-కరోనా కట్టడిలో కార్పొరేట్లా..!
– స్పెయిన్, ఐర్లాండ్‌లో కోవిడ్ వచ్చాక వైద్యరంగం జాతీయం
– ప్రణాళికలేని లాక్‌డౌన్.. సత్వరనిర్ణయంలేకనే వైరస్ పంజా
– మరణాలు పెరుగుతున్నా.. మత్తులో మోడీ సర్కార్
కోవిడ్..19 వైరస్ విజృంభించటానికి ముందే మోడీ సర్కార్ మేల్కొలేదు. ప్రణాళికలేని లాక్‌డౌన్ వల్ల వలసకార్మికులు మొదలుకుని దేశఆర్థికవ్యవస్థ చెల్లాచెదురైంది. మహమ్మారి పంజా విసరటంతో అమాయకజనం ప్రాణాలు పోతుంటే.. కార్పొరేట్ గ్రూపులకు కరోనా కట్టడి చర్యలు అప్పగించటం ఎంతవరకు సమంజసం.. అని రామన్ మెగాసెస్ అవార్డు గ్రహీత, ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ కేంద్రాన్ని నిలదీశారు. లాక్‌డౌన్ అనంతర పరిస్థితులపై ఓ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే..
ప్రశ్న : కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం అమలుచేసిన ప్రణాళికలేని లాక్‌డౌన్ విధించి నెలలు గడిచాయి. జులై సగం రోజులు గడిచిపోతుండగా.. కరోనా మాంద్యం, మహమ్మారి, లాక్‌డౌన్ వీటివల్ల జరిగిన అనర్థాలేంటీ..?
సాయినాథ్ : ఇతర దేశాలు నేర్చుకుంటున్న… లేదా ఇతర దేశాల నుంచి నేర్చుకోవలసిన పాఠాలకు పూర్తి విరుద్ధమైన పనులను కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఉదాహరణకు… స్పెయిన్, ఐర్లాండ్‌ను తీసుకుందాం. కోవిడ్ వచ్చిన వెంటనే… వాళ్లు చేసిన మొదటిపని వైద్య రంగాన్ని జాతీయం చేయటం. కరోనా విపత్తు నుంచి బయటపడ్డాక.. దానిని మళ్ళీ ప్రయివేటీకరణ చేస్తారేమో తెలీదు కానీ… ప్రస్తుతానికి జాతీయం చేశారు. 80శాతం ప్రయివేటు ఆస్పత్రుల బెడ్లను కోవిడ్‌కు వాడుకోవచ్చని చెప్పడానికి మన ప్రభుత్వానికి రెండు నెలలు పట్టింది. కోవిడ్‌కు ముందు బడ్జెట్ చూసుకుంటే… జిల్లా స్థాయి ప్రభుత్వ ఆస్పత్రులను ప్రయివేటు మేనేజ్‌మెంట్‌కు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. కోవిడ్ తర్వాత ఈ నిర్ణయాన్ని పునరాలోచిస్తారని మనం అనుకుంటాం… కానీ ప్రభుత్వం దానిని మరింత వేగవంతం చేస్తున్నది. కోవిడ్ యుద్ధ గదిలో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఉన్నది. అంటే… కేవలం లాభాలను ఆశించే కార్పొరేట్ గ్రూప్‌ను మహమ్మారితో పోరాడే రూమ్‌లోకి మోడీ సర్కార్ అనుమతించింది. మిగిలివున్న ప్రజావనరులను సైతం ప్రయివేటీకరించే పనులు అతివేగంగా జరుగుతున్నాయి. అయిదుశాతం ప్రయివేటు రైళ్లకు అనుమతి ఇవ్వబోతున్నది. ఒకవేళ ప్రయివేటు రైళ్లే ఉండి ఉంటే… దాదాపు కోటి మంది వలస కార్మికులను తమ తమ ఇండ్లకు చేర్చగలిగే వారా? లేదు. అందుకు ఆస్కారమే లేదు.
విద్యా రంగం విషయానికి వస్తే..
