ప్రజాస్వామ్యం ఖూనీ!

0
192
  • ప్రజా సమస్యలను లేవనెత్తేవారిపై దాడులు చేసి జైళ్లలోకి తోస్తున్నారు
  • దేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు
  • నలుగురు వ్యక్తుల నియంతృత్వం ఉంది
  • కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ధ్వజం

న్యూఢిల్లీ : ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వంటి సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ గళమెత్తింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ నాయకులందరూ నల్లని దుస్తులు, చేతికి నల్లని బ్యాండ్లు ధరించి వీధుల్లో ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీలో నిరసనలకు దిగిన రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, జైరాంరమేశ్‌, శశిథరూర్‌ సహా వందలాది మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి ఆరుగంటల పాటు నిర్బంధించారు. వీరిలో 65 మంది ఎంపీలు ఉన్నారు. సాయంత్రం 7 గంటలకు వారిని కింగ్స్‌ వే క్యాంపు పోలీస్‌ స్టేషన్‌ నుంచి విడుదల చేశారు. ధరల పెరుగుదల, దేశ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం ఇచ్చేందుకు శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు భవనం నుంచి రాష్ట్రపతి భవన్‌ దాకా ర్యాలీగా వెళ్తామని, ప్రధాని నివాసాన్ని ఘెరావ్‌ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. ఉదయం ప్రతిపక్షాల నిరసన ధ్వనుల మధ్య పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడ్డ తర్వాత  కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ నేతలతో కలిసి నల్లదుస్తులతో  పార్లమెంట్‌ నుంచి బయటకు ఊరేగింపుగా రావడంతో ఈ నిరసన ప్రదర్శన ప్రారంభమైంది.

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు ఆ పార్టీ ఎంపీలందరూ కలిసి పార్లమెంటు ప్రాంగణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఇతర మహిళా ఎంపీలు పార్లమెంటు భవనంలోని ఒకటో నంబర్‌ గేటు వద్ద బ్యానర్లు పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం సోనియా మినహా మిగతా ఎంపీలంతా రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరారు. నిత్యావసరాలపై విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని నినదిస్తూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌ ఎంపీలను ఢిల్లీ పోలీసులు విజయ్‌చౌక్‌ వద్ద అడ్డుకున్నారు. నగరంలో 144 సెక్షన్‌ అమలవుతోందంటూ.. రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, అధీర్‌ రంజన్‌ చౌధురీ, గౌరవ్‌ గొగోయ్‌ సహా పలువురిని అదుపులోకి తీసుకుని తరలించారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడిన రాహుల్‌.. ‘‘ధరల పెరుగుదలపై నిరసన తెలపడానికి మేమిక్కడికి వచ్చాం.

కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎంపీల్లో కొందరిని పోలీసులు కొట్టారని రాహుల్‌ ఆరోపించారు. విజయ్‌ చౌక్‌ వద్ద తమ నిరసన తాలూకూ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన రాహుల్‌.. ‘‘ప్రజాస్వామ్యం ఒక జ్ఞాపకం’’ అంటూ దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదన్న అర్థం వచ్చేలా శీర్షిక పెట్టారు. నిరసన కార్యక్రమం చేపట్టే ముందు.. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాహుల్‌.. ప్రజాసమస్యలపై గళమెత్తినవారిపైన, నియంతృత్వ పాలనకు ఎదురునిలిచినవారిపై దారుణంగా దాడి చేసి జైల్లో తోస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు. నలుగురు వ్యక్తుల నియంతృత్వమే ఉంది’’ అని మండిపడ్డారు. కాగా, ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రియాంక గాంధీ నిరసనకు దిగారు. పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డంగా పెట్టిన బారికేడ్లను దూకి మరీ అక్కడికి వెళ్లిన ఆమె.. రోడ్డుపైనే కూర్చుని నిరసన తెలిపారు.

జంతర్‌ మంతర్‌ ప్రాంతంలో తప్ప ఢిల్లీ అంతటా 144 సెక్షన్‌ అమల్లో ఉందని, కాబట్టి అక్కణ్నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినా ప్రియాంక తన నిరసన కొనసాగించారు. దీంతో.. నాటకీయ పరిణామాల నడుమ పోలీసులు ఆమెను  ఈడ్చుకుంటూ వ్యాన్‌ లోకి తోశారు. కాగా.. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం ఢిల్లీ పోలీసు యాక్ట్‌ కింద 65 మంది ఎంపీలు సహా మొత్తం 335 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీలోనే కాక మహారాష్ట్ర, గోవా, హరియాణా, అసోం తదితర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.

కాంగ్రెస్‌ నిరసనలు.. రామమందిరానికి వ్యతిరేకమనే సందేశం: అమిత్‌ షా
న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, నిరుద్యోగానికి నిరసనగా కాంగ్రెస్‌ చేపట్టిన దేశవ్యాప్త నిరసనలపై కేంద్ర మంత్రి అమిత్‌ షా స్పందించారు. గత ఏడాది ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని.. అదేరోజు నిరసనలు తెలపడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ తాము రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకమన్న సందేశాన్ని ఇస్తోందని ఆయన ఆరోపించారు. తద్వారా.. (మైనారిటీలను) బుజ్జగించే విధానాన్ని కాంగ్రెస్‌ కొనసాగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విధానం అటు దేశానికి.. ఇటు కాంగ్రె్‌సకూ మంచిది కాదని హితవు పలికారు.

Leave a Reply