– హైకోర్టుల్లో కేసుల పరిష్కారం 50శాతమే !
– 70శాతం తగ్గిన జిల్లా కోర్టుల సేవలు
– భౌతిక విచారణకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపిన సుప్రీం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా న్యాయ సేవలపై కోవిడ్-19 గణనీయ ప్రభావం చూపింది. అన్ని రకాల కోర్టుల్లో న్యాయ సేవలు దాదాపు స్తంభించిపోయాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తోన్న ‘నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్’ లెక్కల ప్రకారం హైకోర్టుల్లో కేసుల పరిష్కారం 50 శాతం పడిపోగా, జిల్లా స్థాయి కోర్టుల్లో 70 శాతం పడిపోయాయి. గ్రిడ్‌లో సుప్రీం కోర్టు డాటా అందుబాటులో లేదు. అయితే లీగల్ ఆర్కైవ్స్ వెబ్‌సైట్ ‘సుప్రీం కోర్టు అబ్జర్వర్’ కథనం ప్రకారం 2018, ఏప్రిల్ నెల నాటికి సుప్రీం కోర్టు 10,586 కేసులను, 2019లో ఏప్రిల్ నెలనాటికి, 12,084 కేసులను పరిష్కరించగా, 2020, ఏప్రిల్ నెల నాటికి కేవలం 355 కేసులను మాత్రమే పరిష్కరించగలిగింది. గత ఏడాది దేశంలోని హైకోర్టు లలో 16.03 లక్షల కేసులు పరిష్కారంగాకాగా, ఈ ఏడాది ఆగస్టు 31నాటికి 4.63లక్షల కేసులు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. నెలవారీ సగటు కేసుల సంఖ్య గత ఏడాది 1.3లక్షలుకాగా, ఈఏడాది అది 66వేలకు పరిమితమైంది.
లాక్‌డౌన్‌తో మొదలు..
మార్చి 24వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో హఠాత్తుగా కోర్టుల కార్యకలా పాలు కూడా నిలిచిపోయాయి. ఆ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు అత్యవసర కేసుల విచారణ చేపట్టి, మిగితా కేసుల విచారణ పెండింగ్‌లో పడేసింది.. ఆ తర్వాత కేసుల్లో భౌతిక విచారణను పక్కకు పెట్టి వీడియో కాన్ఫరెన్స్ విచారణను చేపట్టింది. ఈ విషయంలో హైకోర్టులు కూడా సుప్రీం కోర్టునే అనుసరించాయి. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్ప్ విచారణలను పక్కకుపెట్టి భౌతిక విచారణను ప్రారంభించాలని హైకోర్టులు నిర్ణయించాయి. అయితే అసోం హైకోర్టు సిబ్బంది అందుకు సమ్మతించడం లేదు. ఏదేమైనా సెప్టెంబరులో న్యాయస్థానాల కార్యకలాపాలు పుంజుకోవాలని సుప్రీంకోర్టు భావిస్తున్నది. భౌతిక విచారణకు సంబంధించి మార్గనిర్దేశకాల్ని విడుదలచేసింది.
జిల్లా కోర్టులన్నీ దాదాపు బంద్
కరోనా మహమ్మారి కారణంగా జిల్లా స్థాయి కోర్టులన్నింటి ముందు గేట్లు మూతపడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను పేర్కొంటూ, ‘ఫలానా తేదీ వరకు కోర్టు కార్యకలాపాలు సాగవు’ అనే బ్యానర్ ప్రదర్శించారు. 2019లో కింది స్థాయి కోర్టులు కోటీ 48 లక్షల కేసులు పరిష్కరించాయి. ఈ ఏడాదిలో ఆగస్టు 31నాటికి 44లక్షల కేసుల్లో తీర్పు వెలువడింది. ప్రతినెలా సగటున 12లక్షలకుపైగా కేసులు పరిష్కారంకాగా, ఈఏడాది ప్రతినెలా సగటు కేవలం 3.67లక్షల కేసులకు పరిమితమైంది. ఈ లెక్కన కింది స్థాయి కోర్టుల్లో న్యాయ సేవలు 70శాతం తగ్గుదల కనపడుతున్నది. దేశంలో జిల్లా కోర్టులు మార్చి 28 నుంచి ఆగస్టు 28వ తేదీ మధ్య 12 లక్షల కేసులకుపైగా పరిష్కరించాయని, ఇదో మైలురాయని ‘సుప్రీంకోర్టు ఇ-కమిటీ’ వెబ్‌సైట్ ప్రారంభోత్సవంలో డి.వై.చంద్రచూడ్ తెలిపారు. ఆయన చెబుతున్న గణాంకాలకు, నేషనల్ జుడీషియల్ డాటా గ్రిడ్ విడుదల చేసిన గణాకాలకు చాలా తేడా కనపడుతున్నది.
జిల్లా, తాలూకా కోర్టుల్లో..
ఏడాది పరిష్కారమైన కేసుల సంఖ్య
2016లో 1,03,18,982
2017 1,25,40,616
2018 1,32,14,184
2019 1,48,08,855
2020 44,15,544
(ఆగస్టు 31నాటికి)
Courtesy Nava Telangana