ఈవీఎం, వీవీప్యాట్‌లపై ఈ సీఐఎల్‌ తప్పుదోవ!

0
223

కాంట్రాక్ట్‌ సిబ్బందితోనే తయారీ
ఇంజినీర్లని చెప్పాలని ఆదేశం
పెదవి విప్పిన కాంట్రాక్ట్‌ సిబ్బంది

హైదరాబాద్‌, ఆగస్టు: గత సార్వత్రిక ఎన్నికల్లో ఈసీఐఎల్‌ రూపొందించిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై సర్వత్రా చెలరేగిన విమర్శలకు మరింత బలాన్నిస్తూ.. అప్పుడు పనిచేసిన కొంతమంది ఇంజనీర్లు, డిప్లమా హోల్డర్లు తాజాగా పెదవి విప్పారు. ఆనాడు వీటి రూపకల్పనలో కీలక పాత్ర పోషించినది తామేనని, అయితే తమను కాంట్రాక్ట్‌ పద్ధతిలోనే తీసుకున్నారు తప్ప పూర్తిస్థాయి ఉద్యోగులుగా కాదని వారు ‘ది క్వింట్‌ ’ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘టీ అండ్‌ ఎమ్‌ కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ సర్వీసెస్‌’ అనే సంస్థ తరఫున తాము పనిచేసినట్లు చెబుతూ- ఈసీఐఎల్‌ అధికారులు మాత్రం తమను ‘ఈసీఐఎల్‌ సిబ్బందిగానే బయటకు చెప్పాలి తప్ప కాంట్రాక్ట్‌ సిబ్బందిగా కాదని’ ఆంక్ష పెట్టినట్లు వెల్లడించారు.

జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా 2018లోనే తాము చేరామని, ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై తమకు ఇచ్చినది మాత్రమే కేవలం ప్రాథమిక అంశాలపై శిక్షణ మాత్రమేనని, టైమ్‌ను ఫిక్స్‌ చేయడం, ఈవీఎంల మరమ్మతు … మొదలైనవి మాత్రమేనని తెలిపారు. అయినప్పటికీ ఈ మెషీన్లు ఎలా పనిచేస్తాయన్నది తమకు అవగతమయ్యేదని వారు పేర్కొన్నారు. మొత్తం ఈవీఎంలను కాంట్రాక్ట్‌ సిబ్బందే తయారు చేశారని, ఈసీఐఎల్‌ ఉద్యోగులు అసలు వేలుపెట్టలేదని వారు స్పష్టం చేశారు. వీవీప్యాట్‌ల చెకింగ్‌ అరకొరగా సాగిందని, ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌ (ఎఫ్‌ఎల్‌సీ)లో కనీసం 96 ఓట్లను చెక్‌ చేయాల్సి ఉండగా కనీసం 75 కూడా చేయలేదని, అనేక ఇతర లోపాలనూ టీఅండ్‌ ఎం అధికారులు, ఈసీఐఎల్‌ అధికారులు విస్మరించారని వారు బయటపెట్టారు. ‘‘ఇది ఎన్నికల ప్రక్రియకే దెబ్బ. కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకున్న ఇంజినీర్లు ఈవీఎంలు ఎలా పనిచేస్తాయో, వాటి డిజైనింగ్‌ ఏమిటో బయటకు లీక్‌ చేయగలరు. కొందరు ఇంజినీర్లు సొంతంగా ఈవీఎంలు తయారు చేసెయ్యగలరు. ఈ తీరున ఈసీఐఎల్‌లోనే తయారైన వాటికి, బయటివాటికి తేడా ఉండదు. ఈసీకి ఇది తెలియజెప్పినా పట్టించుకోలేదు’అని ఓ ఇంజినీరు పేర్కొనడం విశేషం.

ఇవీ తేలాల్సిన ప్రశ్నలు

  1. ఆథరైజ్ట్‌ సిబ్బందే ఈవీఎంలను, వీవీప్యాట్‌లను తయారు చేశారని ఈసీ ఎందుకు సుప్రీంకోర్టు సహా  అందరినీ తప్పుదోవ పట్టించింది? కాంట్రాక్ట్‌ సిబ్బంది లేనేలేరని ఎందుకు బుకాయించింది?
  2. స్వల్పకాలిక పద్ధతిన ఇంజినీర్లను తీసుకున్నట్లు ఎందుకు ఈసీ వెల్లడించలేదు?
  3. ఈవీఎంలను సరిగా తయారీ లేదా మరమ్మతు చేయడం రాని కాంట్రాక్ట్‌ సిబ్బందికి ఎందుకు వాటిని  అందుబాటులో ఉంచి- పనిచేయించింది

వీటిపై ఈసీని ప్రశ్నించినట్లు అది ఈసీఐఎల్‌కు సంబంధించిన వ్యవహారమని, వారు ఎవరికి సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చారన్నది తమకు అనవసరమని బదులిచ్చింది. అయినా ఈవీఎంలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, లోపరహితమని పేర్కొంది.

కాగా- ఈసీఐఎల్‌ 2019లో కాంట్రాక్ట్‌ పద్ధతిన (టీ అండ్‌ ఎం ద్వారా) వారందరినీ రెండు నెలల కిందట తొలగించింది. ఫలితంగా దాదాపు 190 మంది ఇంజినీర్లు ఇపుడు రోడ్డున పడ్డారు. లాక్‌డౌన్‌ సమయంలోనే వారికి నోటీసులిచ్చి వేరే ఉద్యోగాలు చేసుకోమని చెప్పినట్లు కొందరు క్వింట్‌ వెబ్‌సైట్‌ ప్రతినిధికి చెప్పారు. విశేషమేమంటే..‘ఇంజినీర్లు కావాలి.. ఏడాది అనుభవం ఉంటే చాలు’అనే మరో ప్రకటనను తాజాగా వెలువరించారని కూడా వారు పేర్కొన్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply