- 91 కేసులతో అగ్రస్థానానికి.. కర్నూలు 84
- గుంటూరులో ఆర్‌ఎంపీ, వలంటీర్‌కూ..
- సెంచరీ దిశగా గుంటూరు, కర్నూలు
- 50 కేసులు దాటేసిన నెల్లూరు
- రాష్ట్రంలో ఒకేరోజు 24 మందికి వైరస్
- మొత్తం 429కి చేరిన కరోనా కేసులు
కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 24 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 429కి చేరింది. ఈ వైరస్ తీవ్రతకు గుంటూరు జిల్లా గిలగిల్లాడుతోంది. తాజాగా 16మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లాలో కేసుల సంఖ్య 91కి పెరిగిపోయింది. దీంతో అత్యధిక కరోనా కేసుల జాబితాలో నిన్నటి వరకూ మొదటి స్థానంలో ఉన్న కర్నూలును వెనక్కునెట్టిన గుంటూరు టాప్‌కి చేరింది. తాజాగా నిర్ధారణ అయిన కేసుల్లో అధికారులు ఏడింటిని ధ్రువీకరించారు. ఇందులో గుంటూరు నగరానికి చెందిన ఐదుగురు ఉన్నారు. ఇప్పటికే కరోనా బారిన పడిన డాక్యుమెంట్ రైటర్ పక్కింటి వ్యక్తికి(వలంటీర్) కూడా వైరస్ సోకింది. పొన్నూరులో ఓ ఆర్‌ఎంపీకి పాజిటివ్ వచ్చింది. రెండురోజుల క్రితం కరోనా నిర్ధారణ అయిన మాజీ సైనికుడికి చికిత్స చేయడంతో ఆయనకూ వ్యాధి సంక్రమించింది. వాస్తవానికి ఢిల్లీ సమావేశాల నుంచి వచ్చిన వారితో కానీ, విదేశీ వ్యక్తులతో గానీ ఆ సైనికుడికి నేరుగా సంబంధాలు లేకపోవడం గమనార్హం. వీరుకాకుండా జిల్లాలో మరో 9మందికి పాజిటివ్ రాగా వీరిలో గుంటూరులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు, నరసరావుపేటలో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. ఈ తొమ్మిది కేసుల వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో మరో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నెల్లూరు నగరంలో 3, వాకాడు మండలంలో ఒకటి ఉన్నాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 52కు పెరిగింది. టీపీ గూడూరు మండలంలోనూ మరో పాజిటివ్ కేసు నమోదైందని ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ప్రకటించలేదు.
చిత్తూరు జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. రేణిగుంట మండలానికి చెందిన యువకుడు(28) ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గతనెల 24న ఢిల్లీ నుంచి విమానంలో చెన్నై చేరుకుని అక్కడనుంచి వేర్వేరు వాహనాల్లో స్వగ్రామం వచ్చారు. గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వడమాలపేట మండలంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయారు. ఆయన వచ్చిన విమానంలో ప్రయాణించిన కొందరు వైరస్ బారిన పడినట్టు సమాచారం అందడంతో సహ ప్రయాణికులందరికీ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నుంచి ఆదేశాలందాయి. దీంతో అధికారులు అతడిని ఈ నెల 9న తిరుపతిలోని పద్మావతి నిలయం క్వారంటైన్‌కు తరలించారు. నమూనాలు ల్యాబ్‌కు పంపగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లాలో మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య 84కు చేరింది. కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన వృద్ధుడి(65)కి కరోనా సోకింది. ఢిల్లీ వెళ్లి వచ్చి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఈయనకు కూడా వ్యాధి సంక్రమించింది.
విజయవాడలో ముగ్గురు డిశ్చార్జి
విజయవాడ కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు పూర్తిగా కోలుకోవడంతో వైద్యాధికారులు ఆదివారం సాయంత్రం వారిని డిశ్చార్జి చేశారు. వీరిలో మక్కా వెళ్లొచ్చిన విజయవాడకు చెందిన వృద్ధుడు ఒకరు, గుంటూరుకు చెందిన దంపతులు ఉన్నారు.
పెరుగుతున్న కరోనా మృతులు
గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన వ్యక్తి కరోనాతో మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. గుంటూరుకు చెందిన వృద్ధుడు(72) కరోనాకు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఢిల్లీ వెళ్లి రావడం ద్వారా ఇతనికి వైరస్ సోకింది. కాగా, కొవిడ్-19 బారినపడి చికిత్స పొందుతున్న విజయవాడకు చెందిన వ్యక్తి(55) ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ఈయన మరణాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. విజయవాడ కోవిడ్ ఆస్పత్రిలోనే ఐసీయూలో చికిత్స పొందుతున్న మరో కరోనా అనుమానితుడు కూడా ఆదివారం మృతి చెందారు. ఆయనకు సంబంధించిన వైద్య పరీక్షల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇదిలాఉండగా, కరోనా సోకి చెన్నైలో చికిత్స పొందుతున్న నెల్లూరు డాక్టర్ పరిస్థితి విషమించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్య వర్గాల ద్వారా తెలిసింది.
ఇక్కడ నెగెటివ్.. అక్కడ పాజిటివ్
ప్రకాశంలో పది రోజుల క్రితం ఓ వ్యక్తి స్వా బ్‌ను పరీక్షలకు పంపించగా ఫలితం నెగిటివ్ వచ్చింది. నెల్లూరుకు చెందిన అతను టీవీ మెకానిక్‌గా పనిచేస్తూ ఒంగోలులో నివాసం ఉంటున్నాడు. ఇతను నాలుగు రోజుల క్రితం నెల్లూరు వెళ్లాడు. అక్కడ జ్వరం రావడంతో క్వారంటైన్‌కు తరలించి నమూనాలు పరీక్షలకు పంపించారు. ఇప్పుడు అతనికి పాజిటివ్ అని తేలింది. అతనికి ప్రకాశం జిల్లాలో వైరస్ అంటుకుందా, నెల్లూరు వెళ్తుండగా మార్గమధ్యంలో సోకిందా అనే దిశగా వివరాలు సేకరిస్తున్నారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు…
జిల్లా పాజిటివ్ డిశ్చార్జి
గుంటూరు 91 1
కర్నూలు 84 –
నెల్లూరు 52 1
ప్రకాశం 41 1
కృష్ణా 35 6
కడప 31 –
పశ్చిమగోదావరి 22 –
చిత్తూరు 21 1
విశాఖపట్నం 20 4
తూర్పుగోదావరి 17 1
అనంతపురం 15 –
మొత్తం 429 15
Courtesy Andhrajyothi