‘కటింగ్‌’ కోసం బార్బర్లకు వేడుకోలు

0
256

లాక్‌డౌన్‌తో 25రోజులుగా తెరుచుకోని సెలూన్‌లు
జులపాల జత్తు, మాసినగడ్డంతో పుంగవుల అవస్థలు
పరస్పరం ‘కత్తెర్లు’.. పిల్లలకు ట్రిమ్‌ చేస్తున్న పేరెంట్స్‌
బాబ్బాబు కాలానీకి రావా అంటూ బార్బర్లకు వేడుకోలు

హైదరాబాద్‌: ఇస్త్రీ చేసిన ప్యాంటు, చొక్కా ధరించి.. నీటుగా టై కట్టుకొని.. పాలీష్‌ చేసిన షూ వేసుకొన్నా చెట్టంత మనిషిలో మునుపటి ఆ ఠీవీ కనిపించడం లేదు! లోపం వెతికేందుకు భూతద్ధం అవసరం లేదు.. పైకి తెలుస్తూనే ఉంది.. బాగా పెరిగి చిందరవందరగా కనిపిస్తున్న జట్టు.. మాసిన గడ్డం మహా చికాకు పరుస్తోంది. లాక్‌డౌన్‌ దాకా తెరుచుకోవని తెలిసినా ఏమో తెరుస్తారేమో.. ‘కట్‌’ మనిపిస్తే ఓపనైపోదూ అంటూ ఆశగా సెలూన్ల వైపు చూస్తున్న కళ్లు! కాలం గడుస్తూనే ఉంది… జట్టు, గడ్డం పెరిగిపోతూనే ఉంది. సెలూన్లు మాత్రం తెరుచోవడం లేదు.

ఇలా రాష్ట్రంలో పురుష పుంగవులకు లాక్‌డౌన్‌తో పే..ద్ద ‘చిక్కొచ్చి’పడింది. లాక్‌డౌన్‌ను మే 3 దాకా పొడిగించడంతో ఇంకెన్నాళ్లు.. ఈ అవస్థ ఉంటూ జట్టు గోక్కుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. ఎన్నడూ తమకు తాము షేవింగ్‌ చేసుకోవడం అలవాటు లేనివాళ్లు.. తప్పనిసరి పరిస్థితుల్లో సొంతంగా క్షవరం చేసుకుంటూ బ్లేడ్‌ గాట్ల బాధను భరిస్తున్నారు. కొందరేమో పరస్పరం కటింగ్‌లు చేసుకుంటున్నారు. పిల్లలకు తల్లిదండ్రులే కటింగ్‌లు చేసేస్తున్నారు.

పాత రోజులు గుర్తుకు తెస్తూ కత్తెర్లు, కత్తులు ఇతర సరంజామా పట్టుకుని క్షురకులు ఇళ్ల వద్దకే వస్తున్నారు. కాలనీకి బార్బర్‌ రావడమే బంగారం అన్నట్టుగా క్షవరం చేయించుకునేందుకు వాళ్ల ఎదుట క్యూ కడుతున్నారు. కాలనీలు, అపార్ట్‌మెంట్‌లకు బార్బర్లను నేరుగా పిలిపించుకుని, డిజైన్ల జోలికి వెళ్లకుండా సాధారణ కటింగ్‌, షేవింగ్‌లు చేయించు​కుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరికి కటింగ్‌ చేస్తూ సంక్షోభ సమయంలో నాయీ బ్రాహ్మణులు కూడా సేవలందిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. చాలా చోట్ల వారి ఫోన్‌ నంబర్లు తీసుకుని ఒకరి ద్వారా మరొకరి ఇస్తూ వారితో అపాయింట్‌మెంట్లు కూడా బుక్‌ చేసుకుంటున్నారు.

Courtesy Andhrajyothy

Leave a Reply