బైజు లాంటి ఆన్‌లైన్ విద్య కంపెనీల స్టాక్స్‌కు చూస్తే.. విషయానికివస్తే.. బిజినెస్ మ్యాగజైన్లలో వారి ఆదాయం.. అవి సంపాదిస్తున్న డబ్బులు చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది. దాదాపు కోటి మంది ప్రభుత్వ విద్యార్థుల గురించి ప్రభుత్వం ఎలాగో పట్టించుకోదు. ఆన్‌లైన్ విద్య వల్ల జరిగేదేంటి? మొదట ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ విద్యార్థులను తీసుకుందాం. వారిలో ఎంత మందికి స్మార్ట్ ఫోన్ ఉంటుంది? ఒక వేళ తల్లిదండ్రులు ఫోన్ తెచ్చి పెట్టినా… దానిని ఎలా వాడాలో మాకే తెలీదు… పిల్లలకు ఎలా నేర్పిస్తామని ప్రశ్నిస్తున్నారు. 15-16 ఏండ్ల పిల్లల వరుకూ ఇదే పరిస్థితి. మహారాష్ట్ర పాల్గర్ (థానే జిల్లాలో భాగంగా ఉండేది) లాంటి ప్రదేశాన్ని తీసుకుంటే… ఆది ఆదివాసీ ప్రాంతం. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్-2018 నివేదిక ప్రకారం… గ్రామీణ మహారాష్ట్రలో ప్రతీ ఆరుగురు వ్యక్తుల్లో కేవలం ఒక్కరికే ఇంటర్నెట్ వాడే సామర్థ్యం ఉంది. మహిళల్లో అది ప్రతి పదకొండు మందిలో ఒక్కరికి మాత్రమే.
ఒకవేళ ఫోన్ ఉన్నా… నెట్‌వర్క్ ఉండదు. పవర్ సప్లరు ఉండదు. ఫోన్ చార్జింగ్ లేకుండా రోజుల తరబడి గడిచిపోతాయి. నిజానికి బెంగాల్లో.. ఒక వ్యక్తి అందరి ఫోన్లను తీసుకొనీ, విద్యుత్ అందుబాటులో ఉన్న దగ్గరకు తీసుకెళ్ళి చార్జింగ్ పెట్టి.. మరుసటి రోజు ఫోన్లు తిరిగి ఇస్తాడు. దీనికి కొంత డబ్బులు వసూలు చేస్తాడు. ఇలా ఓ ప్రొఫెషన్ కూడా మొదలైంది. కాబట్టి కరెంట్ ఉండదు… ఫోన్లు ఖరీదైనవి. పైగా… ఇప్పుడు చౌకగా లభించే చైనీస్ యాప్‌లు, ఫోన్లను నిషేధించారు. ఆ లిమిటెడ్ బ్యాండ్‌విడ్త్‌తో పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింటింగ్ తీసుకునే సౌకర్యాలుండవు. రోజుకి 2జీబీ డేటా కోసం నెలకు రూ.200 కట్టాలి. ఇంకా ఎక్కువ కావాలి అంటే ఖర్చు కూడా ఎక్కువవుతుంది. ఇక్కడ… మనదేశ ప్రాథమిక సమస్య, తీవ్రమైన అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 28-30 ఏండ్ల మన అభివద్ధి మార్గం, నయా ఉదారవాద విధానాలపై సంపూర్ణ అటాప్సీ కోవిడ్-19 ఇచ్చింది.
పీపుల్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (పారి) తరఫున ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కూడా మేము మొదలు పెట్టబోతున్నాం. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న వారి మధ్య కూడా తీవ్రమైన వర్గ తారతమ్యాలున్నాయి. ముంబయిలో పిల్లలకు బ్రాడ్ బ్యాండ్ ఉంది. కానీ విదర్భలో పిల్లలకు ఏ బ్యాండూ లేదు. దీని ప్రభావం ఎలా ఉంటుంది? సంవత్సరాలు గడిచే కొద్దీ… బోర్డు పరీక్షల్లో.. లాతూర్, మరఠ్వాడా, విదర్భ లాంటి ప్రదేశాల నుంచి టాపర్లుగా రావొచ్చేమో.. కానీ, పాస్ శాతం ముంబయిలో ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ముంబయి విద్యార్థులు ఎక్కువ తెలివైన వారని కాదు. బ్రాడ్‌బ్యాండ్, 24 గంటల నెట్‌వర్క్ వాళ్లకు అందుబాటులో ఉండటమే కారణం. విదర్భలో ప్రతి ఏడూ… పరీక్షల సమయంలో 12-15 గంటల పవర్‌కట్ ఉంటుంది. వాళ్ళు ఎలా చదువుకుంటారు? ఆన్‌లైన్ విద్యను నేను ఎలా చూస్తున్నానంటే.. అది డిజిటల్ డివైడ్ నుంచి డిజిటల్ పార్టిషన్‌గా మారింది. రెండు ప్రపంచాల మధ్య పూర్తి విభజన. దాటకూడని ఓ సరిహద్దు ఏర్పడుతున్నది.
