వీధినపడుతున్నారు

0
282

– వీధి వ్యాపారుల్ని దారుణంగా దెబ్బకొట్టిన లాక్‌డౌన్‌
– బేరాలులేక తల్లడిల్లిపోతున్న కుటుంబాలు
– వేధిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి
– నగదు బదిలీ పథకం అమలుజేయాలి : రాజకీయ విశ్లేషకులు

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ అమలు వీధి వ్యాపారుల జీవితాల్ని తలకిందులు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో సుమారుగా 3లక్షల మంది వీధి వ్యాపారాలున్నారు. దేశవ్యాప్తంగా వందకు పైగా నగరాల్లో వీరి సంఖ్య కోట్లలో ఉంది. ఇప్పుడు వీరి కుటుంబాల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. కరోనా వైరస్‌ భయాలు రోజు రోజుకీ పెరగటంతో, అమ్మకాలు జరిగే పరిస్థితి కనపడటం లేదు. మరోవైపు ప్రజలు పెద్ద సంఖ్యలో నగరాలను వదిలిపోతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేసాక పరిస్థితి మారుతుందని ఆశించిన వీధి వ్యాపారుల ఆశలు వమ్మయ్యాయి. ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై, కోల్‌కతా, పూణె…దాదాపు అన్ని నగరాల్లో తమ భవిష్యత్తు ఎంటో అర్థం కావటం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. ఆదుకునేవారి కోసం ఎదురుచూస్తున్నారు.

భారతదేశంలో 108కిపైగా నగరాల్లో వీధి వ్యాపారుల ఒక రోజు టర్నోవర్‌ రూ.80కోట్లు. పట్టణాల్లో రిటైల్‌ వ్యాపారానికి వీరే ఆయువు పట్టు. సాధారణ ప్రజల నిత్యావసర అవసరాలను తీర్చడంలోనూ ముఖ్యపాత్ర వీరిదే. వీటన్నింటికంటే ముఖ్యమైనది, సగటున ఒక వీధి వ్యాపారి మరో ముగ్గురికి ఉపాధి చూపిస్తున్నాడు. పేదలు, మధ్య తరగతికి అందుబాటు ధరల్లో వస్తువులు, ఆహార పదార్థాలు లభ్యమవుతున్నాయంటే దానికి కారణం వీధి వ్యాపారాలే. తెల్లవారిలేచించి మొదలు…అర్ధరాత్రి వరకూ వీరి సేవలు అందుబాటులో ఉండటాన్ని నగరాల్లో మనం నిన్నమొన్నటివరకూ చూశాం. అయితే లాక్‌డౌన్‌, కరోనా సంక్షోభం వీధి వ్యాపారాన్ని కకావికలం చేసింది.

నగర జీవనం సాధారణంగా ఉన్నప్పుడే వీరి వ్యాపారాలు సాగుతాయి. ఎప్పుడైతే నగరాలన్నీ కరోనా గుప్పిటచిక్కి బితికుబితుకు మంటున్నాయో, అప్పట్నుంచీ వీధి వ్యాపారుల ఆదాయం పూర్తిగా దెబ్బతిన్నది. మహిళా వీధి వ్యాపారుల్లో 97శాతం తమ ఉపాధిని కోల్పోయారని ఒక అధ్యయనం పేర్కొంది. లాక్‌డౌన్‌ ఎత్తేసాక కూడా తమ వ్యాపారాలు కొనసాగటం లేదని వారు చెప్పారు. అమ్మకాలు లేక రుణాల ఊబిలోకి వెళ్లిపోతున్నారు. ఇది ముందు ముందు భీకరమైన మానవ సంక్షోభానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీరిని ఆదుకోవటంపై కేంద్రం దృష్టిసారించాలని వారన్నారు. ఉపాధి కోల్పోయిన వారికి నగదు బదిలీ పథకం వర్తింపజేయాల్సిన అవసరముందంటున్నారు. ఇలాంటి వారికోసం ఢిల్లీ ప్రభుత్వం రూ.5వేల కోట్ల సహాయ ప్యాకేజీ ప్రకటించింది. రూ.10వేలు పెట్టుబడి సాయంగా అందజేస్తామంటున్నారు. తద్వారా 50లక్షలమంది లబ్దిపొందే అవకాశముందని ఢిల్లీ ప్రభుత్వం చెబుతున్నది.

Courtesy Nava Telangana

Leave a Reply