కరోనా కార్చిచ్చులో పాడిపంటలు

0
203

డాక్టర్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు

కరోనా అవస్థల నుంచి అన్నదాతలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులకు కూలీలు, మార్కెటింగ్‌ ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేయాలి. రేపు ఖరీఫ్‌ పంటలు ఇళ్లకు చేరే నాటికి అన్ని రకాల పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరలకు ఖరీదు చేయాలి. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలి. ఈ-నామ్‌ వ్యవస్థని బలోపేతం చేసి రాష్ట్రాల మధ్య సులభతర వాణిజ్యం పెంచాలి.

కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని కుప్ప కూల్చింది. జన జీవితాల్ని తలకిందులు చేసింది. విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, సాంకేతిక, ఐటీ వంటి రంగాలన్నింటినీ సంక్షోభంలోకి నెట్టింది. కరోనా ముందు, కరోనా తర్వాత అన్నట్లుగా సమాజ పరిస్థితుల్ని మార్చేసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతి రంగాన్ని, ప్రతి ఒక్కరినీ కరోనా కాటేసింది. కరోనా బాధితులు, పీడితులు కానివారంటూ ఎవరూ మిగలకుండా విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. పాడి, పౌల్ట్రీ, ఆక్వా రంగాలు పడకేశాయి. అసలే సాగు సంక్షోభాగ్నిలో చిక్కి ఛిద్రమవుతున్న రైతన్నలు మరింతగా విలవిల్లాడుతున్నారు. విత్తనం వేయడానికి, చేతికొచ్చిన పంటని కోయడానికి కూలీలు దొరకక… మార్కెట్‌కి వెళితే కొనేవారు, మద్దతు ధర లేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్య పంట ఆశాజనకంగా పండిందన్న ఆనందం మిగలకుండా ప్రతి రైతునూ మార్కెటింగ్‌ ఇబ్బందులు వెంటాడుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం మార్చి 22న లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి రైతుల కష్టాలు రెట్టింపు అవుతూ వచ్చాయి. తొలిగా ఈ ప్రభావం ఉద్యాన రైతులపై పడింది. వేసవిలో చేతికివచ్చే పండ్లు, కూరగాయల ధరలు అమాంతం పడిపోయాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలతో ఎక్కడికక్కడే మార్కెట్లు మూతపడి, అంతః రాష్ట్ర రవాణా నిలిచిపోయి, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతులు ఆగిపోయి… మామిడి, బత్తాయి, పుచ్చ తదితర పండ్లకి గిరాకీ పడిపోయి కొనేవారు లేక కర్షకులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఉత్తరాదికి ఎగుమతులు లేక మామిడి, బత్తాయి వ్యాపారం కుదేలైంది. చేతికి వచ్చిన పంటని ఎక్కడ విక్రయించాలో తెలియక రైతులు తోటల్లోనే కాయలని వదిలేశారు. రబీలో సాగు చేసిన వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ తదితర పంటలు సాగు చేసిన రైతులూ అప్పులపాలయ్యారు. అవసరమైనమేర కొనుగోలు కేంద్రాలులేక, మద్దతు ధరకి కొనేవారులేక బక్క రైతులు అయినకాడికి విక్రయించాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలించి పంట బాగా పండిందన్న సంతోషం ఏ రైతుకూ మిగలకుండా కరోనా నడ్డి విరిచింది. గోరుచుట్టుపై రోకటి పోటులా ఏప్రిల్‌, మే మాసాల్లో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానకి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిరప, మొక్కజొన్న రాశులు తడిసిపోగా ఉద్యాన తోటల్లో కాయలు నేలరాలాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నికర సాగు భూమి 109.60 లక్షల హెక్టార్లు. ఇందులో ఆహార ధాన్యాల విస్తీర్ణం 75 లక్షల హెక్టార్లు. ఒక్క వరి పంట వాటానే 40 లక్షల హెక్టార్ల పైమాట. 70 శాతం వరి పంట ఒక్క ఖరీఫ్‌ సీజన్‌లోనే పండుతుంది. ఆ తర్వాతి స్థానం పత్తిదే. ఖరీఫ్‌ సీజన్‌లో సాగయ్యే పంటల్లో వరి, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న పైర్లవి మూడొంతుల వాటా. తెలంగాణలో నూతనంగా అందివచ్చిన ప్రాజెక్టుల కారణంగా నిరుడు ఖరీఫ్‌లో కోటి ఎకరాలకి పైగా విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. వరి సుమారు 27 లక్షలు, పత్తి 45 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 70 లక్షల ఎకరాల్లో తెల్ల బంగారం సాగు చేయించాలని సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా తొలకరి నుంచి పలకరిస్తున్న వర్షాల కారణంగా ఈ ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్‌ పంటల సాగు పెరిగింది. అనేక ప్రాంతాల్లో సకాలంలో విత్తనం పడింది. అయితే ఎప్పటిలాగే కొన్నిచోట్ల విత్తనాలు, ఎరువులకి కొరత ఏర్పడింది. ఈ ఆటంకాలని పక్కన పెడితే కరోనా దెబ్బతో పెట్టుబడి ఖర్చులు రెట్టింపయ్యాయి. ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది. కరోనా పేరు చెప్పి ఎవరికి వారే విపరీతంగా ధరలు పెంచేశారు. విద్యుత్‌ మోటార్లు, సూక్ష్మ సేద్య పరికరాలు, పైపులు, రవాణా ఛార్జీలు, మరమ్మతులు, విత్తనాలు, ఇతర ఉత్పాదకాల ధరలు అన్నదాతలకి భారంగా మారాయి. ఏటా కంటే ఈసారి ప్రతి పంట సాగు వ్యయం రైతులకి తడిసి మోపెడయింది. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చులూ మండిపోయాయి. ఫలితంగా ట్రాక్టర్ల బాడుగ, రవాణా కిరాయి ధరలని పెంచేశారు. ఎవరిని కదిపినా కరోనా సాకుతో ధరలు పెంచేయడం సాధారణమైపోయింది. పైగా కూలీలు వెతుక్కోవడం, పొలాలకి తరలించడం సాగుదారులకి తలకి మించిన భారంలా పరిణమించింది. ఈ ఇబ్బందులు పడలేక… చాలాచోట్ల కౌలు రైతులు ఈసారి సాగుకి దూరంగా జరిగారు.