వైద్య రంగంలో రాకెట్ విషయానికొస్తే.. నేను మూడు ఫైవ్‌స్టార్ట్ హాస్పిటళ్ల సమీపంలో నివసిస్తున్నాను. కోవిడ్ పరీక్షలు చేయడానికి ఈ ఆస్పత్రులు రూ.6,500 అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి. స్వాతంత్య్రం సమయంలోనే బోరె కమిటీ జాతీయ ఆరోగ్య విధానం గురించి చెప్పింది. కోవిడ్ వల్ల సంభవించే మరణాల కన్నా ఇతర వ్యాధులతో సంభవించే మరణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాను. ఎందుకంటే… మన దేశంలో అతి పరిమితంగా ఉన్న ప్రతీ ఒక్క వైద్య వనరులను కోవిడ్‌పైనే పెట్టారు. వేరే వ్యాధుల వల్ల చాలా మంది చనిపోతున్నారు. 800 మైళ్ల దూరం నడిచిన వలస కూలీలు డీహైడ్రేషన్‌తో, డయేరియాతో, ఇతర సాధారణ సమస్యలతో చనిపోయారు. ఇక వేరే వ్యాధులతో చనిపోతే… రూ.10,000 లేదా అంతకన్నా ఎక్కువ కట్టకుండా మెడికల్ సర్టిఫికెట్ తీసుకోలేరు. ఎందుకంటే పోస్టుమార్టం చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెత్ సర్టిఫికెట్ ఇవ్వరు. ఇక పోస్టుమార్టం చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. మదన్ కుమార్ అనే నా క్లాస్‌మేట్ చనిపోయాడు. దేనివల్ల చనిపోయాడో తెలీదు. కోవిడ్ లక్షణాలేమీ లేవు. అతని మృతదేహానికి అంత్యక్రియలు త్వరగా నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులపై చుట్టుపక్కలవారు ఒత్తిడి చేశారు. డెత్ సర్టిఫికెట్ కోసం వారు తిరిగారు. అసలు ఎందుకు చనిపోయాడో సరైన కారణం తెలీకుండానే అంత్యక్రియలు నిర్వహించేశారు. కాబట్టి హార్ట్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, ఇతర వ్యాధిగ్రస్తులు దీన స్థితిలో ఉన్నారు. ఇదీ ఆరోగ్య పరిస్థితి దుస్థితి.
విద్యా విధానంలో పొంచి ఉన్న ముప్పు..
ప్రయివేటు యూనివర్సిటీలు… పెద్ద పెద్ద బిల్డింగ్‌లు, కాన్ఫరెన్స్‌హాల్‌లు కట్టారు. గవర్నమెంట్ స్కూళ్ల కన్నా 1000 మైళ్ళ ముందు ఉన్నప్పటికీ… ఆన్‌లైన్ విద్యారంగంతో వీళ్లు పోటీలో వెనుకబడ్డారు. భవిష్యత్‌లో టీచర్స్ యూనియన్లు రద్దును చూడనున్నాం. ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోవడం కూడా చూడనున్నాం. ఇక ఫ్రీలాన్స్ లెక్చరర్లను తెచ్చే ప్రయత్నాలు యూనివర్సిటీలు చేస్తాయి. దీనివల్ల విద్యార్థులకు పూర్తి సమయాన్ని అధ్యాపకులను సమకూర్చలేదు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం చూస్తాం. ఈ ప్రక్రియ నుంచి మినహాయింపడిన విద్యార్థులను చేరుకొనే ప్రయత్నం స్వేచ్ఛ లాంటి సంస్థలు చేస్తున్నాయి.
