కరోనా దెబ్బకు 3 కోట్ల ఉద్యోగాలు పోయారు

0
309

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్నది. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న అమెరికాలో ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. కరోనా సంక్షోభం కారణంగా మే నెలలో కొత్తగా 80 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన మూడు నెలల్లో దాదాపు మూడు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 2.5 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు. అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య 20 శాతానికి చేరుతుందని అంచనా. పెద్ద వయసున్నవారిలో దాదాపు సగానికి తక్కువ మంది మాత్రమే ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పునరుద్ధరిస్తున్నా ఆర్థిక సంక్షోభం కారణంగా కొత్త వారిని ఉద్యోగంలోకి తీసుకునే స్థితిలో సంస్థలు లేవు. చరిత్రలో తొలిసారి..

అమెరికా చరిత్రలోనే మునుపెన్నడూ ఈ స్థాయిలో ఉద్యోగాలు పోలేదు. 2008-2009 మహా సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయినవారి కంటే ప్రస్తుతం జాబ్‌లు కోల్పోయిన వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు అధికం. అప్పటి నిరుద్యోగ శాతంతో పోల్చితే ప్రస్తుతం అది రెట్టింపు సంఖ్యలో ఉంది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువ శాతం మంది తాత్కాలికంగానే తాము నిరుద్యోగులుగా ఉంటామని భావిస్తున్నారు.

వాస్తవానికి మూడింట ఒక వంతు మంది ఉద్యోగాలు శాశ్వతంగా కోల్పోయినట్టే. కోటి మంది కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడమో లేదా సంబంధం లేని ఇతర రంగాల్లో అవకాశాల కోసమే ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆంక్షలు ఎత్తివేశాక సంస్థలు నియామకాలు చేపట్టే అవకాశం ఉందనీ, అయినప్పటికీ సాధారణ పరిస్థితులు రావాలంటే చాలాకాలం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 1.7 కోట్ల మంది ఉద్యోగాలు తిరిగి పొందే అవకాశాలున్నాయని ప్రముఖ కన్సల్టింగ్‌ సంస్థ ఒకటి అభిప్రాయం వ్యక్తం చేసింది. మార్చి మధ్యకాలం నుంచి అమెరికాలో 4 కోట్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారంతా కొత్తగా ఉద్యోగాలు కోల్పోయిన వారు కాదు.

Courtesy Nava Telangana

Leave a Reply