కరోనా లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి రైతులకి కూలీల కొరత ఏర్పడింది. పరిమిత వేళలు, గుంపులుగా వెళ్లరాదన్న ఆంక్షలతో కూలీల సమస్య పెరిగింది. ఒకవైపు పనులు లేకపోయినా మరోవైపు రవాణా సమస్యలు, కరోనా భయాందోళనల దృష్ట్యా పనులకి రావడానికి కూలీలు వెనకంజ వేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పంట కోతలు, నూర్పిళ్లపై పడింది. రైతులు సకాలంలో వరి, మిరప కోతలు, కలుపు తీతలు పూర్తి చేయలేకపోయారు. పంట మీద వచ్చే ధరకంటే కూలీలకే అధికంగా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితులతో కొన్ని ప్రాంతాల్లో పత్తి, మిరప పంటలని కోయకుండా విడిచిపెట్టారు. జూన్‌ 8 నుంచి అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైనా కూలీల ఇబ్బందులు మాత్రం తొలగిపోలేదు. రోజురోజుకూ తీవ్రమవుతున్న కేసుల కారణంగా పనులకి రావడానికి కూలీలు భయపడుతున్నారు. ఖరీఫ్‌లో ప్రధాన పంటల విత్తనం వేయడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఒకవేళ పనులకి వచ్చినా అధిక కూలి డిమాండ్‌ చేస్తుండడంతో రైతులకి దిక్కు తోచడం లేదు. ఇటు ఉత్పాదక ఖర్చులు పెరిగి అటు కూలీల ధరలు అధికమై… సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు.

మహమ్మారి కరోనా సేద్యాన్నే కాదు వ్యవసాయ అనుబంధ రంగాలనూ కాటేసింది. పంట తర్వాత అండగా నిలిచే పాడిపై తీవ్ర ప్రభావం చూపింది. పాల విక్రయ ధరలు అమాంతం పడిపోయాయి. విద్యాలయాలు, హోటళ్లు, వసతి గృహాలు, మిఠాయి దుకాణాలు, టీ కొట్లు వంటివి మూతపడిన కారణంగా పాలకి గిరాకీ తగ్గి… డెయిరీలు సేకరణ కుదించాయి. ఆపై లీటరు పాలకి చెల్లించే ధరలు తగ్గిస్తూ వచ్చాయి. దీని పర్యవసానం పాడి రైతులపై పడింది. అటు దాణా ఖర్చులూ పెరగడంవల్ల… పాడిపైనే ఆధారపడి జీవనాధారం సాగించే కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. ఆవు, గేదె పాల ధరలు లీటరుకు పది రూపాయల వరకు తగ్గిపోయి పశు పోషకులకు పాడి గిట్టుబాటుకాకుండా పోయింది. ఇక కరోనా ప్రబలిన తొలినాళ్లలో కుదేలైన పౌల్ట్రీ రంగం కాస్త కోలుకుంది. గుడ్డు ఎగుమతులు తగ్గినా ప్రస్తుతం లోకల్‌ వినియోగం పెరగడం రైతులకి ఊరటనిచ్చే పరిణామం. అయితే మొక్కజొన్న తదితర దాణా ధరలకి రెక్కలువచ్చి పౌల్ట్రీ షెడ్ల నిర్వహణ ఇబ్బందిగానే ఉంది. అటు మత్స్య పరిశ్రమ ఏటికి ఎదురీదుతోంది. చేపలు, రొయ్యలు, చేపల అమ్మకాలు, ఎగుమతులు, ధరలు పతనమయ్యాయి. ఏటా రమారమి 16 వేల కోట్ల విదేశీ ఆదాయంతో దేశానికి ఆక్వా హబ్‌గా ఉన్న ఏపీలో రొయ్యల వ్యాపారం క్షీణించింది. ఎగుమతులపైనే నడిచే వనామీ కౌంట్‌ ధరలు పడిపోయి మత్స్య సాగుదారులు లబోదిబోమంటున్నారు.