కార్మిక రంగాన్ని తూట్లు పొడిచేలా చట్టాలు
100 ఏండ్లనాటి ప్రామాణిక కార్మికచట్టాలను మార్చటంలో విజయవంతమయ్యాం. 12 నుంచి 8 గంటల పని దినం సాధించాం. ఇది ఓ అద్భుతమైన విషయం. కానీ, బీజేపీ రాష్ట్రాలు… మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో పనిగంటలను 12కు పొడిగించాయి. ఓవర్‌టైం(ఓటీ) కూడా ఇవ్వకుండా యాజమాన్యాలు పనిగంటలు పెంచాయి. రాజస్థాన్ కూడా పనిగంటలను 12కు పెంచింది. కానీ, 4 గంటలు ఓటీ ఇస్తున్నారు. అది కూడా వారానికి 20 గంటలు పని చేస్తేనే ఇస్తారు. అంటే వారమంతా అధికపనిచేస్తేనే ఓటీ ఇస్తారు. అమెరికాలో 8 గంటల పనిదినం ప్రతిపాదన వచ్చిన కొత్తలో దీనికి అంగీకరించిన మొదటి వ్యక్తి హేండ్రి ఫోర్డ్. శ్రామిక వర్గంపై ప్రేమతో కాదు. 8 గంటల వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. ఈ విషయాన్ని ఫోర్డ్ అర్థం చేసుకున్నాడు. ఆయన సమకాలీనులు ఫోర్డ్‌ను విమర్శించారు. ఫోర్డ్ అమలు చేసిన ఏడాది ఆయన ఆస్తులు 34 నుంచి 60 మిలియన్లకు రెట్టింపు అవ్వడం చూసి రెండేండ్ల తర్వాత… 8 గంటల పనిదినాన్ని అందరూ అమలు చేశారు. కనీసం అక్కడ పెట్టుబడిదారీ ప్రయోజనం కోసమే అయినా.. వారికి జ్ఞానోదయమైంది. దేశంలో కార్మికచట్టాలన్నీ ఇప్పుడు అసంపూర్ణంగా ఉన్నాయి. ప్రధాని మోడీ సొంతరాష్ట్రంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయిన గుజరాత్‌ను తీసుకుంటే… వలస కార్మికుల సమస్యలు మొదలవ్వగానే… ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. నయా ఉదారవాద విధానాలతో కార్పొరేట్లవైపు వేస్తున్న అడుగులతో కార్మికరంగం దిక్కుతోచనిస్థితికి చేరుకోనున్నది.
డునాట్ వేస్ట్ ఏ గుడ్ క్రైసిస్ (మంచి సంక్షోభాన్ని వృథా చేయొద్దు) అని విన్‌స్టన్ చర్చిల్ అన్నారు. శేఖర్ గుప్త అనే సీనియర్ ఎడిటర్… తన ఆన్‌లైన్ టీవీలో డునాట్ వేస్ట్ ఏ గుడ్ క్రైసిస్ విన్‌స్టన్ చర్చిల్ పేరు ప్రస్తావించకుండా అన్నారు. దీని అంతరార్థం ఏంటంటే.. కార్మికవర్గం తమ మోకాలిపై ఉండే సమయం ఇది. దోచుకోవాల్సిందంతా దోచుకో అని.
ఆకలి కేకలు వినపడవా..?
దేశంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఆకలి కేకలను మనం చూస్తున్నాం. మిగులు సరుకు ఉన్నదని చెప్పుకునే భారత ప్రభుత్వం… 104 మిలియన్ల టన్నులను విడుదలచేసింది. ఇటీవల ప్రధాని తన ప్రసంగంలో ఉచితంగా ఇచ్చే అయిదు కేజీల బియ్యాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తున్నామని చెప్పారు. ఎంత దయాగుణం… కేవలం జాతీయ ఆహార భద్రతా చట్టం కిందకు వచ్చే వారికి మాత్రమే ఇది వరిస్తుంది. అంటే జనాభాలో 30శాతం మంది ఈ పథకం నుంచి మినహాయించేస్తున్నారు.
అన్నదాతకూ కన్నీరే..
