుకపెడ్డలు ఏదీదొరికితే దానితో ఒక్కరొక్కరుగా 100మందికి పైగా రాత్రి గం.11.15ని.ల సమయములో దళితవాడపై పడ్డారు. వద్ధులు, పసిపిల్లలు, మూగజీవులైన గేదెలను కూడా వదలకుండా చితకబాదారు. గంట సేపు ఏ ఇల్లు వదలకుండా ధ్వంసం చేశారు. ఎంతకాలనికైనా తిరుపతి, మధులను చంపుతామని హెచ్చరించి వెళ్లిపోయారు.

బండి సంజరు ఎంపీ కావడంతో గ్రామంలో భయానక వాతావరణం ప్రారంభమైంది. బీజేపీ మండల అధ్యక్షులు బందెన తిరుపతిరెడ్డి తరుచూ గ్రామానికి వస్తూ రెచ్చగొట్టే సందేశాలు ఇవ్వడంతో ఇది మరింతగా తీవ్రమైంది. అరాచకులు బీజేపీ ప్రోద్బలంతో మరింత ఊగిపోయారు. అసలు ఈ సంఘటనకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. ఈ సంఘటనపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి. గ్రామంలో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలి. గాయాలపాలైన దళితులకు మెరుగైన వైద్యం అందించాలి. నష్టపోయిన కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసుతోపాటు హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. పౌరహక్కుల పరిరక్షణ చట్టం1955 ప్రకారం గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల మధ్య ఐక్యత తీసుకురావాలి. గ్రామంలో తిరిగి ఐక్యత కోసం ఈ మతోన్మాద అల్లరి మూకలను కట్టడి చేయాలి. జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీలు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలి.

Leave a Reply