కరోనా సెగ వాణిజ్య, సుగంధ ద్రవ్యాల ఎగుమతులకూ తాకింది. దక్షిణాసియా సహా ఆఫ్రికా, ఐరోపా దేశాలకి వెళ్లే పంటల ఎగుమతులు దారుణంగా దిగజారాయి. ముఖ్యంగా పొగాకు, పసుపు, మిరప పంటల ఎగుమతి పతనమై, దేశీయ మార్కెట్లలో ధరలు నేలకూలాయి. ఫలితంగా ఈ ఏడాది పసుపు, మిరప పంటలకు అనుకున్నంతగా ధరలు దక్కలేదు. పంటని బట్టి క్వింటా రూ.2 వేల నుంచి రూ.5 వేల దాకా ధరలు పడిపోయాయి. మిరప, పసుపు, పొగాకు పంటలపై నమ్మకంపెట్టుకున్న లక్షలాది రైతుల ఆశలు అడియాసలయ్యాయి. నిజామాబాద్‌, గుంటూరు, దుగ్గిరాల మార్కెట్లతోపాటు పొగాకు వేలం కేంద్రాలకు పసుపు, మిర్చి, పొగాకు తెచ్చిన రైతులు నానా కష్టాలుపడిన ఘటనలు కోకొల్లలు.

అసలే సాగు రంగం అంపశయ్యపై ఉంది. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మాత్రం మారలేదు. గిట్టుబాటు ధర దేవుడెరుగు కనీస మద్దతు ధర అన్నది నేటికీ ఎండమావే. ఇలాంటి సాగు రంగాన్ని కరోనా మరింతగా దెబ్బతీసింది. అన్నదాతల జీవితాలను పెనం మీద నుంచి పొయ్యిలోకి నెట్టింది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక పాకేజీలు, రుణ వితరణ పథకాలు, సాయాలేవీ రైతులని ఆదుకోలేక పోయాయి. పెద్ద నేతల హామీలు కంటి తుడుపు చర్యలుగానే మిగిలిపోయాయి. ఇప్పట్లో కరోనా నుంచి ఏ దేశం, ఏ రంగం, ఏ వ్యవస్థ కోలుకునేటట్లు కనిపించడం లేదు. ఇలాంటి ప్రతికూల, ప్రత్యేక పరిస్థితుల్లో అన్నదాతలని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు రైతులకి కూలీలు, మార్కెటింగ్‌ ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేయాలి. రేపు ఖరీఫ్‌ పంటలు ఇళ్లకు చేరే నాటికి అన్ని రకాలపంటలకి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరలకి ఖరీదు చేయాలి. అలాగే వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలి. కూలీల కొరత తీవ్రంగా వేధిస్తున్న ఈ తరుణంలో ఇప్పటికైనా ఉపాధి హామీని సాగుకి ఉపయోగపడేలా చేయాలి. ఈ-నామ్‌ వ్యవస్థని బలోపేతం చేసి రాష్ట్రాలమధ్య సులభతర వాణిజ్యం పెంచాలి. సరకు రవాణా అడ్డంకులు లేకుండా.రైతు తాను పండించిన ప్రతి గింజనూ సులభంగా మార్కెటింగ్‌ చేసుకునే ఏర్పాట్లు చేయాలి. పత్తి, మిరప, పసుపు, పొగాకు పంటల ఎగుమతులకి కేంద్రం కృషి చేయాలి. ఇక కరోనా విజృంభిస్తున్న వేళ ఊరట కలిగించే విషయం ఏదైనా ఉందంటే అది వర్షాలే. సీజన్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు మంచి వానలు కురిశాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, ప్రకాశం, కాటన్‌ బ్యారేజీలు నిండుకుండలా మారాయి. ముంపు ముప్పుని మినహాయిస్తే… కరవు తీరేలా, చెరువులు నిండేలా సాధారణానికి మించిన వర్షాలు పొలాలని తడిసి ముద్దయ్యేలా చేశాయి. రెండు పంటలకు నీటి ఎద్దడిలేకుండా జలవనరులు నిండాయి.

చైర్మన్, రైతునేస్తం ఫౌండేషన్

Courtesy Andhrajyothi

Leave a Reply