రబీ పంటలను మళ్ళీ పండించమని రైతులపై రాష్ట్రాలు ఒత్తిడి చేస్తున్నాయి. వాణిజ్యపంటలు (క్యాష్ క్రాప్స్) మళ్ళీ పండించటమనేది ఓ కలగా మారబోతున్నది. ఇప్పటికే 80 లక్షల క్వింటాళ్ళ పత్తి పడివున్నది. పత్తి పండించే రాష్ట్రాలు మళ్ళీ ఆ పంటను వేస్తున్నాయి. పంజాబ్, హర్యానా వరి పండించకుండా… పత్తినే వేస్తున్నాయి. వరికి ఎక్కువ నీరు కావాలనే సాకును వారు చెబుతున్నారు. పత్తికి కూడా తక్కువనీరేమీ పట్టదు. సరే.. వరిని వదిలేయండి.. చిరుధాన్యాలను పండించండి. ఒక ఎకరానికి వరికి కావాల్సిన నీళ్ళతో 12-15 ఎకరాల జొన్నలు పండించొచ్చు. ఇంకో దారుణమైన పరిస్థితి ఏంటి అంటే… గత ఏడాది భారీగా పత్తి ఎగుమతి మార్కెట్ ఎవరో తెలుసా? చైనా. 80 లక్షల టన్నుల అమ్ముడుకాని కాటన్ ఉన్నది. కొంత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర, కొంత రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర, కొంత రైతుల దగ్గర ఇంకా జమవుతున్నది. కేవలం మహారాష్ట్ర రైతుల గగ్గరే 30 లక్షల క్వింటాళ్ల పత్తి ఉన్నది. రైతుల నుంచి కొనడానికి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు. పుచ్చకాయ లాంటి పాడైపోయే వాణిజ్య పంటలు పొలాల్లో పాడైపోతున్నాయి. లక్షల క్వింటాళ్ళ చెరుకు పంటలు షుగర్ మిల్స్‌లో ఉన్నాయి. ప్రపంచమంతటా వినియోగ సంక్షోభమున్నది. ఇక మళ్ళీ అవే పంటలు వేస్తే… మీ వస్తువులను ఎవరు కొంటారు? కనీసం సగం ఎకరం అయిన ఆహార పంటలను వేయాలని కిసాన్ సభ ద్వారా ప్రతి రైతునూ నేను విన్నవించుకుంటున్నా. ఎందుకంటే అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం పంటలను పంపిణీ చేయడం లేదు. దీనిని ఖండిస్తూ ఒక్క ఎడిటోరియల్ కూడా రాలేదు.
ఏప్రిల్ మధ్యలో అనుకుంటా… రైస్‌ను ఎథనాల్‌కు మార్చడానికి క్యాబినెట్ అనుమతిచ్చిందని ప్రకటించారు. ఓవైపు కనీవినీ ఎరుగని ఆకలి కేకలు.. మరోవైపు తినే ధాన్యాన్ని ఎథనాల్‌గా మార్చడానికి అనుమతి ఇస్తారా? ఎటువంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం?
ప్రశ్న : మీరు చెప్పినట్టుగా గత నాలుగు దశాబ్దాలుగా దేశం అనుసరిస్తున్న ఆర్థిక, రాజకీయ మోడల్‌ను కోవిడ్ పంచనామా చేసిందని చెప్పారు. శవం టేబుల్‌పై పడి వుంది. దాని లోపల చూసిన డాక్టర్‌కు డిజిటల్ డివైడ్ కనిపిస్తుంది. విద్యారంగం అస్తవ్యస్తమవ్వడం కనిపిస్తుంది. ఉపాధి అస్తవ్యస్తం అవ్వడం కనిపిస్తుంది. వైద్య రంగం అస్తవ్యస్తం అవ్వడం కనిపిస్తుంది. ఆకలి మహమ్మారి కనిపిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మీరు ఎలా వర్గీకరిస్తారు? ఇది కపట ప్రభుత్వమా? అసమర్థ ప్రభుత్వమా? దీనిపై మీ స్పందన..?
సాయినాథ్: ప్రతి ఏడాది జూన్ 25న నేను రెండు విషయాలు చెప్తాను. జూన్ 25న మనం ఎమర్జెన్సీని గుర్తు చేసుకుంటాం. కానీ గత 30 ఏండ్లుగా ఎమర్జెన్సీని సంస్థాగతం చేస్తున్నాం. కేవలం ఈ ప్రభుత్వమే కాదు.. యూపీఏ ప్రభుత్వం కూడా చాలా చేసింది. అరుణ్ శౌరి ఈ ప్రభుత్వాన్ని బాగా వర్ణించాడు. ‘బీజేపీ ొ కాంగ్రెస్ + ఆవు’ అని. ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ చేసిన నష్టాన్ని ఈ ప్రభుత్వం స్టెరాయిడ్స్‌తో చేస్తుందని చెప్పవచ్చు. ఎమర్జెన్సీలో అధికార కేంద్రీకృతాన్ని చూశాం. కానీ గత ఆరేండ్లలో టెర్రర్ ఔట్‌సోర్సింగ్ (మూకదాడులు)ను చూస్తున్నాం. ఎమర్జెన్సీలో రాజ్యం అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే మనస్తత్వాన్ని పౌర సమాజం అభివృద్ధి చేసుకుంది. కానీ, 2014 నుంచి రాజ్యం నుంచి వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌కు ఔట్‌సోర్సింగ్ అయింది. ఈ ఔట్‌సోర్సింగ్‌కు భారత సమాజం సిద్ధంగాలేదు. మైనార్టీలపై దాడులు, హింస, రక్తపాతం… ఇవి చూస్తుంటే, అధికార రాజ్య అణచివేత నుంచి సోషియోపాత్ (సైకో) రాజ్యం దిశగా మారుతున్నామనిపిస్తున్నది. ప్రతీకార, దుష్ట ప్రభుత్వాలను చాలా చూశాం. మోడీ ప్రభుత్వమే అలా ఉన్నది, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అలా లేదని నేను చెప్పను. అలా చెప్తే అది అబద్ధమవుతుంది. ఎందుకంటే గత 2-3 దశాబ్దాలుగా గ్రామీణ భారతంలో ఎం జరుగుతుందో నాకు తెలుసు. యూపీఏ సమయంలో కూడా జరిగింది. కానీ వీళ్లు దీనిని ఇంకో అంతస్తుకు తీసుకెళ్ళారు. ఇంతకు ముందు జరిగిన సంఘటనలు దీని ముందు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
నాకు అర్థం కాని విషయం ఏంటంటే… వారికి తమ ప్రత్యర్థిని ఓడించడమే సరిపోదు. ఆ వ్యక్తిని అవమానించి… వ్యక్తిత్వాన్ని భంగపరిచి.. హత్యచేస్తున్నారు. ఇక్కడ రాజ్యం ఒక సోషియో పాత్‌లాగా కనిపిస్తుంది. ఎందుకంటే.. ఎమర్జెన్సీలో పోలీసులు జైలులో పెట్టేవారు. కానీ, ఇక్కడ పెయిడ్ ట్రోల్స్‌తో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్మీ ఉంది. వారు అందరి వెంటా పడతారు. వారు పెయిడ్ అని ఎలా చెప్పొచ్చంటే… రైతు ఆత్మహత్యలపై నేను వ్యాసం రాస్తే… ఓ రెండు వందల మందికిపైగా ట్రోల్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలపై ఏమన్నా అన్నారా అని నన్ను ప్రశ్నిస్తారు. రైతు ఆత్మహత్యల స్టోరీని బయటపెట్టిన వ్యక్తిని నేనే. ముందే సిద్ధంచేసుకున్న కొన్ని స్పందనలను వారు పోస్టు చేస్తారు. ఏ విషయం పైనా వారికి అవగాహన ఉండదు. ఇక ఈ దాడులు 9-5 గంటల మధ్యలోనే ఉంటాయి. ఎందుకంటే పనిగంటలు అవే కాబట్టి. ఇది నిజం.
కార్పొరేట్ల గుప్పెట్లో మీడియా..
మరో వైపు ఇండియన్ మీడియా 200 ఏండ్లలోనే ఇప్పుడు ఘోరమైన స్థితిలో ఉన్నది. కార్పొరేటీకరణ మీడియాను ఎలా మారుస్తున్నదో 20 ఏండ్లుగా నేను చెప్తూనే ఉన్నాను. హిందూకు జరిగింది. టైమ్స్‌కూ అదే జరిగింది… గత నాలుగు నెలల్లో 1000 మందికి పైగా జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోయారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించటానికి కరోనా మహామ్మారి కేవలం ఒక వంక మాత్రమే. 2009లో ఎన్నికల ముందు ఓ హెడ్లయిన్‌లో ఇలా రాశారు… ‘ఏం సంక్షోభం.. ఆర్థికం బాగానే ఉంది’ అని.. మరోవైపు జనాలను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. నోట్లరద్దు తర్వాత అదే జరిగింది. ఇప్పుడు మళ్లీ జరుగుతున్నది. 2018 నుండి వేలాది మంది జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోతూనే ఉన్నారు. జర్నలిస్టుల అవసరం ఎక్కువగా ఉన్న ఇలాంటి సమయంలో ఉద్యోగాల నుంచి తీసేస్తే… దానివల్ల కోవిడ్‌పై కవరేజ్‌కు పరిమితులొచ్చాయి. వలస కార్మికులు నడుస్తుంటే కొన్ని కొన్ని స్టోరీలు వచ్చాయి… కానీ స్టోరీ కంటిన్యుటీ లేదు. మరో విషయమేంటంటే… సరైన ప్రశ్నలు వేయటంలో మీడియా విఫలమైంది. ఆ సత్తా మీడియాలో గతంలో లేదు.. ఇప్పుడూలేదు.
అనువాదం: ఎం. శ్వేత (హెచ్‌సీయూ విద్యార్థి)
Courtesy Nava Telangana